Wednesday, January 22, 2025

దండకారణ్యంలో నివాసయోగ్యమైన స్థలంకోసం రాముడి అన్వేషణ

రామాయణమ్60

విరాధుడి భయం నుండి ఇంకా తేరుకోని సీతాదేవిని ఊరడిల్లచేసి, తమ్ముడు లక్ష్మణునితో ‘‘ఇది చాలా దుర్గమారణ్యములాగ ఉన్నది మనము వెంటనే విరాధుడు చెప్పినట్లుగా శరభంగ మహాముని ఆశ్రమమునకు వెళ్ళి ఆయనను మనకు వాసయోగ్యమైన ప్రదేశము గురించి అడిగి తెలుసుకొనవలె’’ అని పలికి ముని ఆశ్రమము వైపుగా నడక సాగించారు.

Also read: దండకారణ్యంలో విరాధుడి వధ

ముందు లక్ష్మణుడు, ఆ వెనుక సీతమ్మ, వారివురినీ అనుసరిస్తూ రామయ్య ప్రయాణం సాగించారు.

వారికి అల్లంత దూరంలో శరభంగుడి ఆశ్రమం కనపడుతూ ఉన్నది. మునితో ఎవరో దివ్యపురుషుడు మాట్లాడుతున్నట్లుగా కనపడ్డది. ఆ దివ్యపురుషుడి కాళ్ళు నేలకు ఆనటంలేదు. ఆయన ఎక్కివచ్చిన రధం దివ్యమైన ఆకుపచ్చ వెలుగులు విరజిమ్మే గుర్రాలతో పూన్చబడి ఉన్నది.

అక్కడ ఉన్న లక్షణాలను బట్టి చూడగా అది దేవేంద్రుడి రథమనీ, వచ్చినవాడు మహేంద్రుడనీ రాముడికి అర్ధమయ్యింది.

సీతా లక్ష్మణులను ఆశ్రమ సమీపంలో బయట ఉండమని చెప్పి తానొక్కడే మునిని దర్శించడానికి లోనికి వెళ్ళాడు రామచంద్రుడు.

Also read: సీతారామలక్ష్మణుల అరణ్య ప్రవేశం

రాముని రాక గమనించిన దేవేంద్రుడు శరభంగునితో ‘‘నేను ఇప్పుడే ఈయనకు కనపడ రాదు. ఈయన వల్ల ఒక మహా కార్యము జరుగవలసి ఉన్నది. ఆ తరువాత మాత్రమే మాట్లాడగలను’’ అని పలికి అంతర్ధానమైనాడు.

రాముడిని చూసిన మహర్షి, ‘‘రామా! నీ కోసమే వేచి ఉన్నానయా! ఇంద్రుడు తనతో రమ్మనమని అన్నా రాముడిని కలిసిన తరువాతే వస్తాను అని చెప్పాను. నిన్ను చూశాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక ఈ శరీరాన్ని వదలి స్వర్గానికి పయనమవుతాను’’ అని పలికాడు.

అప్పుడు రాముడు మునితో, ‘‘స్వామీ! మాకు వాసయోగ్యమైన ఏదైనా ఒకస్థలాన్ని చూపించండి’’ అని అడిగాడు.

అందుకు శరభంగమహర్షి, ‘‘రామా! నీవు ఈ అరణ్యంలోనే నివసించే సుతీక్ష్ణుడు అనేముని వద్దకు వెళ్ళు. ఆయనే నీకు అందమైన వనప్రదేశంలో వసతి ఏర్పాటు చేయగలడు’’ అని పలికి హోమము చేసి అగ్నిలో ప్రవేశించారు  శరభంగమహర్షి.

Also read: సీతారామలక్ష్మణులకు అత్రి, అనసూయల ఆతిథ్యం

అగ్నికి పూర్తిగా  ఆహుతి అయిపోయంది ఆయన శరీరం!

అప్పుడు ఆ కుండమునుండి ఆయన దివ్యశరీరము ఊర్ధ్వలోకాలవైపు సాగిపోయి బ్రహ్మలోకంలో ప్రవేశించింది.

ఆ ఆశ్రమ వాటికలో ఉన్న మునులంతా రాముని చుట్టూ చేరారు.

(శరభంగుడితో ఇంద్రుడు ఒక విషయం చర్చించాడు. అది రాముని గురించిన రహస్యము. ముందు ముందు వస్తుంది.)

వారిలో రకరకాల సంప్రదాయాలు అనుసరించి తపస్సు చేసుకునేవారున్నారు. వారందరూ గుంపుగా ఒకచోట పోగై రాముడిని కలిసి ప్రార్ధించారు.

‘‘రామా, రక్షకా! నీవు తప్ప మాకెవరు దిక్కు? నీ వద్దకు భిక్షుకులుగా వచ్చాము. అర్ధిస్తున్నాము. మాకు ప్రభువు నీవే కదా! ఇక్ష్వాకులేకదా అనాది కాలంనుండి మాకు దిక్కు. రామా మూడులోకాలలో నీవంటి మహాధనుర్విద్యావేత్త ఎవడూలేడు. అలాంటి నీ పాలనలోకూడా  మాకు రాక్షసుల బాధలు తప్పటం లేదు. మమ్ములను నీవే కాపాడాలి ప్రభూ!’’ అని ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు వారంతా.

Also read: రాముడి పాదుకలతో చిత్రకూటం నుంచి అయోధ్యకు బయలుదేరిన భరతుడు

‘‘ఓ తాపసులారా, మీరు నన్ను ఇలా ప్రార్ధించకూడదు. ఆజ్ఞాపించండి. మీ కోరిక నెరవేరుస్తాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రాక్షసులు నా పరాక్రమము, నా తమ్ముడి పరాక్రమము ఇకముందు రుచి చూస్తారు. మీరు గుండెల మీద చెయ్యివేసుకొని ఏ భయమూ లేకుండా మీమీ కార్యాలు చూసుకోండి’’ అని అభయమిచ్చి అక్కడనుండి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వైపుగా సాగిపోయాడు.

చాలాదూరం ప్రయాణం చేసి వారు ఆ ముని ఆశ్రమం చేరుకున్నారు.

రాముడిని చూడగానే ఆ ముసలి మునికి ఎక్కడలేని ఉత్సాహము ఉప్పొంగింది. ఒక్క ఉదుటున లేచి, ‘‘రామా వచ్చావా! నీకోసమే చూస్తూ ఉన్నానయ్యా’’ అని కౌగలించుకొన్నాడు.

‘‘మహర్షీ మాకు నివాస యోగ్యమైన ఒక స్థలాన్ని నీవు చూపగలవని శరభంగులవారు మాకు చెప్పినారు. కావున మాకు ఆచోటు చూపించండి స్వామీ’’ అని ప్రార్ధించాడు రాముడు.

అంత ఆ మహర్షి ‘‘రామా, ఈ ఆశ్రమవాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నీవు ఇక్కడే వసియించవచ్చు’’ అని అన్నాడు.

ఆయన మాటలు విన్న రాముడు ‘‘ధనుర్బాణములతో నేను ఇక్కడ ఉంటె ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలుగవచ్చు. కావున వేరొక చోటు చూపించండి స్వామీ’’ అని అడిగాడు.

అప్పటికే రాత్రి అయ్యింది ముని ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని అక్కడే విశ్రమించారు మువ్వురూ.

Also read: జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles