Thursday, November 7, 2024

మారీచ, సుబాహుల సంహారం

రామాయణమ్8

అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ, ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు!

ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.

అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!

వారికి అత్యంత మనోహరంగా, ప్రశాంతంగా, దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది. అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదజల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!

Also read: తాటకి వధ

మహర్షి అందుకు ప్రతిగా, ‘‘రామా! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి. ప్రస్తుతం నేను ఉంటున్నాను. దీని పేరు సిద్ధాశ్రమము.

ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలికారు.

 రాముడు మహర్షితో ‘‘స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము’’ అని పలికి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!

యాగము ఆరురోజులు కొనసాగుతుంది!

అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది !

ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏ మాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!

ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని  అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!

Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞ నిర్వహణ గావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు! ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా  మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది!

పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ, సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!

మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా

నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్

( భాస్కర రామాయణం నుండి)

లక్ష్మణ చూడు నా “లా” వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడు..

(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).

వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే,…

 రామచంద్రుడు ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు!

Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు

అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.

మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు సుబాహుడిమీదకు. అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది!

మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!

యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.

Also read: శ్రీరామ జననం

..

మా తదుపరి కర్తవ్యమేమిటి  బ్రహ్మర్షీ? అని వినయంగా తన చెంత దోసిలి ఒగ్గి నిలుచున్న రామ లక్ష్మణులను కడు మురిపెముగా చూస్తున్నారు మహర్షి! .

ఇంతలో కొందరు ఆశ్రమ వాసులు అచటికి వచ్చి జనకుడు యాగం చేస్తున్నాడట! మనకు ఆహ్వానం వచ్చింది! అని తెలిపారు

అప్పుడు విశ్వామిత్రుడు రామ,లక్ష్మణులారా మీరుకూడ మాతో మిధిలకు వచ్చినట్లయినచో అక్కడ మీరు ఒక ధనుస్సును చూడవచ్చు అని అన్నారు.

ఆ ధనుస్సును మిధిలాధిపతి అయిన దేవరాతుడు తన యజ్ఞఫలముగా దేవతలవద్దనుండి పొందినాడు. అది చాలా గొప్ప ధనుస్సు. దాని మధ్య భాగము చాలా దృఢమైనది! అది మిధిలేశుల రాజమందిరములో ప్రస్తుతము పూజలందుకుంటున్నది! అని మహర్షి పలికి, తాను ప్రయాణమయినాడు!

సోదరులిరువురూ, తాపసులు, వారి శకటములు అన్నీ విశ్వామిత్ర మహర్షిని అనుసరించి వెడుతూ ఉన్నవి. సాయంకాల మయ్యేవరకు ఆ విధంగా ప్రయాణం చేసి అత్యంతమనోహరమైన ఒక నది ఒడ్డుకు చేరారు.

ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి రామచంద్రుడు మునిచంద్రుని ప్రశ్నించాడు, ‘‘స్వామీ ఈ ప్రదేశము కడు రమణీయముగా యున్నది కారణమేమి?’’

ఈ నది పేరు శోణనది. ఇది మగధ దేశంలో పుట్టినది!

పూర్వము బ్రహ్మదేవునకు కుశుడు అనే ఒక కుమారుడుండేవాడు. ఆ కుశునకు నలుగురు పుత్రులు. వారిలో కుశాంబుడు కౌశాంబీ నగరమును, కుశనాభుడు మహోదయపురమును, అధూర్తరజసుడు ధర్మారణ్యము అనే పట్టణాన్నీ, వసురాజు గిరివ్రజ పురాన్ని నిర్మించుకొని ధర్మంతప్పకుండా పరిపాలిస్తుఉండేవారు. వారిలోని వసురాజుకు చెందిన భూమి ఇది! ఈ శోణనదీ తీరం ఆయన ఏలుబడిలోనిదే!

వారిలో కుశనాభుడు ఘృతాచి అనే అప్సరస్త్రీని వివాహంచేసుకొని నూరుగురు అందమైన కన్యలకు తండ్రి అయినాడు.

ఆ కన్నియలు నూరుగురూ అపురూపసౌందర్య రాశులు, దర్శనమాత్రం చేత మోహవివశులను గావింపగలరు.

వారు ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వారిని చూసి మోహించిన వాయుదేవుడు తన కోరికను వెల్లడించి పెళ్ళి చేసుకుంటాను మిమ్ములను అని కోరిక వ్యక్తపరిచాడు!

తండ్రి అనుమతి లేని కారణం చేత వారు అతని కోరికను తిరస్కరించారు.

 అప్పుడు వాయుదేవుడు కోపంతో వారిని కురూపిణులుగా మార్చివేశాడు.

  తిరిగి శాపమివ్వగల శక్తి ఉండి కూడా వాయువును ఏమీ చేయక తండ్రివద్దకు  వెళ్ళి తమకు పట్టిన దుస్థితి వివరించి కంట నీరు పెట్టుకున్నారు ఆ నూర్గురు. అప్పుడు తండ్రి అయిన కుశనాభుడు వారికి యవ్వనము అశాశ్వతము, విలువలు శాశ్వతము అని బోధించి ఊరడించాడు!

Also read: దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు

….

N.B:

పై సందర్బంలో ఒకచక్కని శ్లోకాన్ని అద్భుతంగా తెనిగించారు భాస్కర రామాయణ కర్తలు.

క్షమయ జనులకాభరణము

క్షమయ కీర్తి

క్షమయ ధర్మంబు

 క్షమయ సజ్జనగుణంబు

క్షమయ యజ్ఞంబు

 క్షమయ మోక్షంబు 

క్షమయ సకల దానంబు

క్షమయందే జగము నిలుచు.

ఇవే పదములతో రంగనాధరామాయణ కర్త కూడా ఇంతే అందంగా వ్రాశాడు.

ఓర్పు అనేది ఎంత ముఖ్యమో ఆరోజుననే చెప్పారు మనకు.

PATIENCE  అని అంటున్నాము దానినే ఈరోజు మనము

Patience pays rich dividends

Also read: రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ

-వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles