రామాయణమ్ – 85
మారీచుడిని సంహరించి వడివడిగా అడుగులు వేస్తూ గుండెల్లో ఏదో గుబులురేగుతుండగా పరుగెడుతూ వస్తున్నాడు రామచంద్రుడు.
ఇంతలో ఎడమవైపునుండి భయంకరముగా నక్క ఊళవేసింది. ఆ శబ్దము కర్ణకఠోరంగా ఉండి మనసులో శంకలు రేపింది.
సీత క్షేమమేనా?
Also read: సీతమ్మకు గడువిచ్చి అశోకవనమునకు తరలించిన రావణుడు
ఆ ఆలోచన వచ్చినదే తడవు ఆయన నడకలో వేగం హెచ్చింది. లోలోపల తర్కించుకుటున్నాడు. ఆ మారీచుడు అలా అరచినందువలన సీత భయపడి తప్పకుండా లక్ష్మణుని నా వద్దకు పంపుతుంది.
ఒంటరి దానిని సీతను రాక్షసులు భక్షించి ఉండలేదు కదా?
మరల సీతను చూడగలనా?
ఈ ఆలోచన ఆయన మనస్సులో అంతులేని ఆందోళనకు కారణమయ్యింది.
ఇంతలో మృగపక్షిసంఘాలన్నీ దీనంగా తనవైపే చూస్తూ కనపడ్డాయి.
సీత క్షేమమేనా?
Also read: ‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత
అల్లంత దూరంలో తమ్ముడు లక్ష్మణుడు తనకెదురుగా వస్తూ కనపడ్డాడు.
సీత క్షేమమేనా?
ప్రశ్నించసాగింది రామయ్య మనస్సు!
లక్ష్మణుడు తనను సమీపించగానే ఆయన కుడిచేయి తనచేతిలోకి తీసుకొని సీతను విడిచి వచ్చినావు నీవు. ఎంత చెడ్డ పని చేసినావని పలికి, అంతా సవ్యముగానే ఉంటుందికదా? అని అనుమానం వ్యక్తంచేశాడు.
‘‘లేదు. నాకు అశుభశకునాలు కనపడుతున్నాయి. సీతక్షేమముగా ఉండి ఉండదు. నశించిపోయి ఉంటుంది. నాకేమీ సందేహములేదు. రాక్షసులు పన్నిన పన్నాగమిది. సీత మరణించి అయినా ఉండవలే, అపహరింపబడి అయినా ఉండవలె!
Also read: రావణ ఖడ్గప్రహారంతో కుప్పకూలిన జటాయువు
‘‘లక్ష్మణా, ఎవ్వరు లేకుండా నేను ఒక క్షణమైనా జీవించలేనో ఆ నా సీత ఎక్కడ? నన్ను విడిచి ఉండలేక నన్ను అనుసరిస్తూ వచ్చిన నా సీతను ఒంటరిగా వదలి వచ్చావా? నా ప్రాణము ఎక్కడ? సీత లేకుండా దేవలోకాధిపత్యము, భూలోకచక్రవర్తిత్వము నేను కోరను. నాకు ఇష్టము లేదు! సీతకోసమై నేను మరణించిన పిదప నీవు అయోధ్య చేరిన ఎడల కైక ఆనందించునుగదా!
‘‘నేను ఆశ్రమమునకు వెళ్ళిన వెంటనే ఎదురొచ్చి సీత నవ్వుతూ నన్ను పలుకరించనట్లయిన ఎడల నాకు మరణమే శరణ్యము. ఆ రాక్షసుడు అలా గట్టిగా అరచినప్పుడు నీకు కూడా భయము కలిగి యుండును. నిన్ను త్వరపెట్టి బహుశా సీతే నా వద్దకు పంపి ఉంటుంది. నీ మీద విశ్వాసముంచికదా నేను వచ్చినది? ఏల నీవు సీతను వదలి వచ్చినావు? నరమాంస భక్షకులైన రాక్షసులు నేను ఖరుడిని చంపుటవలన దుఃఖితులై మనమీద తీవ్రమైన క్రోధము పూని ఉన్నారు’’ ఇలా విలపిస్తూ తమ ఆశ్రమ ప్రాంతానికి తిరిగి చేరినారు అన్నదమ్ములిరువురూ.
దారిలో కనపడిన జంతువులను, చెట్టు పుట్టలను ప్రశ్నిస్తూ తమ నివాసానికి చేరుకున్న రామలక్ష్మణులకు శూన్యమై బోసిపోయిన పర్ణశాల అగుపించింది.
Also read: రావణుడిని తీవ్రంగా హెచ్చరించిన జటాయువు
వూటుకూరు జానకిరామారావు