Tuesday, December 3, 2024

అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు

రామాయణమ్31

‘‘లక్ష్మణా ! నీవు సుయజ్ఞుల వారింటికి వెళ్ళి వారిని సగౌరవముగా ఇచ్చటికి తీసుకొనిరా!  వశిష్ఠుల వారింట్లో మామగారిచ్చిన రెండు దివ్యధనువులు, రెండు దివ్యఖడ్గములు, అక్షయతూణీరములున్నవి అవి తీసుకొనిరా.’’

అన్న ఆజ్ఞను పాటించి అవి తీసుకొని వచ్చాడు లక్ష్మణుడు.

‘‘తమ్ముడూ నా సంపదలన్నీ బ్రాహ్మణులకు దానము చేయవలెనని నా కోరిక కావున వేగమే వారిని తీసుకొని రమ్ము’’ అని పలికాడు

వశిష్ఠుల వారి పుత్రుడు సుయజ్ఞుడు రామమందిరానికి లక్ష్మణునితో కలసి ఏతెంచాడు. ఆయనకు రాముడు తనవద్ద ఉన్న విలువైన ఆభరణములు, ఇతరసంపదలు, శత్రుంజయము అనే ఏనుగును ఇవ్వగా, ఆయన భార్యకు సీతమ్మ తన హారమును, వడ్డాణమును బహూకరించింది.

Also read: రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం

వచ్చిన బ్రాహ్మణులందరికీ ఘనంగా దానాలు చేశాడు రామచంద్రుడు. చిత్రరధుడు అనే రధసారధికి అమూల్యమైన రత్నములు, చిన్నిపశువులు, వేయిగోవులు ఇచ్చాడు.

అలా తన వద్దనున్న అందరికీ, అందరు పనివారికీ ఎల్లరూ సంతోషపడేటట్లుగా తన సమస్తసంపదలు దానం చేశాడు రాముడు. ఇలాగ రాముడు తన సంపదలన్నీ దానం చేసిన తరువాత ఆయన మందిరంలోకి ఎముకల ప్రోవులాగా బక్కపలుచగా ఉండి అపూర్వమైన తేజస్సుతో కనపడుతున్న ఒక ఆకారం నడుచుకుంటూ వచ్చింది ఆచ్ఛాదనగా అంగవస్త్రం మాత్రమే ఉన్నది.

రాముడు దానాలిస్తున్నాడని తెలిసి అతని భార్యపంపగా ఆశతో వచ్చాడు. ఆయన ప్రస్తుతము గునపము, తట్ట పట్టుకొని కందమూలఫలములు ఏరుకుంటూ జీవిస్తున్నాడు. రాముడివద్దనుండి దానం పుచ్చుకుంటే దరిద్రం తీరుతుందనే గంపెడాశతో వచ్చాడు.

Also read: సీతారాముల సంభాషణ

ఆయన పేరు త్రిజటుడు!

ఆయన రాముని వద్దకు వచ్చి ‘‘రామచంద్రా పిల్లలుగలవాడను. వారిపోషణ భారముగా నున్నది. నీవిచ్చే దానము స్వీకరించాలనే పెనుకోరికతో వచ్చానయ్యా!

అతనిని చూడగనే రామునికెందుకో పరిహాసము జనించింది!

పరిహసిస్తూ నీ చేతిలోని దండము నీవెంతదూరము విసరెదవో అంత పొడవునా ఉండే సహస్రగోసముదాయములు నీకు ఇచ్చెదను అన్నాడు. ( స్వామికి కూడా పరిహాసము పుట్టించేటంత బలహీనంగా ఉన్నాడాయన).

ఆ త్రిజటుడు సంతోషించి చేతిలోని దండాన్ని బలంకొద్దీ విసిరాడు ఆ దండము సరయూ నదిని దాటి వేలకొలదీ ఆవులున్న మందలు ఆబోతుల మధ్యలో పడింది.

రాముడు వెంటనే ఆ వృద్ధబ్రాహ్మణునుని కౌగలించుకొని ఆయనకు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని గోవులనూ గోపాలకులతో సహా ఇచ్చివేసి ఆయనను బ్రతిమాలుకున్నాడు

‘‘మహాత్మా నన్ను క్షమించవయ్యా, నిన్ను పరిహసించాను. నా మీద కోపించకయ్యా నీవు. నీ తేజస్సు తెలుసుకోవలనే అలాగ చేశాను. నీకు ఇంకా ఏ కోరిక ఉన్నా చెప్పు నేను తీరుస్తాను’’ అని వినయంగా వేడుకున్నాడు.

‘‘రామా! దయాసముద్రా!  అమృతహృదయా! నాకింతకన్నా వేరే ఏమీ అవసరము లేదయ్యా! నీ యశస్సు దశదిశలు వ్యాపించుగాక. నీ బలము, ఆనందము వృద్ధిపొందుగాక’’ అని ఆశీర్వదించి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు.

Also read: రామునికి లభించిన కౌసల్య అనుమతి

(ఎల్లవేళలా మనిషి ఒకే mood లో ఉండడు!

ఎన్నో భావాలు చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ఆ భావాలను మనము గమనిస్తున్నామా? లేదా? అనేదే ప్రశ్న!

.

భావాలను సాధారణంగా మనము గమనించము . మనలో చెలరేగే భావాలను ఒక సాక్షిగా మనము గమనించటం అలవాటు చేసుకోవాలి.  అది అలవాటయినప్పుడు ఒక వేళ పొరపాటు జరిగినా రాముడిలా సరిదిద్దుకోవచ్చు .

Continuous Self Introspection is needed.

అప్పుడే మనిషిగా మన ప్రయాణం మొదలయినట్లు!)

Also read: మర్యాదపురుషోత్తముడు రాముడొక్కడే!

‘‘రాజు పెద్దకొడుకును అడవికి వెళ్లమన్నాడట.  చిన్న భార్యమీది మోజుతో ఈ దారుణానికి ఒడిగట్టాడట.  ఎంత నిర్దయుడీ రాజు! ఎంత తెలివిమాలినవాడీయన!’’ రాముడిని అరణ్యాలకు పంపాలన్న కైక కుతంత్రము ,దశరథుడి ఆజ్ఞ, దావానలంలా వ్యాపించింది నగరమంతా.

ఎవరికి వారు తమకే అన్యాయం జరుగుతున్నట్లుగా భావించారు.

కొడుకు గుణవంతుడు కాకపోయినా సరే! వాడు కళ్ళెదురుగుండా ఉంటే చాలని సర్దుకుపోతారే లోకంలోని తల్లితండ్రులు! మరి దశరథుడికి ఏమయ్యింది? సకలగుణాభిరాముడు, మర్యాదా పురుషోత్తముడు, సాక్షాత్తూ ధర్మస్వరూపుడు, దయార్ద్రహృదయుడయిన రాముని అడవులకు పంపటమా?

జనుల ఆలోచనలు అలా సాగుతుండగనే ….

కదిలాడు కోదండపాణి భార్యాసమేతుడై. తమ్ముడు ముందు నడుస్తుండగా తండ్రికి మరొక్కమారు చెప్పి వెడదామని పాదచారియై తన భవనం నుండి బయల్వెడలాడు.

అయోధ్యా నగరమంతా సౌధాగ్రాలమీదనే ఉన్నది. ప్రజలందరూ వీధులలోకి చేరారు. ఇసుకవేస్తే రాలటంలేదు.

అందరి కన్నులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. జనం జనం జనం. ఎటు చూసినా జనమే. వారి రోదనమే! అందరి చూపులూ సీతారామలక్ష్మణులున్నవైపే.

కదిలితే సేవకులు, మెదిలితే పరిచారకులు, నగరంలో నడవటమంటే ఏమో తెలువదు. సకలరాజలాంఛనాలతో వెడలే రాజకుమారుడు, సుకుమారుడు నేడు కాలినడకన ఒంటరియై తండ్రిగృహానికి బయలుదేరాడు!

సీతమ్మ అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని కధలు కధలు చెప్పుకోవటమే కానీ ఎవరూ ఎన్నడూ చూడలేదు.

అదిగదిగో సీతమ్మ ! అబ్బ బంగారుతల్లి ! ఎంత చక్కనిది ! ఏడుమల్లెలెత్తు ! ఎండకన్నెరుగని ఇల్లాలు నేడిలా భర్తతో కలిసి అడుగులో అడుగులు వేస్తూ అడవికి బయలుదేరింది.

Also read: రాముడి మాట విని కుప్పకూలిన కౌసల్య

రాముడు లేని ఈ అయోధ్య మనకెందుకు! రాముడెక్కడుంటే అదే మన నివాసం అది కొండయినా, పెనుబండయినా! కడలైనా కారడవైనా! ఈ కొంపలు పాడుబెట్టేద్దాం. ఎలుకలు పందికొక్కులు తిరుగాడుతూ భూతాలకు నిలయమైపాడుబడ్డ అయోధ్యనే ఏలుకొంటాడు భరతుడు. మనమెందుకుండాలిక్కడ?

అందరిమనసులో ఒకటే నిశ్చయం. రాముడే మనకేడుగడ. రామునితోటే జీవనం. రాముడెక్కడుంటే మనమక్కడే! మానవీయజీవనానికి రాముడే మూలం. మనమంత కొమ్మలం రెమ్మలం.

మూలం హ్యేషమనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః

పుష్పం ఫలం చ పత్రంచ శాఖాశ్చాస్యేతరే జనాః

రాముడు ధర్మమే సారముగాగలవాడు. గొప్పకాంతికలవాడు. ఈతడే మనుష్యులకు “మొదలు.” ఇతర జనులందరూ ఈ చెట్టు మొదలుతో సంబంధముగల పుష్పములు, ఫలములు, పత్రములు, శాఖలు.

నడచి నడచి తండ్రిసౌధానికి చేరుకొని ద్వారపాలకుని పిలిచి తమ ఆగమన వార్త రాజుకు తెలుపమన్నాడు రాఘవుడు.

Also read: తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles