Monday, January 27, 2025

తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత

రామాయణమ్ 35

మూర్ఛనుండి తేరుకున్న దశరథ మహారాజు ప్రక్కనే ఉన్న సుమంత్రుని చూసి ‘‘నీవు వీరి ప్రయాణమునకు కావలసిన ఉత్తమ అశ్వములు పూన్చిన రధాన్ని సిద్ధంచేయి. వీరిని మన దేశమునకు అవతల వున్న వనములలో విడిచిరా’’ అని ఆజ్ఞపించాడు

 గుణవంతుడైన వాడికి జరిగే సత్కారమిది. రాముడికున్న మంచిగుణములకు కలిగే ఫలమిది. అని అందరూ అనుకొంటున్నారు ( అని తనలో తనే అనుకున్నాడు దశరథుడు).

సుమంత్రుడు వెంటనే రధాన్ని సిద్ధం చేశాడు.

Also read: మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి

కోశాధికారిని పిలిచి కోడలికి పదునాల్గు సంవత్సరములకు అవసరమైన అమూల్యమైన దుస్తులు, ఆభరణములు (లెక్కకట్టిమరీ!) తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దశరథుడు.

ఆ ఆభరణాలను చక్కగా అలంకరించుకొని ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న సీతమ్మను దగ్గరకు తీసుకొని శిరస్సుపై ఆఘ్రాణించి, ‘‘సీతా! నేడు నాకొడుకు ధనములేని వాడని వాడిని అవమానించకమ్మా. లోకంలో చాలామంది స్త్రీలు భర్తచేత అంతకుమునుపు ఎన్ని సుఖాలు అనుభవించినప్పటికీ భర్తలకు కష్టకాలము దాపురించినప్పుడు అతనిని చులకనగా చూస్తారమ్మా. అవసరమైతే ఆ భర్తలను వదిలేస్తారు కూడా. భర్తలపై అనురాగము వారిలో ఒక ఎండమావి! కానీ గాఢమైన శీలము కలిగిన స్త్రీలు సత్యమునందూ, శాస్త్రమునందూ, సద్గుణములయందూ స్థిరచిత్తము కలిగినవారి హృదయములో  భర్తకు మాత్రమే విశిష్టస్థానముంటుంది. దానిని ఎప్పటికీ పదిలంగా ఉంచుకొంటారు’’ అని పలికింది కౌసల్యాదేవి.

Also read: నారవస్త్రాలు ధరించిన సీతారామలక్ష్మణులు

అత్తగారి మాటలు విన్న సీతమ్మ, ఆవిడకు నమస్కరిస్తూ, ‘‘పూజ్యురాలా!  నా భర్తవిషయములో ఎలా ఉండవలెనో పెద్దలద్వారా విని ఉన్నాను. నన్ను దుష్టస్త్రీల సరసన చేర్చకుమమ్మా! చంద్రుడినుండి కాంతివిడిపోతుందా? చక్రములేని రధము నడుస్తుందా? తీగలులేని వీణ మ్రోగుతుందా? మేమిరువురమూ “ఒకటి” తండ్రికానీ, తల్లిగానీ, కొడుకుగానీ స్త్రీ కి ఇవ్వగలిగనది పరిమితము. భర్త ఒక్కడే అపరిమితముగా ఇవ్వగలవాడు. ధర్మములోని సామాన్య విషయములు, విశేష విషయములు శ్రేష్ఠులైన వారి వద్దనుండి విని ఉండటమువలన నాకు వాటి పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నా భర్తను నేనెట్లా అవమానిస్తాను!’’ అని సవినయంగా బదులిచ్చింది జనకరాజపుత్రి!

నిత్యము మంగళవాయిద్య ధ్వనులతో మారుమ్రోగే రాజభవనము నేడు ఏడుపులు పెడబొబ్బలతో దద్దరిల్లిపోతున్నది.

Also read: దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ

రాముడు భార్యా, సోదరసమేతుడై తల్లికౌసల్యకు ప్రదక్షిణము చేసి నమస్కరించి అదేవిధముగా తక్కిన మూడువందలయాభైమంది తల్లుల వద్ద కూడా అనుమతి తీసుకొని తాను ఇదివరకెన్నడైనా అపరాధములు తెలియక చేసి ఉంటే మన్నించమని ప్రార్ధించి తండ్రికి కూడా ప్రదక్షిణ నమస్కారములాచరించి అక్కడే ఉన్న సుమిత్రామాత వద్దకు వచ్చినారు.

తనకు నమస్కరిస్తున్న తనకుమారుడు లక్ష్మణుని చూసి, ‘‘నాయనా, భగవంతుడు నిన్ను వనవాసము కొరకే సృష్టించినట్లున్నది. ఏ మాత్రము ఏమరుపాటులేకుండా రాముడిని రక్షిస్తూ ఉండు. నాన్నా! ఈ రాముడే నీకు దిక్కు. అతను కష్టాలలో ఉండనీ ఐశ్వర్యవంతుడుగా ఉండనీ గాక. నీ పెద్దన్నను నీవు ఎల్లప్పుడూ అనుసరించి ఉండు అది ధర్మము. నీ వొదిన సీతమ్మను కన్నతల్లి అనుకో. నీ అన్న రామయ్యను కన్నతండ్రి అనుకో. నీ వుండే అడవి ఉన్న ఊరు అయోధ్య అనుకో! హాయిగా సుఖంగా వెళ్ళిరా నాన్నా!’’ అని కొడుకు తల నిమురుతూ పలికింది సుమిత్రాదేవి.

Also read: అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు

రామం దశరథం విద్ధి మాంవిద్ధి జనకాత్మజామ్

అయోధ్యాం అటవీం విద్ధి గచ్ఛతాత యధాసుఖమ్.

రాముడు దశరథుడని, సీతమ్మ నేనేనని, అడవే అయోధ్య అని భావించుతూ సుఖంగా వెళ్ళిరా నాయనా!

NB

సుమిత్రామాత నోట వాల్మీకి మహర్షి పలికించిన ఆ మాటలకు కొన్ని విశేష అర్ధములు చెప్పారు కొందరు వ్యాఖ్యాతలు.

రాముని…… దశరథమ్ అనగా పక్షి రధముగాగల విష్ణువుగానూ,

 సీతాదేవిని …మామ్ అనగా లక్ష్మీదేవిగానూ, అడవిని …అయోధ్యామ్ అ  యోధ్యామ్ అనగా యుద్ధము చేయుటకు శక్యముగాని వైకుంఠముగా భావించుము అని వారివారి భావన!

రాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. సీతాదేవి లక్ష్మి. రాముడు నివసించే అడవి వైకుంఠము.

Also read: రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles