Thursday, November 7, 2024

భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు

రామాయణమ్ 52

అన్నను ఆవిధంగా చూస్తుంటే దుఃఖము తన్నుకుంటూ వస్తున్నది భరతునకు. కృష్ణాజినము, నారచీరలు ధరించి, జటాధారియై ఉన్నరాముడి చుట్టూ గొప్ప కాంతివలయం కనపడుతున్నది ఆయనకు.

సింహము వంటి మూపురము, దీర్ఘమైన బాహువులు, పద్మములవంటి నేత్రములు కలిగి సముద్రపర్యంతమైన భూమికి అధిపతి అయిన రాముడు ధర్మమునాచరిస్తూ స్థిరుడైన బ్రహ్మదేవుడిలాగా వీరాసనం  బంధించి దర్భలు పరచిన నేలపై కూర్చున్నాడు.

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన

రత్నఖచితసింహాసనం మీద స్వర్ణకిరీటధారియై చుట్టూ మంత్రిసామంతపురోహితులు సేవిస్తుండగా వందిమాగధులు స్తోత్రపాఠాలు చదువుతుండగా సభాభవనమందు కొలువు తీరవలసిన చక్రవర్తి నేడిలా అరణ్యమృగములు చుట్టు కూర్చొని ఉండగా ఇక్కడ ఉన్నారు. అమూల్యమైన చందనచర్చలు చేయు శరీరము నేడిలా మురికిపట్టి ధూళిధూసరితమై ఉన్నదికదా!

 ఆ స్థితిలో రాముని చూసి, ‘‘ఛీ? నా మూలమున ఈయనకు ఇన్ని అగచాట్లు’’ అని వేదనతో భరతుడు దీనుడై ముఖమంతా చెమటలు కారుతుండగా విలపిస్తూ, నోట మాట రాక “ఆర్యా” అని మాత్రమే పలికి మాటలు రాక గొంతుపూడుకొనిపోయి నిస్సహాయంగా దీనంగా రోదించసాగాడు. శత్రుఘ్నుడు కూడా దీనంగా విలపిస్తూ అన్నకాళ్ళపై పడినాడు.

Also read: గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం

రాముడు తమ్ములనిరువురనూ కౌగలించుకొన్నాడు. లక్ష్మణుడు కూడా అన్నల బాహుబంధనంలో ఒదిగి పోయాడు. అన్నదమ్ములను అలా చూస్తున్న ఋషిగణము, పురజనులు దుఃఖమును ఆపుకోలేక కన్నీరు కార్చారు.

‘‘భరతా! దశరధమహారాజు ఏరి? ఎక్కడికి వెళ్ళినారు? నీవు అరణ్యమునకు ఎందుకు వచ్చినావు? దశరధమహారాజుకు క్షేమమే కదా! జీవించియే యున్నారుకదా! ఆయన దుఃఖాక్రాంతుడై పరలోకమునకు వెళ్ళలేదు కదా! నీవు నాన్నగారికి శుశ్రూష చేస్తున్నావు కదా! వేదవేత్త ధర్మనిరతుడు అయిన వశిష్ఠులవారిని మునుపటి వలెనే పూజిస్తున్నావు కదా! మాత కౌసల్య, మంచి సంతానముకల సుమిత్ర, పూజ్యురాలు రాణి అయిన కైకేయి సంతోషముగా ఉన్నారు కదా! వినయసంపన్నుడు, అధికశాస్త్రజ్ఞానము కలవాడైన సుయజ్ఞుని సత్కరిస్తున్నావు కదా!

‘‘నీవు ఎప్పుడు ఏ హోమము చేయవలెనో, ఏవి జరిగెనో అన్ని విషయాలు పురోహితుడు నీకు ఎరుకపరుస్తున్నాడు కదా! నీవు దేవతలను, తల్లులను, తండ్రులను, గురువులను, తండ్రితో సమానులైన బంధువులను, వృద్ధులను, వైద్యులను, బ్రాహ్మణులను గౌరవిస్తున్నావు కదా! నీతో సమానులు, శూరులు, విద్యావంతులు, జితేంద్రియులు, ఉత్తమవంశజులూ, మనస్సులో భావమెరిగి మసలుకో గలిగినవారినే మంత్రులుగా నియమించుకొన్నావుకదా!’’

(క్షేమసమాచారము లాగ రాముడు అడుగుతున్నవిషయాలు మనకు Administrative skills గురించి ఒక పెద్ద పాఠము.)

Also read: భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

భరతుడిని రాజధర్మాల విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు శ్రీ రాముడు.

‘‘అమాత్యులు శాస్త్రపండితులయినవారు మంత్రాంగపు ఆలోచనలను తమలోనే రహస్యముగా ఉంచుకొంటున్నారుకదా ! బహిర్గత పరచటము లేదు కదా!

(రహస్యముగా ఉంచుకొన్న వారివలననే రాజుకు విజయం లభించేది).

‘‘నీవు నిద్రకు వశుడవ్వటం లేదుకదా!  తగు కాలమునందే మేల్కొనుచున్నావు కదా! వివిధములయిన కార్యములను గురించి తెల్లవారుఝామునందే ఆలోచిస్తున్నావు కదా! నీవు ఒక్కడవే ఆలోచించటంలేదు కదా!  అలాగని చాలా మందితో ఆలోచించటంలేదు కదా! నీ ఆలోచనలు రాజ్యములోని వారికి తెలిసిపోవడం లేదుకదా! (Secrecy Maintain చేస్తున్నావు కదా అని అర్ధం).

Also read: రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

‘‘స్వల్పమైన ప్రయత్నముతో ఎక్కువ ఫలితాలు సాధించకలిగే కార్యములను నిశ్చయించి ఏ మాత్రము ఆలస్యము లేకుండా వెంటనే ప్రారంభిస్తున్నావు కదా! ఇతరులకు నీవేమి చేయదలుచుకున్నావో మునుముందు తెలియకుండా ఉంటున్నది కదా. నాయనా ఇతరులెవ్వరూ …ఊహలచేత కానీ, యుక్తిచేతగానీ,  ఇతరములయిన ఏ ఉపాయము చేత గానీ నీవు, నీ మంత్రులు చేసిన ఆలోచనలు తెలుసు కొనడం లేదు కదా! (Strictly Confidential).

‘‘వేయిమంది మూర్ఖుల కన్నా ఒక్కడు మేధావీ, శూరుడు, సమర్ధుడు అయిన  పండితుడిని చేరదీస్తే చాలు. ఎందుకంటే సంకటస్థితిలో పండితుడే గొప్ప సహాయము చేయగలడు. మూర్ఖులు వేలకొద్దీ నీ చుట్టూ ఉన్నప్పటికీ అవసరమైన పరిస్థితి లో ఒక్కడూ ఉపయోగపడడు. నీవు అధిక సామర్ధ్యము కలవారిని గొప్పపనులు చేయుటకు,  మామూలు  సామర్ధ్యము గలవారినీ చిన్నపనులు చేయుటకు, అతి తక్కువ సామర్ధ్యము కలవారిని అధమమైన కార్యములు చేయుటకు వినియోగిస్తున్నావు కదా!’’ అంటూ రాముడు భరతుడిని ప్రశ్నించాడు.

NB:

(సేవకుడి సామర్ధ్యాన్ని Capabilities ని ప్రభువు గమనిస్తూ ఉండి తదనుగుణంగానే పనులు అప్పగించాలి. అంతే గానీ ఎవడెక్కువ భజన చేస్తే వాడికి కాదు.)

Also read: భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles