రామాయణమ్ – 213
‘‘విభీషణా, మహావీరుడు రణరంగములోనే మరణించాలని అనుకుంటాడు. మరి ఏ విధమయిన మరణము అతనికి ఇష్టము కాదు. నీ అన్న వీరాధివీరుడు!! అమిత పరాక్రమవంతుడు, ఆయన పరాక్రమమునకు ముల్లోకములు గజగజ వణకి పోయినవి.
‘‘యుద్ధములో ఎవరికి జయము కలుగునో ఎవరు చెప్పగలరు? ఎవరునూ నాకే విజయము లభించునని అనుకొన రాదు. యుద్ధములో వీరమరణము పొందిన వారిగురించి శోకించుట తగదని నీకు తెలియునుగదా!’’
Also read: రావణ సంహారం, విభీషణుడి విలాపం
అని పలికిన రాముని మాటలకు విభీషణుడు,
‘‘రామా, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చినా ఎదురొడ్డినిలచి వారిని జయించినాడు. పరాజయమన్నది ఎరుగనే ఎరుగడు. అట్టివాడు నేడు నీ చేతిలో భంగపడినాడు.
ఈతడు సామాన్యుడు కాదు.
అనేక దానములు చేసినాడు.
గురువులను పూజించినాడు.
దేవతలను పూజించినాడు.
భోగములెన్నో అనుభవించినాడు.
భాగ్యమన్న ఈయనదే.
మిత్రులకు ధనమొసంగినాడు.
శత్రువులపై పగ తీర్చుకొన్నాడు.
ఈతడు అగ్నిహోత్రమును ఎన్నడూ విడువలేదు.
మహాతపశ్శాలి.
తత్త్వము తెలిసినవాడు.
Also read: తెగి మొలచిన రావణు శిరస్సులు
ఈనాడు ఈయన కర్మకాండ చేయుటకు పుత్రులెవ్వరూలేరు…
రామా నీవు అనుమతించినచో ఆ కార్యము నేను చేయగలవాడను’’ అని నెమ్మదిగా జంకుతూ విభీషణుడు పలికెను
అప్పుడు కరుణాంతరంగుడు, దయాసముద్రుడైన రామచంద్రుడు ఇట్లనెను
‘‘విభీషణా, శత్రుత్వములు మరణముతో సమసిపోవును.( మరణాంతాని వైరాని). రావణుడు ఇప్పుడు నీకెంతో నాకు అంతే’’ అని రామచంద్రుడు విభీషణునకు అన్న కర్మకాండ చేయుటకు అనుమతినిచ్చెను.
రావణుడి మరణవార్త దావానలమువలె లంక అంతా వ్యాపించినది. అంతఃపురస్త్రీలందరూ ఒక్కసారిగా గుండెలు బాదుకొని ఏడుస్తూ జుట్టు విరబోసుకొని శోకముచేత పీడితులై బయటకు వచ్చిరి.
Also read: రాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించిన అగస్త్య మహర్షి
ఒక నల్లని కాటుకరాశివలె యున్న రావణుని మృతదేహము నేలమీద పడియున్నది. భర్తను ఆ స్థితిలో చూసిన వారంతా ఒక్కసారిగా ఆయన శరీరముమీద దభిల్లని కూలబడిరి.
ఒకరు పాదములను కౌగిలించుకొనిరి.
ఒకరు కంఠమును కౌగిలించుకొనిరి.
ఒకరు వక్షస్థలమును కౌగిలించుకొనిరి.
ఒకరు భుజములను పైకెత్తి తన శరీరమునకు ఆన్చుకొని నేలపైదొర్లుచుండిరి.
మరియొక స్త్రీ తమ భాగ్యము ఆవిధముగా అగుట చూసి తట్టుకొనలేక మూర్ఛపోయినది.
ఇంకొక భార్య రావణుని ముఖమును తన ఒడిలో ఉంచుకొని కన్నీటితో తడిపివేసెను.
Also read: రామ-రావణ భీకర సమరం
అందరు స్త్రీలు మరలమరల ఏవేవో మాటలాడుకొనుచూ గుండెలు బాదుకుంటూ పడిపడి ఏడ్వసాగిరి.
‘‘నాధా, నిన్ను ఒక సామాన్య మానవుడు హతమార్చినాడా? ఏమైనది దేవతలను ఎదిరించినప్పటి నీ పౌరుషము? దేవేంద్రునే గడగడ వణకించిన నీశౌర్యము ఎటుపోయినది? ముల్లోకములను నీ ఏలుబడిలోకి తెచ్చుకొన్న నీ రాజసము ఎచటకు పోయినదయ్యా? నేడిలా ఒక అల్పమానవుడు నిన్ను కడతేర్చుటయా! నీ హితము కోరు మిత్రుల మాట విననైతివి. నీ చావుకొరకే సీతను తెచ్చితివయ్యా! నీవు సీతను తిరిగి ఇచ్చి వేసినచో ఈ ఆపద వచ్చేది కాదుకదా! ఇది నీవు చేసిన పనికాదు. దైవప్రేరితము. దైవమే ప్రతిపనినీ చేయించును…’’అని పరిపరి విధములుగా వాపోవుచూ వ్యాకులచిత్తముతో కన్నీరు ధారలుకట్టి ప్రవహించుచుండగా వారందరూ రావణుని శరీరముపై బడి ఏడ్వసాగిరి.
Also read: మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ
వూటుకూరు జానకిరామారావు