రామాయణమ్ – 165
వారు వానరులు!
వారి శరీరములు ఒక్కొక్కరిది ఏనుగంత!
కోట్లకొలదిగ ఉన్న వానరసైన్యం రివ్వుమంటూ గగనతలంలో మెరిసింది.
ఎగిరేవారు కొందరు, చెట్లమీద దూకేవారు కొందరు గర్జించెవారుకొందరు. శత్రువును
నిర్జిస్తామని కొందరు సింహనాదాలు చేసుకుంటూ కోలాహలంగా బయలుదేరారు.
పళ్ళగుత్తులతో వున్న చెట్లు పెకిలించి మోసేవారుకొందరు.
Also read: సముద్ర తీరానికి బయలుదేరిన వానరసేన
తేనెటీగలు చెదరగొట్డి పెద్దపెద్దతుట్టెలు మోసేవారు కొందరు.
మధుభక్షణం చేస్తూ కొందరు, ఫలభక్షణం చేస్తూ కొందరు.
పరస్పరము పైకి ఎత్తి పడవేస్తూ కొందరు.
భుజస్ఫాలనములు చేసుకుంటూ కొందరు.
అందరూ కదిలారు అవనిజ సీతమ్మచెర విడిపించడానికి.
పదికోట్ల సైన్యము శతబలి రక్షణలో ఉన్నది!
Also read: సముద్రము దాటే ఉపాయం కోసం అన్వేషణ
కేసరి, పనసుడు, గజుడు, అర్కుడు వీరు నూరుకోట్ల సైన్యపర్యవేక్షణ చేయుచుండిరి.
వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు వీరు నలుదిక్కులా తిరుగుతూ సేనను ఉత్సాహపరుస్తూ తొందరపెట్టుచూ ముందుకు నడిపించుచుండిరి.
అది వానర సైన్యమా లేక అరణ్యములో చెట్ల పైభాగముమీద కదులుతున్న సముద్రమా!
వారి నడక శత్రుభీకరము.
వారు చేసే కోలాహలము సముద్రఘోష!
వారి కదలిక ఉత్తుంగ కడలితరంగం!
సేన కదిలేవైపు అనుకూలంగా అనిలుడు వీస్తున్నాడు!
పక్షులన్నీ మధురస్వరంతో ధ్వని చేస్తున్నాయి.
Also read: సీతమ్మను చూసినట్టు శ్రీరామునికి తెలిపిన హనుమ
సూర్యుడు నిర్మలంగా ఉన్నాడు.
అనుకూల శకునాలు విజయతీరం చేరుతారు మీరు!
అచిరకాలంలోనే!
అని పలుకుతున్నట్లుగా ఉన్నాయి!
వానరులు దారిలో కనపడిన ప్రతిసరస్సులో స్నానమాడారు. ప్రతి చెట్టును పట్టుకొని వేళ్ళాడారు. ప్రతి తేనెతుట్టెనూ లేపారు. కలియదిప్పని సరస్సు గాని
విరగ గొట్టని చెట్టుగానీ, రాళ్ళు పడదోయని గిరులు గానీ, ఎగురగొట్టని కొండగానీ
మిగులలేదు.
పిమ్మట వారు మహేంద్ర పర్వత సానువులు సమీపించిరి.
అక్కడనుండి ప్రళయతరంగ ఘోషలతో ఉన్న అపారపారావారమును కనుగొన్నారు.
‘‘సుగ్రీవా, ఇదుగో సముద్రము దీనిని దాటుట ఎట్లా?’’ అని రామచంద్రుడు పలికెను.
అది మహేంద్రగిరి!
Also read: ‘సీతమ్మను చూశాను,’ జాంబవంత, అంగదాదులతో హనుమ
అనిలుడు ఆహ్లాదకరంగా సముద్రపు చల్లదనాన్ని మోసుకొస్తున్నాడు.
రామలక్ష్మణులు ఆ పర్వతము మీద ఒక చోట నిలుచొని ఉన్నారు.
అటు చూశాడు రాముడు! ఎగసిపడే కెరటాలతోఅపార వినీల జలరాశి.
ఉత్తుంగ తరంగమృదంగ ఘోషలతో గంభీరంగా నన్నెట్లా దాటగలవు అని ప్రశ్నిస్తున్నట్లుగా సముద్రుడు.
ఇటు చూశాడు దాశరధి.
అపరిమిత రణోత్సాహంతో కేరింతలు కొడుతూ ఎప్పుడు యుద్ధము మొదలవుతుందా ఎప్పుడుతమ బలప్రదర్శన చేసే అవకాశమొస్తుందా అని జబ్బలు చరుస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ సముద్రఘోషను మించి పోయి వానరులంతా ఒక పచ్చని సముద్రంలా కనపడ్డారు.
నిట్టూర్చాడు రాఘవుడు!
‘‘ఓ వాయుదేవా నీవు లంకపైనుండి వస్తున్నావా? నా సీతను తాకిన గాలికెరటాలే అనుకుంటా నా కెంతో హాయిగా ఉన్నావు. ఓ లక్ష్మణా ఆ భూమిని చూడు అటువైపు నా సీత ఉన్నది ఇటువైపు నేను ఉన్నాను. ఓ సౌమిత్రీ అదుగో ఆ శీతాంశుకిరణాలు చూడు ఎంత చల్లగా ఉన్నాయో! ఎందుకో తెలుసా? నా జానకి చల్లని చూపులు ఆ చంద్రునిమీద అటు వైపు ప్రసరించి మరల నా వైపు పరావర్తనము చెందినవి.
‘‘అవును, నాకు తెలుసు అవి నాసీతచూపులే! ఆహా! లక్ష్మణా నా శరీరములో పుట్టే ఈ విరహపు సెగలు నేను ఆ చల్లని సముద్రములో పోయి పడుకున్నా తగ్గవేమో!
‘‘ఆ రావణుడు తీసుకు వెడుతున్నప్పుడు నా హృదయేశ్వరి ఎంత విలపించినదో కదా! మరల నాకు ఆ శీతల కర స్పర్శ లభించు భాగ్యము త్వరలో రానున్నది! నా జానకిని నేను ,నన్ను నా జానకి పరస్పరవీక్షణములలో బంధించు సమయమాసన్నమైనది!’’ అని పరిపరి విధాలుగా పరితపిస్తున్నాడు రామచంద్రుడు.
అదే సమయంలో అక్కడ లంకలో ఒకింత అవమాన భారంతో తలదించుకొని తన మంత్రులతో సమాలోచనలు చేస్తున్నాడు రాక్షసేంద్రుడు రావణుడు!
Also read: హనుమ పునరాగమనం
వూటుకూరు జానకిరామారావు