రామాయణమ్ – 7
ఆ అడవిలో కాలుపెట్టే సందులేనంతగా అల్లుకొనిపోయి ఉన్నాయి వృక్షాలు, లతలు. దానికి తోడు పురుగులు ఈలవేసుకుంటూ చేసే ధ్వని! అత్యంత కర్ణకఠోరంగా అరిచే వివిధరకాల జంతువులు, క్రూరమృగాలు. సామాన్యుడి గుండె జలదరించేటట్లున్నదా వనము.
మహర్షిని కుతూహలంతో అడిగాడు రాముడు! ఏమిటిది? ఈవిధంగా ఎందుకున్నది? అని
రామా, పూర్వము ఇది రెండు దేశముల సముదాయము అవి ఒకటి మలదము, రెండు కరూశము. ఈ రెండు దేశాల ప్రజలు సుఖశాంతులతో ,ధనధాన్యసమృద్ధితో హాయిగా జీవనంసాగించేవారు.
Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు
మహర్షీ ఈ దేశాల పేర్లు వింతగా ఉన్నవేమిటి? మలదము, కరూశమా? ఆ పేర్లెట్లా వచ్చినవి? అని రాముడు ప్రశ్నించాడు.
రామా! పూర్వము వృత్రాసుర వధ అయిన పిదప ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకున్నది. అతనిని తీవ్రమైన ఆకలి బాధించింది! శరీరమంతా మలినమయై అసహ్యకరంగా మారిపోయాడు! అప్పుడు సకలముని సంఘాలు, దేవతలు ఆయన శరీరమలాన్ని కడిగివేసి మలాన్ని తొలగించారు. అదేవిధంగా ఆకలిని (కారుశాన్నికూడా) తొలగించారు. ఆతని మలాన్ని, ఆకలిని స్వీకరించిన భూమి కావున మలాదము, కరూశము అని పేర్లు ఈ ప్రాంతానికి!.
దేవేంద్రుడు సంతోషంతో ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండేటట్లు వరమిచ్చాడు!.
కొంతకాలానికి ఒక యక్షిణి ,స్వేచ్ఛారూపధారిణి, వేయి ఏనుగుల బలమున్నది, తాటక నామధేయురాలు ఈ ప్రాంతంలో జనులను పీడిస్తూ వారిని భయభ్రాంతులను చేస్తూ ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరించడం మొదలుపెట్టింది.
దాని భర్త సుందుడు, కొడుకు మారీచుడు! కొడుకు కూడా తల్లివలెనే మహాబలవంతుడు. వాడి బారినపడి బాధపడని వాడు లేడు! తల్లీ కొడుకులంటే ఉన్నభయం చేత ఈ ప్రాంతంలో అడుగు మోపే సాహసం ఎవ్వరూ చేయటంలేదు. ప్రజలందరూ ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. మనమున్న ప్రదేశం నుండి ఒకటిన్నర ఆమడల దూరంలో దాని నివాస స్థానం!
రామా ! అలాంటి ఘోరతాటకను నీవు వధించాలి! అని విశ్వామిత్రుడు పలికాడు!
Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు
రాముడప్పుడు వినయంగా, మహర్షీ యక్షులకు ఇంతటి బలములేదని విన్నాను. ఈవిడకింత బలమెక్కడిది? అని ప్రశ్నించాడు!
నీవన్నది నిజమే రామా! ఇది సుకేతుడు అనే గొప్పయక్షునకు బ్రహ్మ వరప్రసాదం వల్ల జన్మించింది. వేయిఏనుగుల బలంపొందింది. దీని భర్త సుందుడు అగస్త్య మహర్షికి చేసిన అపచారం వల్ల ఆయన శాపానికి గురి అయి మరణించాడు. అందుకు ఆగ్రహించి తల్లీకొడుకులు ఇరువురూ ఆ మహర్షిని భక్షించబోగా ఇరువురినీ రాక్షసులు కమ్మని ఆయన శపించాడు. అప్పటినుండి అది ఈ ప్రదేశాన్ని నాశనంచేస్తూ వస్తున్నది! ఈ ప్రదేశం ఒకప్పుడు అగస్త్యుడు నివసించిన ప్రాంతం!
రామా ! నీవు తప్ప ముల్లోకాలలో దానిని వధింప సమర్ధుడు లేడు! అని మహర్షిపలికిన పలుకులనే ఆదేశంగా స్వీకరించాడు రామచంద్రుడు.
ధనుస్సు మధ్యభాగం పట్టుకొని దిక్కులు ప్రతిధ్వనించేటట్లుగా ఒక్కసారినారి సారించి వదిలిపెట్టాడు.
ఆ ధనుష్టంకారానికి నలుదెసలలో కలకలం చెలరేగింది. సకల ప్రాణికోటికి ఒళ్ళు జలదరించిపోయింది!
ఆ ధ్వని తాటకకు సవాలు విసురుతున్నట్లుగా ఉంది. ఎక్కడో ఒకమూల పడుకున్న ఆ రాక్షసి ఏమీ ఆలోచించక తటాలున లేచి శబ్దము వచ్చిన దిక్కుగా పరుగుపెట్టింది! కొండంత ఆకారము, వికృతమైన దేహం! అది కంటపడగానే ఎంతటి వారి గుండె అయినా ఆగిపోవలసిందే!.
రాముడు క్షణకాలం ఆలోచించాడు! ఆడుది ఇది , దీనిని చంపటమెందుకు? ముక్కు ,చెవులు కోసి బెదరగొట్టి దూరంపంపితె సరిపోతుంది అనుకున్నాడు.
రాముడిలా ఆలోచిస్తుండగా అది దుమ్మురేపుకుంటూ మహావేగంగా పెద్ద పెద్ద బండరాళ్లను విసురుతూ మహోద్రేకంతో మీదమీదకు రాసాగింది!
ఆ రాక్షసి కురిపించే శిలా వర్షాన్ని తన బాణవర్షముచేత ఆపివేసి మొదట దాని చేతులు నరికి వేశాడు, ఆ రాక్షసి పట్టరాని బాధతో గర్జిస్తుంటే లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసిపారేశాడు!
ఆ రాక్షసి తనకు కావలసిన రూపం ధరించగల శక్తిగలది! అది పెక్కురూపాలు ధరించి అన్నదమ్ములను చీకాకు పరచ ప్రయత్నించింది!
ఇది స్త్రీ అని ఉపేక్షిస్తున్నాడు రాముడు! అది గమనించిన మహర్షి, “రామా! సంధ్యా సమయం రాబోతున్నది ,అంతకు ముందే దీనిని సంహరింపుము, లేని పక్షమున రాక్షసులను సంధ్యాసమయంలో ఎదుర్కొని జయించడం కష్టసాధ్యమైన పని!” అని పలికాడు.
రాముడు మొదట దాని మాయ ఛేదించి ఒక పదునైన బాణంతో దాని వక్షస్థలం మీద గురి చూసి కొట్టగా అది పెద్దకొండలాగ నేలగూలింది!
అప్పుడు ఇంద్రాది దేవతలంతా బాగుబాగు అనిమెచ్చుకొని పూలవాన కురిపించారు. ఇంద్రుడు మహర్షితో నీ వద్దగల దివ్యాస్త్రములన్నింటినీ రామునకు ఉపదేశింపుము! అని పలికి మహర్షికి నమస్కరించి వెడలిపోయినాడు.
Also read: శ్రీరామ జననం
ఆ రాత్రికి అత్యంత ప్రశాంతమయిన ఆ అడవిలోనే వారు విశ్రమించారు. తాటక నుండి ముక్తమైన ఆ వనము కుబేరుడి చైత్రరధంలాగా ప్రకాశించింది!
తెలవారగనే శుభదర్శనుడైన రామునకు తనకు తెలిసిన అన్నిదివ్యాస్త్రాలు ఉపదేశించారు మహర్షి.
…….
N.B….
విశ్వామిత్రుడు కోపాన్ని జయించినవాడు అని మనకు తెలుసు. సకల ప్రాణిసంఘాలమీద ఆయన దయ అపారం!
ఆయన ఏదో యాగం ఆరు రొజులు చేస్తున్నాడు!
Also read: దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు
ఆ యాగాన్ని ఆయనముందు కుర్రకుంకలైన వారు విఘ్నం చేయ ప్రయత్నిస్తున్నారు!
మంత్రించిన దర్భ చాలు ఆయనకు! తనయాగ సంరక్షణ చేసుకోవడానికి, అంత సమర్దుడు ఆయన!
అన్ని కోరికలు జయించిన ఆయనకు ఒక కోరిక గలిగింది!
అది రామరసామృతపానం చేయాలని!
మరి దశరధుడిదగ్గరకు వెళ్లి నీ కొడుకుతో కబుర్లు చెప్పుకోవాలి వాడినే చూస్తూ కూర్చోవాలి కొన్ని రోజులు అని చెపితే పంపుతాడా! పంపడుగాక పంపడు !. కాబట్టి యాగమనే నెపంకావాలి!
అదీ గాక రాముడు ఎందుకు పుట్టాడో ఆయనకు తెలుసు. రామునికి దివ్యాస్త్ర సంపద అమరాలి! అందుకు ఊరకే ఇచ్చేస్తే ఏం ప్రయోజనం! ఆతడేదో ఘనకార్యం చేయాలి. అందుకు తాను సంతోషించి ఇస్తున్నట్లుగా ఇవ్వాలి!
అందుకే తాటకను సంహరింపజేసి సకలదివ్యాస్త్రసంపద ఆయన వశం చేశాడు.
ఇంత ఉంది ఇందులో!!
పిబరే రామ రసమ్!
Also read: రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ
వూటుకూరు జానకిరామారావు