యోగా థిరపీలో పీహెచ్ డీ
వోలేటి దివాకర్
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి విభిన్న రంగాలలో ఎన్నో డిగ్రీలు సాధించి, అత్యంత వైవిధ్యం గల విద్యార్హతలు సాధించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డుల్లో ఇప్పటికే నమోదయ్యారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, న్యాయ శాస్త్ర విభాగాల్లో పిహెచ్ డి చేసిన ఆయన తాజాగా దేశంలోనే తొలిసారిగా యోగా థెరపీలో పిహెచ్ డి చేసి, డాక్టరేట్ సాధించారు.
ఈ సందర్భంగా మానస హాస్పిటల్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నాలుగేళ్ల కోర్స్ అయిన యోగా థెరపీలో పార్ట్-టైమ్ పిహెచ్.డి శ్రీ బాలాజీ విద్యాపీఠ్ (పాండిచ్చేరి) లో చేసినట్లు డాక్టర్ రామారెడ్డి చెప్పారు. శ్రీ బాలాజీ విద్యపీఠ్ పేరుకు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయినప్పటికీ నేక్ ఏప్లస్ ప్లస్ గ్రేడ్ కలిగి ఉన్నత ప్రమాణాలతో నడుస్తోందన్నారు. థీసీస్ ఆమోదించడం, పబ్లిక్ వైవాలో సమర్థవంతంగా సముచితంగా సమాధానాలు ఇవ్వడంతో
యోగా థెరపీలో పిహెచ్ డి ఇస్తున్నట్టుగా ప్రమాణపత్రం యూనివర్సిటీనుండి అందిందని ఆయన తెలిపారు.
బాలాజీ విద్యాపీఠ్ లో యోగా థెరపీలో పిహెచ్.డి లో ఏడేళ్ల క్రితం కోర్సులో చేరిన కొంతమంది అభ్యర్ధున్నప్పటికీ వారు ఇంకా కోర్సు పూర్తి చేయకపోవడంతో ఈ యూనివర్సిటీ నుండి ఈ సబ్జెకులో తొలిగా పిహెచ్.డి సాధించిన ఏకైక వ్యక్తిగా నిలవడం తనకు ఆనందంగా ఉందని డాక్టర్ కర్రి రామారెడ్డి చెప్పారు. బహుశా యోగా థెరపీలో దేశంలోనే ఇది మొదటి పిహెచ్.డి కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే యోగాలో పిహెచ్.డి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారని అయితే ప్రత్యేకంగా యోగ చికిత్సలో పిహెచ్.డి ఇదే మొదటిది కావచ్చుని ఆయన విశ్లేషించారు. యోగ చికిత్సలో ప్రత్యేకంగా డిప్లమో కోర్సులు, పీజీ కోర్సులు ఉన్నప్పటికీ పిహెచ్.డి కోర్సులు లేనందున ఇదే మొదటిది కావచ్చునని పేర్కొన్నారు.
బాలాజీ విద్యాపీఠ్ యూనివర్సిటీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ శాల్యుటోజెనెసిస్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అనే విభాగానికి డైరెక్టరుగా పనిచేస్తున్న డాక్టర్ ఆనంద బాలయోగి భవనాని తాను చేసిన పిహెచ్.డికి గైడ్ గా వ్యవహరించారని, అక్కడే స్కూల్ ఆఫ్ యోగా థెరపీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న డాక్టర్ మీనా రామనాథన్, అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో సైకియాట్రి ప్రొఫెసర్ డాక్టర్ మోపిదేవి విజయ్ గోపాల్ కోగైడ్స్ గా వ్యవహరించారని డాక్టర్ రామారెడ్డి చెప్పారు. కరోనా సమయంలో ఈ పిహెచ్.డి మొదలు పెట్టడం వలన మూడు నెలల్లో 4,400మంది మానసిక రోగులను చూడడం వలన అందులో ఈ పరిశోధన ద్వారా 667 మంది స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధిగ్రస్తులకు మందులతో పాటు విభిన్నమైన యోగ ప్రక్రియలు నేర్పించడం ద్వారా వారికి కలుగుతున్న మేలుని అధ్యయనంచేసినట్లు ఆయన తెలిపారు. సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలు, ప్రాణాయామాలు, ఓంకార జపం, రిలాక్సేషన్ యోగ, ఎనర్టైజర్ యోగ, వీటితోపాటు ఏరోబిక్ ఎక్సరసైజ్ గ్రూపు, అసలు ఏ యోగచికిత్స పద్ధతిని అవలంబించని గ్రూపు – వీటన్నింటినీ కూడా శాస్త్రీయ పద్ధతుల ద్వారా, ఈ పద్ధతులు అవలంబించడానికి ముందున్న పరిస్థితి,అవలంబించిన తర్వాత చక్కటి ఫలితాలు రావడాన్ని గమనించి, పరిస్థితి పోల్చి చూస్తే, ఇంచుమించుగా అన్ని రకాల పద్ధతులు కూడా అసలు ఏమీ చేయని వారి కంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసిన వారు, యోగ ప్రక్రియలు అవలంబించిన వారు లబ్ధి పొందినట్టు, ఏరోబిక్ ఎక్సర్సైజులు కంటే కూడా కొన్ని ప్రమాణాలలో యోగ ప్రక్రియ ముందంజలో ఉన్నట్టు ఫలితాలు లభించాయని డాక్టర్ రామారెడ్డి వివరించారు. పరిపూర్ణంగా చేసిన వాళ్ళకి, పాక్షికంగా చేసిన వాళ్ళకి కలిగిన భేదాలు కూడా నిరూపించబడ్డాయని ఆయన చెబుతూ, దీంతో ఇది అద్భుతమైన పరిశోధనగా అమెరికా పరీక్షాధికారి, భారతీయ పరీక్షాధికారి కూడా అభివర్ణించారని ఆయన చెప్పారు. పరిశోధన చేయడానికి కావలసిన ఎథిక్స్ వంటి అనుమతులు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ద్వారా డాక్టర్ గన్ని భాస్కర్ రావు సమకూర్చారని ఆయన చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు. బహుశా ముందు ముందు ఇదే యూనివర్సిటీలో మరొక సబ్జెక్టులో కూడా పిహెచ్.డి చేసే ఆలోచన చేస్తున్నట్లు డాక్టర్ రామారెడ్డి చెప్పారు.