రామాయణమ్ – 63
అగస్త్య మహర్షి ఆశ్రమములోనికి ప్రవేశించాడు రాముడు. అక్కడ ఉన్న వివిధ దేవతల పూజా స్థానాలను చూస్తూ అడుగులు వేస్తున్నాడు.
ఆయనకు అక్కడ బ్రహ్మ , అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, వివస్వంతుడు, సోముడు, భగుడు, కుబేరుడు, ధాత, విధాత ,వాయువు, నాగరాజు, ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, వరుణుడు, కుమారస్వామి, యమధర్మరాజు …..ఇందరు దేవతల పూజా స్థానాలు కనబడ్డాయి.
Also read: అగస్త్య ముని చెంతకు సీతారామలక్ష్మణులు
నడుస్తున్నాడు రామచంద్రుడు.
రాముడికి ఎదురు రానే వచ్చారు అగస్త్యమహర్షి. ఆయనను చూడగానే ఆయన పాదాలు తాకి నమస్కరించి అంజలి ఘటించి నిలుచున్నారు మువ్వురూ ఆయన చెంత.
అగస్త్యుడు రామునకు ఆసనమిచ్చి కూర్చుండబెట్టి అర్ఘ్యప్రదానాదులచేత అతిధులను పూజించాడు. తరువాత ఆహారమిచ్చాడు. భోజనం చేసిన తదుపరి రాముడికి మరొక్కమారు తనివితీరా ఫలపుష్పాదులు ఇచ్చి , ఒక ధనస్సును, ఉత్తమమైన ఒక బాణాన్ని ఇచ్చారు మహర్షి.
Also read: రాక్షసులతో రాముడికి అకారణ వైరం ఎందుకు: సీతమ్మ ధర్మసందేహం
‘‘రామా, ఈ ధనుస్సు విష్ణుదేవునిది, దీనిని విశ్వకర్మ నిర్మించాడు. ఇదిగో ఇది బ్రహ్మ ఇచ్చిన బాణము’’ అని వాటిగురించి తెలిపి ఇంకా అక్షయ తూణీరము, దేవేంద్రుడు ఇచ్చిన స్వర్ణఖడ్గము కూడా ఇచ్చాడు.
‘‘రామా, ఈ ఆయుధాలు సామాన్యమైనవి కావు. వీటివల్ల నీకు ఎల్లప్పుడూ జయము లభిస్తుంది’’ అని తెలిపారాయన.
అగస్త్యుడు అప్పుడు విదేహరాజపుత్రి ముఖంలోని అలసటను గమనించారు. ఆవిడను ఒక్కసారి చూసి…
‘‘రామా !! ఈ జనకుని కూతురు ఎవ్వరూ చేయలేని పని చేసిందయ్యా! అత్యంత క్లిష్టమైన, దుఃఖతరమైన వనవాసాన్ని భర్తకోసం కోరి వరించిందయ్యా. ఎంతో సుకుమారి. చాలా కష్టపడుతున్నది రామా! ఆవిడ ముఖములో నాకు అలసట స్పష్టముగా కనపడుతున్నది. ఇక్కడ ఆవిడ సుఖముగా ఉండేటట్లు చూసుకో.
Also read: దండకారణ్యంలో నివాసయోగ్యమైన స్థలంకోసం రాముడి అన్వేషణ
సహజంగా ఆడువారిలో .. మెరుపులో ఉండే చంచలత్వము, ఆయుధాల కుండే తీక్షణత్వము ,గరుత్మంతుడికుండే వేగము ఉంటాయి. కానీ ఈవిడలో అవేవీ లేవు రామా! అరుంధతి లాంటిదయ్యా సీత.’’
అగస్త్య మహర్షి మాటలు విని ఆయనకు అంజలి ఘటించి ‘‘స్వామీ, మాకు వాస యోగ్యమైన ఒక ప్రదేశాన్ని చూపండి. అక్కడ పర్ణశాల నిర్మించుకొని జీవిస్తాము’’ అని వినయంగా పలికాడు శ్రీరాముడు.
అగస్త్య మహాముని వారిని తన ఆశ్రమములోనే ఉండమని. కానీ రాముడు తమకు చక్కటి వాసయోగ్యమైన ప్రదేశం ఒకటి చూపమని మహర్షిని కోరాడు.
Also read: దండకారణ్యంలో విరాధుడి వధ
రాముని ఆంతర్యం గ్రహించినవాడై అగస్త్యుడు, ‘‘రామా! ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ఫలపుష్ప భరితమైన సుందర ప్రదేశం ఉన్నది. అక్కడ మీరు మిగిలిన అరణ్యవాస కాలము పూర్తి చేసుకోవచ్చు.
అందుకు అది అనువైన ప్రదేశము.
‘‘దాశరథీ! తపః ప్రభావమువలన నాకు అంతా తెలిసినది.. మీకు శుభము కలుగుతుంది. వెళ్లి రండి. నీవు అరణ్యవాసము పూర్తిచేసుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళగలవాడవు. సుఖంగా వెళ్ళండి’’ అని పలుకగా మహర్షికి నమస్కరించి పంచవటి వైపుగా సాగిపోయారు సీతా రామలక్ష్మణులు.
మార్గమధ్యములో మహాకాయముతో ఉన్న ఒక పెద్ద గ్రద్దను రాముడు చూశాడు. అది ఎవరో మాయావి అయిన రాక్షసుడు అనితలచి, ‘‘నీవు ఎవరు?’’ అని గద్దించాడు.
అప్పుడు ఆ పక్షి చాలా సౌమ్యముగా ,మృదువుగా ‘‘రామా! నేను నీ తండ్రి స్నేహితుడను. నన్ను జటాయువు అంటారు, నా అన్న సంపాతి. మా తండ్రి పేరు అరుణుడు. నీకు ఇష్టమైన ఎడల వనవాసకాలములో నీకు సహాయకారిగా ఉంటాను’’ అని పలికాడు.
తండ్రి స్నేహితుడు అని తెలుపగానే చాలా ఆనందించి కౌగలించుకొని వారిరువురి స్నేహం గురించి మరల మరల ప్రశ్నించాడు రాముడు.
జటాయువుతో కూడా కలిసి పంచవటిలో ప్రవేశించాడు రాముడు.
అక్కడ లక్ష్మణుని చేతిలో చెయ్యివేసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగి పర్ణశాల నిర్మించడానికి అనువైన ప్రదేశం నిర్ణయించుకున్నాడు రామచంద్రుడు.
Also read: సీతారామలక్ష్మణుల అరణ్య ప్రవేశం
వూటుకూరు జానకిరామారావు