రామాయణమ్ – 175
మా భరతుడు నాకు జ్ఞాతి , రాజ్యము అతను కోరకుండగనె తల్లి అతనికి సంపాదించి పెట్టినది. రాజ్యార్హత అతనిదే.
మా తండ్రిగారు అందుకు సమ్మతించినారు కూడా. అనాయాసముగా తల్లి అడిగిన వరము ద్వారా సంక్రమించిన రాజ్యలక్ష్మిని అన్న నైన నాకొసము తృణ ప్రాయముగా వదులుకొనుటకు సిధ్ధపడినాడు.
మా భరతుని మంచితనము చూడుము. నన్ను అనుసరించి నన్ను వెదుకుతూ అడవికి వచ్చి ‘‘అన్నా, రాజ్యము నీదే నాది కాదు. అందుకు అర్హుడవు నీవె’’ అని ప్రాధేయ పడినాడు.
ఇట్టి సొదరుడు ఎచట వుండును?
ఇక లొకములొని కొడుకులలొ నా అంత భాగ్యశాలి అయిన వాడు ఎవడూ ఉండడు. తండ్రి ప్రెమను సంపూర్ణముగా చూరగొన్నవాడె అదృష్టవంతుడు. నా తండ్రికి నా మీద గల ప్రేమ ఇంత అంత అని చెప్ప తరమా? నన్ను వదలిన వెంటనె స్వర్గస్తుడైనాడు. అందుచేత పుత్రులలొ నెను గొప్పవాడను.
ఇక మిత్రులలొ నీ వంటి వాడు ఎవ్వడూ కానరాడు. పరుషముగా దూషించిన మిత్రుని భరించి, ఆతని కార్యమునకు తన సకల శక్తులూ వినియోగించువాడు గొప్పవాడు కాదా?
నాలుగు నెలలు వర్షాకాలము కిష్కింధలొ ఉండమని నేనే చెప్పితిని.
వర్షము వెనుకబడగానె నీవు నాకు ఏమీ చెయ్యలేదని నిన్ను దూషించినా భరించి నన్ను అనునయించి నా కార్య సాఫల్యమునకు సర్వ శక్తులూ ధారవోయు నీ వంటి మిత్రుడెచట లభించునోయి!
కావున మిత్రులలొ నీవు శ్రేష్ఠుడవు.
అనుచూ శ్రీరామచంద్రుడు కొనసాగించెను.
‘‘ఓ రామా, ఈతడు రావణుడు పంపిన గూఢచారి కావచ్చును. కావున నలుగురు సహచరులతో సహా ఆతనిని చంపివేయుదము’’ అని సుగ్రీవుడు రామునితో పలుకగా ఆ మాటలు విని కాసేపు దాశరధి మౌనము పాటించెను.
మిత్రమా, ఈ రాక్షసుడు దుష్టుడైనను కాకపోయిననూ నాకు ఏమీ భయము లేదు. ఇతడు నాకు ఏ విధముగనూ అపకారము చేయలేడు. చేయజాలడు.
.
సుగ్రీవా నేను తలచుకొన్నచో నా ఈ ధనుస్సునుండి సంధించిన బాణములు సకల పిశాచ,రాక్షస గణములను క్షణములో రూపుమాపగలవు.
పూర్వము “కండువ” అను ఒక మహర్షి చెప్పిన వచనములను వినుము…..
‘‘క్రూరుడు అయిన శత్రువు తన వద్దకు వచ్చి అంజలి ఘటించి కాపాడమని ప్రార్ధించినపుడు, తనకు చెడు పేరు రాకూడదు అని తలపోయు రాజు అతనిని చంపకూడదు. తన శరణుజొచ్చిన వానిని ఏకారణముచేతనైనా రక్షించలేకపోయినచో అతడు నిందితమైన పాపము చేసినవాడగును.
తాను శరణు ఇచ్చిన వాడు తన కళ్ళముందరే ప్రాణము విడిస్తే, అది పుణ్యమును నశింపచేయును.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ
‘‘ఎవ్వడైననూ వచ్చి నేను నీవాడను అని చెప్పుచూ ఒక్కసారి శరణుపొందిన చాలును, వానిని సకలప్రాణులనుండి నేను కాపాడెదను…ఇది నా వ్రతము…’’
అని రామచంద్రుడు దృఢచిత్తుడై పలికెను.
వూటుకూరు జానకిరామారావు