Tuesday, November 5, 2024

సీతను విడదీసిన రావణుని దునిమాడిన దాశరథి

12 తిరుప్పావై

మాడభూషి శ్రీధర్

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

దూడల తలచి చేపునకు వచ్చి ఎనుములు పాలు స్రవించ

కుండలన్నియునిండి, పొంగి పొరలి సంపదలు వరదలెత్తు

సొంతపనులు వదిలి కృష్ణుసేవించు భాగ్యశాలి సోదరివీవు

మంచుకురియు సమయాన నీ గుమ్మాల వేలాడుతున్నాము

సతిని విడదీసిన దుష్టు దశకంఠు దునిమాడిన దాశరథి

పుంసాం మోహనరూపుని మిగుల కీర్తించి నిలిచినాము

వ్రేపల్లె వాడవాడలందు నీ నిదుర కీర్తి నిండార వ్యాపించె

ఇకనైన కలసి భజింతము రావమ్మ సిరినోము నోచవమ్మ

భగవత్ సేవా సంపద అధికంగా కలిగిన గోపికను తీసుకుని వెళితే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని గోదమ్మ తల్లి భావించారు.

Also read: నిరంతరం యవ్వనంలో ఉన్న గోకులంలో గోవులన్నీ

అర్థం

కనైత్తు= (పాలుపితికే వారు లేకపోవడం వల్ల) అరచి, ఇళం కన్ఱు ఎరుమై=లేగదూడలనుగల ఎనుములు, కన్ఱుక్కు ఇఱంగి= లేగలపైజాలిగొని, నినైత్తు = దూడ తనపొదుగులో మూతిపెట్టినట్టు తలచి, పాల్ శోర= పాలుకార్చుచుండగా, ఇల్లమ్ ననైత్తు= ఇల్లంతా తడిసి, శేఱు ఆక్కుమ్ = బురదఅవుతున్నట్టున్న, నర్ చెల్వన్= శ్రీకృష్ణకైంకర్యముచేత గొప్ప ఐశ్వర్యముకలిగిన వ్యక్తియొక్క, తంగాయ్=చెల్లెలా, తలైపనివీఝ= మాతలలపై మంచు పడుతుండగా, నిన్ వాశల్ కడైపట్రి = నీ ఇంటి గుమ్మాన్ని పట్టుకుని, తెన్ ఇలంగైకోమానై= సిరిసంపదలతో విరాజిల్లే లంకకు రాజైన రావణాసురుని, శినత్తినాల్ చ్చెట్ర= శ్రీదేవినుంచి ఎడబాటుచేసినాడన్న కోపంతో చంపిన, మనత్తుక్కు ఇనియాయై= మనసుకు హాయికలగించే (మనోహరుడైన) శ్రీరామచంద్రుని, ప్పాడవుమ్= మేము స్తుతించినప్పడికీ, నీవాయ్ తిఱవాయ్=నీనోరు తెరిచి మాట్లాడడం లేదే, ఇనిత్తాన్= ఇకనైనా, ఎఝుందిరాయ్= మేలుకో, ఈదు ఎన్న పేరురక్కమ్ = ఇదేమి పెద్ద నిద్ర, అనైత్తు ఇల్లత్తారుమ్= గోకులంలి ఇళ్లలో ఉన్నవారందరికీ, అఱిందు = నీ గాఢనిద్రగురించి తెలిసిపోయింది.

దూడలున్న గేదెల పాలుపితికేవారు లేకపోవడం వల్ల అవి అరుస్తూ, తమ లేగలు మూతిపెట్టి తాగుచున్నట్టు భావించి పొదుగులుద్వారాఎడతెగకుండా పాలు స్రవిస్తుండడం వల్ల ఇల్లంతా బురదైపోయేంతగా శ్రీకృష్ణకైంకర్యరూపమైన గొప్ప సంపద కలిగిన వారి చెల్లెలా, మాతలల మీద మంచుకురుస్తున్నా మీ గుమ్మం ముందు నిలబడి ఉన్నాం. సీతాదేవిని తననుంచి విడదీసాడన్న కోపంతో సంపన్మయమైన లంకాధిపతి రావణుడిని చంపిన వాడూ, మనసుకు హాయికూర్చువాడూ అయిన శ్రీరాముని మేము స్తుతిస్తున్నప్పడికీ నీవు నోరు తెరవడం లేదే. ఇకనైనా లేవమ్మా, ఇదేమి గాఢనిద్ర, ఊరు ఊరంతా నీనిద్రగురించి తెలిసిపోయింది.

గేదెలకు పాల చేపులు వస్తున్నాయి. దగ్గర్లో దూడలు లేవు. యజమానులు పాలుపితకడం లేదు. దూడలు తమ పొదుగులను నోట్లో పెట్టుకున్నట్టు భావించి దయతో గేదెలే పాలను స్రవిస్తున్నాయి. దాంతో పాలు ఇల్లంతా నిండి బురదబురద అయింది. గేదెలకున్న దయాభావం నీకు మాయందులేదే. ఆశ్రితుల విషయంలో భగవంతుడు ఈ గేదెల వలె పరితపిస్తుంటాడట. మేఘాలు తెరపి ఇస్తూ కురుస్తాయి, కాని ఈ గేదెలు ఎడతెరిపి లేకుండా పాలు కురుస్తున్నాయి. నీ ఇంట్లో గేదెలు దూడలను తలచుకుని పాలిస్తున్నాయే, నీ కోసం మేము వచ్చినా నీవు ఓ మాటైనా పలకడం లేదే.
లక్ష్మణుడు అన్న కార్యంలో నిమగ్నమై ఉండి అగ్ని కార్యం మరిచినట్టు, యాదవులు శ్రీకృష్ణకైంకర్యంలో పడి విద్యుక్తధర్మమైన పాలుపితికే పని వదిలేసారట. భగవంతుడి మీదా ప్రేమతో అతన్ని విడిచి ఉండలేక స్వధర్మాన్ని మరిచిపోతే దోషమే కాదు. ఈ అంశాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఈ విధంగా వివరించారు: ‘‘ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తనురాముని సేవలో నిమగ్నమై తన దైనందిన బాధ్యతలను (నిత్య కర్మలు) పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, తన బాధ్యతలను నిత్య కర్మలను పాటించేవాడు. భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే’’.

నఱ్ చెల్వన్ తంగాయ్ = తన ఐశ్వర్యమంతా పాల వలె నేలపాలవుతున్నా, శ్రీ కృష్ణ కైంకర్యమే అక్షయమైన సంపద అని భావిస్తున్న భాగవతోత్తముని చెల్లెలు ఈమె. విభీషణుడు శ్రీరాముని సేవించినపుడు అతని చెల్లెలు త్రిజట సీతకు సేవ చేసింది. నీసోదరుడు శ్రీకృష్ణ సేవచేస్తున్నప్పుడు నీవు కూడా శ్రీకృష్ణునే నమ్ముకున్న మాకు సేవచేయడం సహజధర్మం కదా అంటున్నారు బయట గుమ్మం పట్టుకుని వేచిఉన్న గోపికలు.

Also read: హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ
పనిత్తలై వీఝై నిన్ వాశల్ కడైపట్రి = కింద పాలప్రవాహం పారుతున్నది.మధ్యలో మా ప్రేమ కూడా ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్నది. అందులో చిక్కుకు పోయి మీ వాకిలి కంబాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాం. మా దీనావస్థ కాస్త గమనించు అంటున్నా ఇంకాస్సేపు చూద్దాం అనుకుని గోపిక మౌనంగా పడుకునే ఉందట.

శినత్తినాల్ తెన్నిలంగైయక్కోమానైచ్చెట్ర= దక్షిణాన ఉన్న లంకాధిపతి రావణుడిపైన కోపంతో సంహరించాడు. అనిద్రసస్సతతం రామః సీతలేని రాముడు నిద్రాహారాలు వదిలేసాడు. అంతటి కరుణాసాగరుడైన రాముని కీర్తిస్తే లోనున్న గోపిక దయతలిచి మాట్లాడుతుందనుకున్నారు. తనకు బాణం గుచ్చుకున్నా రాముడు బాధపడలేదు. కాని ఆంజనేయుడికి బాణం తగిలితే మహాక్రోధవివశుడైనాడు. తనకు అపకారం చేస్తే శ్రమపడి కోపం తెచ్చుకోవాలట కాని తన వారికి అపచారం చేస్తే కోపం దానంతట అదే వస్తుందట. దండకారణ్యలో రుషులకు, సీతకు, జటాయువుకు, విభీషణుడికి ఆంజనేయుడికి రావణుడు హాని చేసి రాముడి కోపాగ్నికి గురైనాడు. అయినా సరే రావణుడిని ఒక్కబాణంతో చంపకుండా అతని సైన్యాన్ని సంహరించి, మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిరవాయ్= రాముడు మనోభిరాముడు, మనసుకు మలయమారుతం వలె తాకుతాడు, వెన్నెల వలె చల్లగా ఉంటాడు. చందనం వలె చల్లని సువాసనలు వెదజల్లుతాడు. ఆ మనోహరుడిని కీర్తించినా నీమనసు కరగడం లేదే, నోరు తెరవడం లేదే.

         ఈదెన్ పేరుఱక్కమ్ అనైత్తు ఇల్లత్తారుమ్ అఱిందు= విష్ణువు లోకం కోసం చింతాక్రాంతుడై యోగనిద్రలో ఉంటాడు. సంసారులు తమో గుణంతో నిద్రాదేవికి వశులైపోతారు. నీ నిద్ర ఈ రెండురకాలలోలేదు. నీది విలక్షణమైన నిద్ర. భగవదనుభవమనే పరమానందంలో లీనమైన చేతనుడున్నదశలోనీవున్నావు. భక్తుల దీనాలాపాలు విన్న వంటనే భగవంతుడు పరుగెత్తుతాడు కదా.. ఆయనతో కలిసిమెలిసి తిరిగే నీవే మేమంతా వచ్చి పిలుస్తున్నా గాఢ నిద్రలో ఉంటావా? నీ ఏకాంత అనుభవ రహస్యం గోకులమంతా తెలిసి పోయింది. పోనీ గోపికలంతా కలిసి నీ ఇంటికి రావాలనుకున్నావా, అదే జరిగింది కదా. నిన్ను పిలవడానికి ఇదిగో ఊళ్లో వాళ్లందరం వచ్చాం, అంటున్నారు గోపికలు.
మేమంతా అహంకార దోషాలను వదిలించుకుని వచ్చాం. అయినా నీవు నిద్ర మేల్కొనడం లేదు. పోనీ శ్రీమహావిష్ణువు యోగనిద్రవంటి నిద్రలో ఉన్నావా, అట్లా అయిన మా దీనుల పిలుపు విని ఆ విష్ణువు వలె లేవాలి కదా రావాలి కదా అని భగవంతుడిని మొరబెట్టుకుంటున్నారని కా ఇ దేవనాథన్ గారు విశ్లేషించారు.

         కందాడై రామానుజాచార్య ఈ పాశురార్థాన్ని ఈ విధంగా చక్కగా విడమరిచి చెప్పారు. ‘‘గేదె అంటే మహిషి, లక్ష్మీదేవికి మహిషి అని కూడా ఒక పేరు. ఆమె పురుషాకారానికి మూలము. ఆచార్యులకు కూడా పురుషాకారం ఉంటుంది. దూడలంటే శిష్యులు. శిష్యులపైదయతలచి గురువులు చేసే జ్ఞానోపదేశమే పాలు కారడం. భగవద్దాస్యమే సంపద. ద్వారమంటే తిరుమంత్రం. పై కమ్మి అంటే నమః అనే మాట. భగవద్భాగవత సేవలో కలిగే ఆనందం నాది కాదు అనుకోవడమే పై కమ్మిని పట్టుకొనడం’’.

Also read: లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె

పొయ్ గై ఆళ్వార్ మేల్కొలుపు

         లంక అంటే శరీరం. దక్షిణ దిక్కు మృత్యు స్థానం. రావణుడు మనసు. ఆ మనసును నిగ్రహించేది ఆచార్యోపదేశము. ఆచార్యా మౌనము దాల్చరాదు, జ్ఞాన బోధ చేయండి అని కోరుతున్నారు.

ఈ పాశురంలో పొయ్గై ఆళ్వార్ మేల్కొలుపుతున్నారుమొదలియాళ్వాన్ గూ మొదటి వారు పొయ్‌గయాళ్వార్ – మరొక పేరు సరోయోగి. కాసార యోగి, పొయ్‌గై పిరాన్, పద్మముని, కవిన్యార్పోరెయెర్ అని కూడా అనేక పేర్లున్నాయి. ఆయన 7వ శతాబ్దం వారు, కాంచీపురం లో ఆశ్వీయుజం నెలలో శ్రవణ నక్షత్రంలో జన్మించారు.పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ పెద్దలు వివరిస్తున్నారు.  ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని అంటారు.

తంగాయ్ అంటే లక్ష్మీ అమ్మవారు. ఆమె పద్మంనుంచి పుట్టిన తల్లి. పొయ్గై ఆళ్వార్ కూడా తామర పూవునుంచి పుట్టారు. కనుక తంగా అంటే ఈయనను కూడా సంబోధించినట్టు. దూడల వలె అమాయకులైన అజ్ఞులకు మొదలియాళ్వాన్ సాయించిన తనియద్వారా జ్ఞానబోధ చేశారు.

నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తి స్థితప్రజ్ఞుడు

నచ్చెల్వంతంగాయ్ అంటే శ్రీరామమిశ్రాయనమః అని గురుపరంపరలోని వాక్యానికి సరిపోతుంది. ననైత్తిల్లం శేరార్కుం నచ్చెల్వం ఇల్లంతా బురదైపోయిందని, ఆ బురదలోనే ఇంటివారు మునిగారనీ అదే వారి సంపదగా భావించారని ఇందులోభావన. శ్రీరామమిశ్రులకు ఆచార్యులంటే అమిత భక్తి. ఆచార్యుల కూతురు బురదలో కాలుపెట్టడానికి సంకోచిస్తుంటే తాను ఆ బురదలో పరుండి ఆమెను తొక్కి బురద దాటించారట. ఆచార్య నిష్ఠయే మంచి సంపద. శ్రీరామ మిశ్రులకు రామ కథ అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ పాశురంలో లంకాధిపతి రావణరాజును జయించిన రాముడనే కథను ఆండాళ్ వివరించారు.

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మధ్య వర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఉండే రీతిని, జ్ఞాన దశని నాలుగు స్థితులుగావర్ణించారు. నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉన్నా అవేవీ ఏకాగ్రతను పాడు చేయలేవు.

ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్

ఆ జీవికిఏ కోరికలూ ఉండవు. మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని అవి తనకు  ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఏ విదంగా వస్తుంది అంటే పరమాత్ముడు ఈ విధంగా వివరించాడు.

దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః
వీత రాగ భయ క్రోధః స్తితధీః మునిరుచ్యతే

దుఃఖంలో బాధపడక, సుఖంలో స్పృహ కోల్పోకుండా రాగాన్ని భయాన్ని కోపాన్ని వదిలేసి నిలకడగా స్థిరంగా ఉంటాడు. ఈ దశలో జీవికి తన చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలిసినా మనస్సు వాటియందు నిమగ్నం కాకుండా సాధన చేస్తాడు. దీన్ని రెండో స్థితి అంటారు. ఈ సాధన కొనసాగితే మనస్సు స్థిరపడుతుంది. అంతరాంతరాలలో ఉండే పరమాత్మ విషయమే ఆనంద దాయకంగా ఉంటుంది. ఈ నాటి గోపిక రెండో స్థాయికి చేరిన సాధకురాలు అని ఆండాళ్ సంభావించారని జీయర్ స్వామి వారు వివరించారు.

Also read: గోదా తపన: ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల!

గోదమ్మపాదాలకు శరణు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles