రామాయణమ్ – 99
‘‘రామా, మేమందరమూ ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా ఒక స్త్రీ తన ఉత్తరీయమును, శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది. ఆ స్త్రీ ఒక రాక్షసుని ఒడిలో ఆడుపాము వలే దోర్లుచూ మిక్కిలి బాధతో రోదించుచూ మాకు కనపడినది. ఆమె జారవిడిచిన నగలన్నిటినీ మేము భద్రపరచితిమి.నేను వాటిని తీసుకొని వచ్చెదను నీవు గుర్తింపుము.
‘‘మిత్రమా ఆలస్యమెందులకు త్వరగా తీసుకొని రమ్ము’’ అని రాముడు పలుకగా సుగ్రీవుడు వాటిని తానే స్వయముగా గుహలోనికి వెళ్లి తీసుకొని వచ్చి ఆయన ముందుంచినాడు.
Also read: సుగ్రీవుని హృదయానికి హత్తుకున్న రాముడు
ఆ అలంకారములు, ఉత్తరీయము చూసిన వెంటనే రాముని కన్నులు పొగమంచు కప్పిన చంద్రుడి వలె బాష్పముచేత ఆవరింపబడినవి.
ఒక్కసారిగా ‘హా సీతా!’ అంటూ ఏడుస్తూ నేలపై బడి మూర్చిల్లి నాడు.
మరల కొంతసేపటికి తేరుకొని మాటిమాటికీ తన గుండెలకు ఆ నగలను దగ్గరకు చేర్చుకొని కలుగులో కోపముతో బుసలుకొట్టే పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నులనుండి ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూ ప్రక్కనే ఉన్న లక్ష్మణుని వైపు చూస్తూ కడు దీనంగా విలపించసాగాడు.
Also read: హనుమ వాక్పటిమ గురించి లక్ష్మణుడికి రాముడి వివరణ
‘‘లక్ష్మణా, ఇదుగో ఈ అలంకారాలు చూడు. పచ్చికమీద పడటము వలన విరిగిపోకుండా పూర్వమువలెనే ఉన్నవి.
అప్పుడు లక్ష్మణుడు, ‘‘అన్నా, నాకు కేయూరాలు కానీ, కుండలాలు కానీ తెలువవు. కానీ ఆవిడ కాలి నూపురాలను మాత్రము నేను గుర్తించగలను. నిత్యమూ ఆవిడ పాదాలకు వందనము చేయుదును కావున అవి నేను గుర్తుపట్టగలను. నిస్సందేహముగా అవి ఆవిడవే.’’
‘‘సుగ్రీవుడా, నా ప్రాణాధిక అయిన సీతను రావణుడు ఎటువైపుగా తీసుకొని వెళ్ళినాడో నీవు చెప్పగలవా? వానిని ఇప్పుడే యమ సదనమునకు పంపగలను’’ అని రాముడు కోపముతో సుగ్రీవుని వైపు తిరిగి పలికినాడు.
Also read: తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ
‘‘రామా, ఏల నీవు ఇలా బేలవైతే నీ వంటి ధీరునికి దుఃఖము శోభనివ్వదు. ఇదుగో చూడు నాభార్యను వాలి అపహరించలేదా? వానరుడ నైన నేను శోకిస్తున్నానా చూడు. ఆ రావణుడు ఎవ్వడో, ఎక్కడ ఉంటాడో, వాని సామర్ధ్యమేమో, వాని పరాక్రమమేమో, నాకు తెలవదు. కానీ, ముల్లోకాలలో ఎచ్చట ఉన్నా వాని ఆచూకి కనుగొని నీ సీత నీకు దక్కునట్లు చేసెదను. ఇది నా ప్రతిజ్ఞ.
‘‘ఆపత్సమయమందు కానీ, ధననాశము కలిగి నప్పుడు కానీ, ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు కానీ ధైర్య వంతుడు తన బుద్ధితో బాగుగా ఆలోచించుకొనును కానీ కృంగిపోడు. ఎవడు మూఢుడై తన వశములో తానుండక నిత్యమూ దైన్యములో కొట్టుమిట్టాడుకొనునో వాడు ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునుగునట్లు మునిగి పోవును’’ అని సుగ్రీవుడు అంజలి ఘటించి శోకములో మునిగిపోయి దీనుడై రోదిస్తున్న శ్రీరాముని ఓదార్చెను.
సుగ్రీవుని మాటలకు తన సహజ స్థితిని పొందినవాడైన రాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను.
Also read: కిష్కింధలో కలకలం
‘‘సుగ్రీవా, ప్రేమతో హితము గోరు స్నేహితుడు ఏమి పలుకవలెనో అవి నీవు పలికినావు. నీ వంటి బంధువు ఇటువంటి సమయములో ఎవరికీ లభించడు కదా! సుగ్రీవా, నీవు రాక్షసుని జాడ కనుగొనుటకు ప్రయత్నించుము. నేనేమి చేయవలెనో నాకు నీవు చెప్పుము. మంచి సుక్షేత్రమైన పొలములో వేసిన పంట చేతికొచ్చినట్లు నీ కార్యము సఫలము కాగలదు. సత్యముపై ఒట్టు పెట్టి పలుకుచున్నాను నీ కార్యము నెరవేరినట్లే అనుకొనుము’’ అనుచూ పలికిన రాముని పలుకులకు సంతసించినవాడై సుగ్రీవుడు మనస్సులో “నాపని నెరవేరినది” అని అనుకొనెను
అంత ఇరువురు మిత్రులూ ఏకాంతములో కూర్చొని తమ సుఖదుఖములను గూర్చి ముచ్చటించుకొనసాగిరి.
N.B
లక్ష్మణస్వామి మాటలు గమనిస్తే మనకు ఒకటి తెలుస్తుంది. తన భార్యకాని ఏ స్త్రీని అయినా మనము కాళ్ళను దాటి చూడరాదు అని. అందుకే ఆయన కేయూరాలు ,కంఠాభరణాలు గుర్తించలేకపోయాడు.
మనిషికి వికారము కలిగేది కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తేనే. లక్ష్మణస్వామికి గల ఈ సంస్కారం ఎంత గొప్పదో చూడండి. ఇది పాఠ్యాంశంగా పెడితే కొందరికయినా వంటబడితే సమాజంలో వచ్చే మార్పును ఊహించండి!
Also read: శబరికి మోక్షం
వూటుకూరు జానకిరామారావు