రామాయణమ్ – 37
రామా! ఇంక నీవు ముందుకు వెళ్ళవలదు అన్నట్లుగా తమసా నది అడ్డము వచ్చినది. అప్పటికే లోకములను తమస్సులు(చీకట్లు) కప్పివేసినవి. అది వనమందు వారికి మొదటిరాత్రి. ఆ అరణ్యమంతా కూడా నిశ్శబ్దరోదనము చేస్తున్నట్లుగా ఉన్నది.
‘‘లక్ష్మణా ఇది మనకు వనవాసపు తొలి రాత్రి ! నా మనస్సు చాలా ప్రశాంతముగా ఉన్నది. సకలసద్గుణ సంపన్నుడైన భరతుడి రక్షణలో మన తల్లితండ్రులకు ఏవిధమైన కొరత కూడా రాదు. అతడు వారిని తన అమృతహృదయంతో దుఃఖమునుండి ఓదార్చగలడు. లక్ష్మణా నన్ను అనుసరించి నీవు నాకు ఎంతో సహాయము చేశావు. సీతను రక్షించుకోవాలికదా! (ఇది మొదటిరోజే ఆయన నోట వెలువడిన మాట).
Also read: కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ
‘‘లక్ష్మణా నేడు మన దీక్షా ప్రారంభము. కావున రాత్రికి నేను మంచినీరు మాత్రమే త్రాగి ఉండగలను.ఈ వనములో ఫలములు సమృద్ధిగానే ఉన్నవి. అయినా నాకు ఇట్లా ఉండటమే ఇష్టము.’’
‘‘నీవు గుర్రముల సంగతి చూసుకొనుము’’ అని సుమంత్రుని ఆదేశించగా అతడు వాటికి పచ్చగడ్డి వేసి నీరు త్రావించి అవి సుఖముగా విశ్రాంతి తీసుకొనే విధముగా ఏర్పాటు చేశాడు.
తదుపరి సుమంత్రుడు సంధ్యోపాసనము పూర్తిచేసి సీతా ,రామ,లక్ష్మణులకు పక్కలు చెట్ల ఆకులతో ఏర్పాటు చేయగా సీతారాములిరువురూ శయనించారు. రాజాంతఃపురము బయట పట్టుపరుపులు లేకుండా నిదురించిన తొలిరాత్రి సీతమ్మకు.
లక్ష్మణునకు నిదురపట్టలేదు! తెల్లవార్లూ సుమంత్రుడితో రాముడి గురించే కబుర్లు చెపుతూ కాలక్షేపం చేశాడు.
వారి వెంట వచ్చిన పురజనులంతా చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఎవరికి అనుకూలంగా ఉండే స్థలంలో వారు నిద్రించారు.
. అది తెల్లవారుఝాము మూడుగంటల ప్రాంతము. రాముడు నిదురలేచి వారందరినీ ప్రేమగా చూసి లక్ష్మణునికి చూపుతూ, లక్ష్మణా! వీరంతా ప్రాణాలు విడుస్తారు కానీ మనలను విడువరు. లేవక ముందే మనము ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళటం మంచిది.
Also read: తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత
ఆలోచన వచ్చినదే తడవుగా సుమంత్రుని రధం సిద్దం చేయమని చెప్పి కొంతదూరం అయోధ్య వైపు వెళ్ళినట్లుగా వెళ్ళి మరల ఇంకొక దారిలో పయనించి ఆ చీకట్లలోనే తమసా నదిని దాటి ఆవలవైపుకు చేరి ప్రయాణం చేయసాగారు.
తెల్లవారేసరికి తమదేశపు సరిహద్దులు తాకారు.
తెల్లవారగనే జనులంతా మేల్కొని రధము అయోధ్యవైపు వెళ్లినట్లుగా గుర్తులను బట్టితెలుసుకొని వెనుకకు మరలినారు.
అయోధ్య చేరిన తరువాతగానీ వారికి అర్ధం కాలేదు రాముడే ఉద్దేశ్యపూర్వకముగా తమను మరల్చినాడని. రాముని తిరిగి తీసుకురాలేని దద్దమ్మలని ఊరూవాడా వారిని ఆడిపోసుకొంది.
——-
రాముడు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కోసలదేశాన్ని దాటి వాయువేగ మనోవేగాలతో రధం ప్రయాణం చేస్తున్నది. దారిలో వేదశృతి, గోమతీ, స్యందిక అనే నదులను దాటారు.
Also read: మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి
మధ్యమధ్యలో సుమంత్రుడితో ప్రేమగా సంభాషిస్తూ ఎంతో అందమైన నా జన్మభూమికి తిరిగి వచ్చి సరయూ నదిలో మరల ఎప్పుడు క్రీడిస్తానో కదా అని పలుకుతూ దారి పొడవునా ఉన్న అందమయిన ప్రదేశాలను సీతాదేవికి చూపుతూ ఉల్లాసంగా ముందుకు సాగుతున్నాడు.
దారిలో తనను కలువ వచ్చిన గ్రామస్థులు తనస్థితిని చూసి దుఃఖిస్తుంటే వారందరికీ హితముచేప్పి “ఎక్కువకాలము రోదించటము మంచిదికాదు. పాపము” (చిరం దుఃఖస్య పాపీయః)అని చెప్పి వారి తో మధురంగా సంభాషించి సాయంసంధ్యాసమయంలో కనుమరుగయ్యే సూర్యుడిలా కనపడకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు రామచంద్రుడు.
వెళ్ళి,వెళ్ళి ఉత్తుంగ తరంగాలతో, మంగళప్రదమై నాచులేకుండా నిర్మలంగా ఉన్నజలాలతో, దేవ, దానవ, గంధర్వ, కిన్నరులు సదా సేవించే గంగానదిని చూశారు వారు.
Also read: నారవస్త్రాలు ధరించిన సీతారామలక్ష్మణులు
ఆ గంగ నీరు కొన్నిచోట్ల అట్టహాసంగా భయంకరంగా ఉన్నది. కొన్ని చోట్ల జలతరంగఘోష మృదంగధ్వనిని పోలిఉన్నది. కొన్ని చోట్ల దీర్ఘంగా ప్రవహిస్తూ జలము అందమైన స్త్రీల పొడుగాటి జడలా వంపులు తిరిగి వయ్యారంగా సాగుతున్నది. కొన్నిచోట్ల సుడులుతిరుగుతూ చూసేవారికి భయంగొల్పుతూ ఉన్నది! కొన్నిచోట్ల విశాలమై తెల్లటి ఇసుకతిన్నెలు వ్యాపించి ఉన్నాయి.
హంసలు, సారసపక్షులు, చక్రవాకములు, నదిలోవిహరిస్తూ, క్రీడిస్తూ మనోహరమైన ధ్వనులుచేస్తూ సంగీతగోష్ఠులు జరుపుతున్నట్లుగా ఉన్నాయి. నది ఒడ్డున పెరిగిన వృక్షరాజములు పచ్చని మాలలవలే గంగాదేవిని అలంకరిస్తున్నాయి. ఏ విధమైన మలినములు లేకుండా నిర్మలస్ఫటికమణికాంతితో జలములు శోభిల్లుతున్నాయి.
ఇంత అందమైన గంగ ఒడ్డున ప్రయాణం చేస్తూ సీతారాములు తమను తాము మరచిపోయినారు. ఏకబిగిన ప్రయాణంచేస్తూ శృంగబేరిపురం వద్ద గంగానది సమీపంలోకి చేరుకున్నారు.
ఆ నది ఒడ్డున ఒక మహావృక్షము క్రింద ఆ రాత్రికి విశ్రమించాలని రామచంద్రుడు నిర్ణయించుకొని సుమంత్రుని రధం ఆపమన్నాడు.
శ్రీరామ ఆగమన వార్త ఏ గాలి చెప్పిందో తెలవదుగానీ రాముడి ప్రియమిత్రుడు, ప్రాణసమానుడు అయిన నిషాదరాజు గుహుడు పరివారంతో సహా అక్కడ వచ్చి వాలాడు.
Also read: దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ
వూటుకూరు జానకిరామారావు