Thursday, November 21, 2024

సీతారామ పట్టాభిషేకం

రామాయణమ్ 225

‘‘రామచంద్రా ఇదుగో ఇది నీ రాజ్యము.

మంచి బలముగల గిత్తలాగగలుగు భారమును ఒక చిన్న లేగదూడ ఎలా మోయలేదో!

గుర్రము యొక్క నడకను గాడిద ఎలా అనుసరించలేదో!

రాయంచ నడకను కాకి ఎలా అనుసరించలేదో!

అలాగ నీవు మాత్రమే మోయగలిగిన ఈ రాజ్యభారమును అల్పుడను నేనెట్లు మోయగలనయ్యా?

మధ్యందిన మార్తాండుని వలే సింహాసనముమీద కూర్చుని ప్రకాశించే నిన్ను ఈ జగము ఇపుడే చూడగలదయ్యా.’’

అని పలుకుచూ భరతుడు రాముని ఎదుట దోసిలియొగ్గి నిలుచుండెను

Also read: రాముడికి పాదుకలు తొడిగిన భరతుడు

అటుపిమ్మట శత్రుఘ్నుని ఆజ్ఞమేరకు రామునికి  క్షురకర్మ చేయువారు,

నలుగుపెట్టి మంగళస్నాములు చేయించు దాసదాసీజనము సిద్ధముగా వచ్చి నిలుచుండిరి.

రాముడు జటలు విప్పించుకొని ఇంద్రనీలమాణిక్యములవంటి కురులను చక్కగా కత్తిరింపచేసుకొని స్నానము చేసి చందనాదులు వంటికి పూసుకొని చిత్రవిచిత్రములైన పుష్పమాలలు ధరించి వింతకాంతులతో మెరయుచుండెను.

దశరథుని భార్యలంతా తమ పెద్దకోడలు సీతాదేవిని చక్కగా అలంకరింపచేసిరి.

Also read: భరతునితో హనుమ సంభాషణ

కౌసల్యామాత తన పుత్రుడి ఆనందానికి కారకులయిన వానరుల భార్యలందరినీ సంతోషముగా, శ్రద్ధగా అలంకరింపచేసెను.

శత్రుఘ్నుని ఆజ్ఞమేరకు సుమంత్రుడు అందమైన గుర్రములను పూన్చిన, అలంకరింపబడిన రధమును తీసుకొని వచ్చెను.

రామచంద్రుడు రధమధిరోహించెను

సుగ్రీవ, హనుమంతులు మానవరూపములోయుండి దివ్యవస్త్రములను ధరించి సుందరమైన కుండలములు, ఆభరణములు అలంకరించుకొని రాముని వెంటవెళ్ళిరి.

సుగ్రీవుని భార్యలు, ఇతరవానరులభార్యలు సీతమ్మవెంట నగరమునకు కడు ఔత్సుక్యముతో వెళ్ళిరి.

శ్రీరామచంద్ర పట్టాభిషేకముకొరకు నగరులో సమాలోచనలు ప్రారంభమాయెను.

Also read: భారద్వాజ ముని ఆశ్రమంలో రామదండు విడిది

రాముని రధము సాగుతున్నది.

గుర్రముల కళ్ళెములు భరతుడు చేపట్టెను. రామునికి ఎండతగులకుండా శత్రుఘ్నుడు ఛత్రము పట్టెను. వింజామరలు లక్ష్మణుడు, రాక్షసరాజు విభీషణుడు వీచిరి.

సూర్యవంశమునకు కౌస్తుభమణియైనట్టి రామచంద్రమూర్తి, నల్లకలువలవలె సొగసైన కాంతికలిగిన దేహముతో, ఆ దేహముపై  బంగరు కుండలములు కదులుచుండగా  వాటి కాంతి ఆయన చెక్కిళ్ళపై మెరయగా వింతవింతకాంతులతో శోభిల్లుతూ రధముపై ఊరేగెను.

 స్థావరజంగమరూపుడైన ఆపరమాత్మను,

 ఆ దానవభంజనుని,

ఆ రావణారిని,

 దివినుండి దేవతలు, ఋషిసంఘములు, మరుద్గణములు స్తుతించుచుండగా ఆ మధురమధుర ధ్వనులు అయోధ్యాపురినావరించిన ఆకాశమంతటా వ్యాపించి వినువారి వీనులకు విందు చేసెను.

సుగ్రీవుడు శత్రుంజయమను పర్వతమువంటి ఏనుగునెక్కి ఊరేగుచూ వచ్చెను. వానరులందరూ మానవరూపములు ధరించి వేలకొలది ఏనుగులెక్కి వచ్చిరి.

Also read: పుష్కక విమానంలో సీతారామలక్ష్మణులూ, ఇతరులూ అయోధ్య ప్రయాణం

తూర్యములు, తాల స్వస్తిక వాద్యములు చేతులలో ధరించి మంగళవచనములు పలుకుచున్న వందిమాగధులు ముందునడవగా రాముడు అయోధ్యా పురప్రవేశముగావించెను.

వానరులు చేసిన ఘనకార్యములు అయోధ్యాపురవాసులు ఆశ్చర్యముతో కధలుకధలుగా చెప్పుకొనిరి.

శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు రాజులు నివసించినట్టిదియు, అంతకుముందు తన తండ్రిగారు నివసించిన గృహములో ప్రవేశించెను.

భరతుని వైపు చూసి ‘‘నీవు సుగ్రీవునకు నా గృహమును విడిదిగా ఇమ్ము’’ అని పలికెను. ఆ గృహము అందమైన వనములతోకూడి ముత్యాలపందిళ్ళతో వైఢూర్యమణులు పొదగబడి దేదీప్యమానముగా ప్రకాశించు శ్రేష్ఠమైన గృహము! భరతుడు సుగ్రీవుని చేయిపట్టుకొని తోడ్కొని వెళ్ళి ఆ ఇంట ప్రవేశ పెట్టెను.

అంత భరతుడు సుగ్రీవునితో  రామపట్టాభిషేకము కొరకై నాలుగు సముద్రములనుండి అభిషేకజలము తెప్పించవలెనని కోరెను.

.

సుగ్రీవుని ఆజ్ఞపై తెల్లవారుసరికి సుషేణుడు తూరుపుసంద్రమునుండి,ఋషభుడు దక్షిణసంద్రమునుండి,గవయుడు పడమట సంద్రమునుండి ,నలుడు ఉత్తరసంద్రమునుండి సువర్ణకలశములతో జలములను తెచ్చిరి.

 వాయునందనుడు జాంబవంతునితో కూడి అయిదువందల పుణ్యనదులనుండి జలకలశములు తెచ్చిరి.

మంత్రులతో కూడి శత్రుఘ్నుడు కులగురువు వసిష్ఠులవారివద్దకు వెళ్ళి రామపట్టాభిషేకమునకు సర్వము సిద్ధము అని తెలిపెను.

Also read: దివ్యవిమానములో దశరథ దర్శనం

వసిష్ఠులవారు సావధానచిత్తుడై శ్రీసీతాసమేతుడైన రామచంద్రుని రత్నపీఠము మీద కూర్చుండబెట్టెను.

సహస్రాక్షుడైన దేవేంద్రునివలే సింహాసనారూఢుడైయున్న రామచంద్రుని వసిష్ఠ,వామదేవ,జాబాలి, కాశ్యప, కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయులు అను ఎనమండుగురు మునులు అష్టవసువులవలే  సుగంధజలములతో అభిషేకించిరి.

వీరితోపాటగా ఋత్విక్కులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, దేవతలు, లోకపాలురు నలుగురు, అందరూ శ్రీరామచంద్రుని, సీతామహాదేవిని అభిషేకించిరి….

నదీజలములు, సముద్రజలములు, ఓషధీజలములు, వీటన్నిటితో జానకిరాములను అభిషేకించిరి.

పిమ్మట వసిష్ఠులవారు పూర్వము మనుచక్రవర్తిచేత ధరింపబడి ఆ తరువాత ఆయన వంశపు రాజులు తరతరాలుగా ధరించిన రత్నమయమై దివ్యకాంతులతో ప్రకాశించు కిరీటమును వేదఘోషల నడుమ శ్రీరామచంద్రుని శిరస్సుపై అలంకరింపచేసిరి.

శత్రుఘ్న,విభీషణ,సుగ్రీవులు ఛత్రము పట్టిరి

ఎచటనుండి వచ్చినదో ఒక తెల్లని పూలమాల నూరుపద్మములచేత కూర్చబడినద, గాలిలో సుతారముగా ఎగురుకుంటూ వచ్చి శ్రీరామచక్రవర్తి కంఠసీమను అలంకరించి మెరిసిపోతూ మురిసిపోయినది…

అది దేవేంద్రుడు పంపగా వాయుదేవుడు మోసుకొని వచ్చినది!

ఆ వెనుకనే ఒక తెల్లనిముత్యాలహారము వచ్చి రాముని గళమునచేరి నీలపు కాంతులీనినది.

గంధర్వగానమునకు దేవతలనాట్యము తోడై అది ఇంద్రుని సభను తలపించినది.

రాముని అభిషేక మహోత్సవసమయమునందు పంచభూతములు సంతసించినవి.  పుడమితల్లి పులకించి  సస్యసమృద్ధమాయెను. వాయువు సుగంధములు మోసుకొని వచ్చెను. ఆకాశము నందు ఇంద్రధనుస్సులు గోచరించి లోకమును రంగులలో ముంచెత్తెను.

శ్రీరామచంద్రుడుసీతామహారాజ్ఞి అచట చేరిన వారందరికి విరివిగా దానములొసంగిరి .

రాముడు తనమెడలోని ముత్యాలహారమును దీసి పడతిసీతకిచ్చిదీనిని ఎవరికి ఇచ్చెదవు అన్నట్లుగా చూసెను ,సీతమ్మతల్లి క్షణకాలముకూడా ఆలోచించక ఆ హారమును  హనుమంతునకు బహుకరించెను.

తదుపరి భరతుడు యువరాజుగా అభిషేకింపబడెను.

సీతమ్మతో కూడి అనేక యజ్ఞములు చేసి  రామచంద్రుడు దేవేంద్రుని వలె ప్రకాశించెను.

ప్రజలంతా సుఖశాంతులతో ధనధాన్యసమృద్ధితో హాయిగా జీవించిరి.

Also read: అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు

….

లక్ష్మీనృసింహ శ్రీరామయణమ్ ..సమాప్తము

.

NB

.

ఆ రామచంద్రుడే నాతో 455 రోజులు వ్రాయించినాడు …ఒక బద్ధకస్తుడనైన నాకు ఇంత శ్రద్ధకలిగినదంటే అది రామమహిమ కాక మరేమిటి?

ఒక పామరుడిని నేను! భాషలో భావము తెలియచేయుటలో ఏవైనా తప్పులు దొరలినచో అవి తెలియక చేసినవే పెద్దమనస్సుతో క్షమించగలరు…..

ఈ రామాయణం భద్రాచలంలో మొదలుపెట్టి

ఒంటి మిట్ట కోదండ రామాలయం లో పూర్తి చేశాను. మొదలు పెట్టడము పూర్తి చేయడము ఈ రెండూకూడా అనుకోకుండా నా ప్రమేయము లేకుండా  జరిగిన సంఘటనలే !

 శ్రీరామచంద్రమూర్తి నాచే ఈ కార్యముచేయించినాడు తప్ప  నాకంత శక్తిలేదు వ్రాయగలిగేటంత  ఊహకూడా లేదు.

వూటుకూరు జానకిరామారావు

(ఇదే రచయిత రాసిన ‘‘భగవద్గీత’’ ధారావాహిక రేపు ప్రారంభం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles