Thursday, November 21, 2024

సీతారామలక్ష్మణులకు అత్రి, అనసూయల ఆతిథ్యం

రామాయణమ్57

అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్న సీతారామలక్ష్మణులు ఆయనకు నమస్కరించి నిలుచున్నారు. వీరిని చూడగనే ఎక్కడలేని సంతోషము కలిగింది మహర్షికి. ఆయన రాముడిని స్వంత కొడుకులాగ ఆదరించాడు. స్వయంగా తానే ఆతిధ్యమిచ్చాడు.

ఆయన తన భార్య అయిన అనసూయాదేవిని అక్కడికి పిలిచి ఆమెసముఖంలో మంచిమాటలతో వారిని సంతోషపెట్టాడు.

సీతాదేవిని అనసూయదేవికి అప్పగించి ఆవిడగూర్చి రాముడితో, “ఈవిడ అనసూయ. గొప్పతపఃసంపన్నురాలు. పదివేల సంవత్సరములు తపస్సు చేసినది. ఎన్నో వ్రతాలు పూర్తిచేసినది. ఈమె తన గొప్పపనులచేత “అనసూయ” (కోపము,అసూయ లేనిది) అని లోకంలో ప్రసిద్ధి చెందినది”. …అని తెలిపారు మహర్షి అనసూయామాత వద్దకు సీతాదేవి వచ్చి ఆవిడకు ప్రదక్షిణము చేసి వినయంగా తన పేరుచెప్పి నమస్కరించింది.

Also read: రాముడి పాదుకలతో చిత్రకూటం నుంచి అయోధ్యకు బయలుదేరిన భరతుడు

అప్పుడు ఆ వృద్ధ తాపసి “అమ్మాయీ విన్నానే నీగురించి! నీవు ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావని తెలుసుకొన్నాను. బంధుజనాన్ని, అహంకారాన్ని వదలి అడవికివెడుతున్న నాధుడిని అనుసరిస్తున్నావు.ఏ స్త్రీ అయితే భర్త వనములో ఉన్నా, నగరములో ఉన్నా, వాడు పాపాత్ముడుకానీ, పుణ్యాత్ముడుకానీ అతనిని అనుసరిస్తూ ఉంటుందో ఆ స్త్రీ కి ఉత్తమ లోకములు కలుగుతాయి.’’

“సీతా, భర్తను మించిన బంధువు ఎవడైనా ఉన్నాడా? మనస్సును కామమునకి వశం చేసిన స్త్రీలు భర్తలమీద అధికారం చెలాయిస్తూ మంచిచెడ్డలు తెలుసుకోలేరు.”… అని తనను గూర్చి అనసూయామాత  పలికిన మాటలు విని సీతాదేవి

“అమ్మా, స్త్రీ కి భర్త పూజ్యుడు అనే విషయము నాకు తెలియును.  ఎంత చరిత్ర హీనుడైనా అతనిని తప్పక పూజించవలసినదే. అలాంటిది గుణములచేత శ్లాఘింపదగినవాడు, దయామయుడు, జితేంద్రియుడు, స్థిరమైన ప్రేమ గలవాడు, ధర్మాత్ముడూ, నాతల్లివలే, తండ్రివలే నాకు చాలా ఇష్టుడు అయిన నా భర్తగురించి వేరే చెప్పాలా? తన తల్లి కౌసల్యవిషయములో ఏ విధముగా ప్రవర్తించునో ఇతర రాజభార్యల విషయములో కూడా అలాగే ఉంటాడు రామచంద్రుడు. అంత ఎందుకు? దశరథుడు ఒక్కమాటు చూసిన స్త్రీని కూడా తన తల్లి లాగ గౌరవిస్తాడు. అమ్మా! నాకు నా తల్లి, అత్తగారు ఇరువురూ ఉపదేశించిన మాటలను మనస్సులో ఉంచుకొన్నాను. స్త్రీ కి పతి శుశ్రూషే పెద్ద తపస్సు వేరే ఏ తపస్సు అవసరములేదు. నాకు సావిత్రి, రోహిణి ఆదర్శము’’ అని పలుకుతున్న సీతమ్మను దగ్గరకు తీసుకొని ముద్దుగా శిరస్సుపై ఆఘ్రాణించింది అనసూయామాత.

(సీతాదేవి దృష్టిలో రాముడు ఎంత గొప్పవాడో చూడండి. అలాగే దశరథుడు ఎంత కాముకుడో కూడా గమనించగలరు. అంత కాముకుడైన తండ్రికి ఏకపత్నీవ్రతుడైన కొడుకు!)

Also read: తండ్రి ఆజ్ఞ అమలు కావలసిందేనన్నరాముడు

సీతాదేవిని చూస్తుంటే ఆవిడకు సంతోషం. ఆవిడ మాటలకు మెచ్చి ఏదైనా ఇవ్వాలనుకొని “సీతా! నీకు ఏమి వరము కావాలో కోరుకో అమ్మా! నీకు కావలసినది ఇస్తాను” అని పలికింది అనసూయామాత.

‘‘తల్లీ! నీ ఆప్యాయతే నాకు కొండంత వరము. నాకు అది చాలు’’ అని బదులిచ్చింది సీతమ్మ.

పెద్దలకు అనుగ్రహము కలిగితే ఆగరుకదా !

‘‘విదేహపుత్రీ! ఇదిగో నీకు దివ్యములు, శ్రేష్ఠములు అయిన ఈ పూలమాలలు, వస్త్రము, అలంకారములు, అంగరాగము, శ్రేష్టమైన మైపూతను ఇస్తున్నాను. ఇవి ఎల్లప్పుడు ఉంటాయి. ఈ వస్త్రము మాయదు, నలగదు. ఈ దివ్యమైన అంగరాగము పూసుకొని నీవు నీ భర్తను శోభింపచేయగలవు.

Also read: జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు

అనురాగంతో అనసూయామాత ఇచ్చిన వస్తువులు స్వీకరించింది సీతమ్మ.

స్థిరనియమాలు గల అనసూయా మాత తనకు ప్రియం కలిగించే ఒక విషయం సీతమ్మను అడిగింది.

‘‘అమ్మాయీ చెప్పవే నీ వివాహపు ముచ్చట్లు’’ అని సీతమ్మను దగ్గరగా కూర్చోపెట్టుకుని మురిపెంగా చూస్తూ అడిగింది ముదుసలి ముత్తయిదువ మహాసాధ్వి అనసూయా మాత.

ఆవిడకు సీతమ్మ చెప్పే కబుర్లు మహదానందాన్ని కలిగిస్తున్నాయి.

సీతమ్మ సవివరంగా తను తన తండ్రికి ఏవిధంగా దొరికింది, తన స్వయం వరాన్ని ఎలా ప్రకటించినదీ, మహర్షి విశ్వామిత్రులవారితో రామలక్ష్మణులు వచ్చిన సంగతీ, రాముడు ఏవిధంగా వింటిని ఎక్కుపెట్టి విరిచిన విషయము తెలిపింది.

Also read: తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు

‘‘రాముడు శివధనుర్భంగం గావించిన వెంటనే నన్ను రామునకు ఇచ్చుటకై నా తండ్రి చేతిలోనికి జలకలశము తీసుకొన్నాడు. కానీ, రాముడు అందుకు అంగీకరించలేదు. తన తండ్రీ, ప్రభువూ అయిన దశరథ మహారాజు అభిప్రాయము తెలుసుకొనకుండా స్వీకరించను అని వినయంగా మా నాన్నగారికి తెలియచేశాడు.

అప్పుడు జనకమహారాజు దశరధమహారాజుకు కబురుపెట్టి  ఆయన వచ్చి తన సమ్మతిని తెలియచేసిన తరువాత మాత్రమే నన్ను స్వీకరించాడు రాముడు. మా చెల్లెళ్ళకు కూడా అదే సమయములో లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో వివాహం జరిపించారు మా తండ్రిగారు.’’ అని తమ వివాహ వృత్తాంతాన్ని అనసూయామాతకు తెలిపింది సీతమ్మ.

(మన సినిమాలలో చూపించినట్లుగా విల్లువిరిచిన వెంటనే దండ రాముడి మెడలో వేయలేదు సీతమ్మ. తండ్రి అభిప్రాయము ముఖ్యము రాముడికి!  తండ్రికి ఆయన ఇచ్చిన గౌరవము అది!)

Also read: భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles