రామాయణమ్ – 110
అసలే సీతావియోగము. అందులో శరత్కాలము. ఆ బాధను ఇంకా ఎక్కువ చేస్తున్నది. సీతాదేవి అపహరింపబడి అప్పటికే చాలా కాలమయ్యింది. వెతికి జాడ కనుగొనగలను అన్న పెద్దమనిషి జాడలేకుండా పోయాడు. పరిపరి విధాలుగా పరితపిస్తున్నాడు రామచంద్రుడు.
అప్పుడే అడవికివెళ్ళి ఫలములను, కందమూలములను సేకరించుకొని వచ్చిన లక్ష్మణుడు సోయిలేకుండా ఒంటరిగా చింతాక్రాంతుడై విలపిస్తున్న అన్నగారిని చూశాడు.
Also read: సుగ్రీవునికి హనుమ మేల్కొలుపు
ఎలాంటి వాడాయన? కదనరంగములో కాలుపెడితే ఆయనను తేరిపార చూడగలిగిన యోధుడు ముల్లోకాలాలో కూడా లేడు. ఆయన ధనుష్టంకారమే శత్రువులగుండెలు బ్రద్దలు గావిస్తుంది. నేడిలా దీనుడై, భార్యావియోగ పీడితుడై, స్పృహలేకుండా పడిఉన్నాడే! వంటి మీద ఈగలు వాలినా, పురుగులు తిరిగినా ఆయన వాటిని పట్టించుకోవడములేదు. ఒక్కసారిగా కడుపు తరుక్కుపోయింది లక్ష్మణుడికి ఆ మహాయోధుడిని ఆ స్థితిలో చూసేసరికి.
‘‘అన్నా, నీ వంటి వాడే ఇలా కామవశుడైతే ఏమి ప్రయోజనము? ఇటువంటి లజ్జాకరమైన ప్రవృత్తి చేత చిత్తస్థైర్యము నశించునుకదా. అటుపిమ్మట ఏకార్యమూ సిద్ధించదు. దైన్యము విడిచి ధైర్యము పూనవయ్యా. కాలము నీ వశమవుతుంది. కార్య సిద్ధికి అవసరమైన దేవతా ఉపాసన చేయుము. సుగ్రీవాదుల సహాయము అటుపైన మనకున్నదికదా!
Also read: వాలి దహన సంస్కారం
‘‘రామా, నీ సీతను ఇతరులెవ్వరూ పొందజాలరు. ఆమె భగభగమండే అగ్నిజ్వాల! ఏ మూర్ఖుడూ సాహసించడు. సాహసించి సమీపించెనా మాడి మసి అయిపోవలసిందే.’’
లక్ష్మణుడి మాటలకు ఈ లోకములోకి వచ్చాడు శ్రీరాముడు !
‘‘ఓ లక్ష్మణా, ఇది సమయము. ఇదే అనువైన సమయము. రాజులు యుద్ధయాత్ర ప్రారంభించు సమయము. అట్టి ప్రయత్నములు సుగ్రీవుడు చేయుచున్నట్లుగా నాకు కనపడుటలేదు. లక్ష్మణా, వీడుఅనాధుడు. రాజ్యభ్రష్టుడు. రావణునిచేత అవమానింప బడినవాడు. దీనుడు. భార్యాహీనుడు. నన్ను శరణు వేడినవాడు అని సుగ్రీవుడు నన్నుఅవమానించుచున్నాడు. సీతాన్వేషణకు కాలము చెప్పి ఇప్పుడు కనీసము స్మరించుటయేలేదు కదా.
Also read: శోక వివశులైన తార, సుగ్రీవుడు
‘‘నీవు కిష్కింధకు ఇప్పుడే వెళ్ళుము. మూర్ఖుడు స్త్రీ లోలుడు అయిన సుగ్రీవునితో నా మాటగా చెప్పుము. ఎవడు తనకు ఉపకారము చేసినవాని కార్యమును నెరవేర్చనివాడో వాడు పురుషాధముడు. కృతఘ్నుని శరీరము కుక్కలుకూడా ముట్టవు. నీవు రాముని ధనుస్సు యొక్క ఉగ్ర రూపమును చూడగోరుచున్నావా సుగ్రీవా? లోక భయంకరమైన జ్యాఘోష వినగోరుచున్నావా? అని కూడా హెచ్చరింపుము
‘‘అయినా లక్ష్మణా, ఈ సుగ్రీవుడు మనకు సహాయము చేసిన ఏమి? చేయకున్న ఏమి? నీవు పక్కన ఉన్నంతవరకు నాకు ఏ విచారమూ లేదు….నీవు వెళ్లి నాకు కోపము వచ్చిన ఎటులుండునో ఒక్కసారి వారికి వివరించిరమ్ము . ఇంకా చెప్పుము. వాలి వెళ్ళిన మార్గము ఇంకా మూసివేయబడలేదు అని. వాలి ఒక్కడే నాచేతిలో హతుడైనాడు కానీ మాట తప్పిన నీవు సబాంధవము గా నా చేతిలో చంపబడతావు అని కూడా తెలుపుము.’’
Also read: తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన
అన్నమాటలకు ఉన్నపళముగా కోపము తారాస్థాయికి చేరినది. ముఖమునుండి నిప్పుకణాలు కురుస్తున్నాయా అన్నట్లుగా మారిపొయినది రూపము. బుసలు కొట్టుచూ బయలుదేరినాడు రామానుజుడు కిష్కింధకు. లక్ష్మణుని కోపము చూసి రాముడు ‘‘నాయనా, నీవు కోపముతో పాపము చేయరాదు. సామముతోకూడిన మాటలే పలుకుము’’ అని బోధించాడు.
అన్నమాటలకు తల ఊపి కిష్కింధ వైపు సాగిపోయాడు లక్ష్మణుడు.
Also read: రాముడు తనను చంపడం అధర్మం కాదని అంగీకరించిన వాలి
వూటుకూరు జానకిరామారావు