రామాయణమ్ – 62
సుతీక్ష్ణ మహాముని ఆశ్రమాన్నుండి నాలుగు యోజనాల దూరం ఉన్నది అగస్త్య భ్రాత ఆశ్రమము. మార్గమంతా కడు రమణీయంగా ఉంది .
దూరంగా పిప్పలి వనం కనబడుతున్నది వారికి. ఫల పుష్పాల బరువుతో వంగిన వేలకొద్ది చెట్లు కనబడ్డాయి. గాలి బాగా వీచినప్పుడల్లా పండిన పిప్పళ్ళ వెగటైన వాసన వస్తున్నది.
‘‘లక్ష్మణా! ముని చెప్పినట్లుగా మనము అగస్త్యభ్రాత ఆశ్రమానికి వచ్చినట్లుగా ఉంది. బహుశా ఇది ఆయన ఆశ్రమమే అయి ఉండవచ్చు’’ అని లోనికి ప్రవేశించారు.
Also read: రాక్షసులతో రాముడికి అకారణ వైరం ఎందుకు: సీతమ్మ ధర్మసందేహం
‘‘లక్ష్మణా! ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే క్రూరమైన రాక్షసులు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు బ్రాహ్మణులను చంపి తింటూ ఉండే వారు. బ్రాహ్మణులను చంపటానికి వారు ఒక ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్నారు. ప్రతిరోజూ ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి తద్దినానికి భోక్తలుగా రమ్మన్నట్లుగా ఒక నిర్దుష్టమైన భాషలో బ్రాహ్మణులను ఆహ్వానిస్తుండేవాడు. వాతాపి మేక రూపం ధరించే వాడు. ఆ మేక మాంసం బ్రాహ్మణులకు శ్రాద్ధ భోజనంగా వడ్డించేవాడు ఇల్వలుడు. ఆ భోజనం బ్రాహ్మణులారగించిన వెంటనే ‘‘వాతాపీ బయటకురా!’’ అని అరిచేవాడు ఇల్వలుడు. బ్రాహ్మణుల పొట్టలు బద్దలుకొట్టుకొంటూ వాతాపి బయటకు వచ్చేవాడు.
ఆ విధంగా ఎన్నో వేలమంది బ్రాహ్మణుల బ్రతుకులు బుగ్గిపాలు చేసారు సోదరులిద్దరూ.
ఈ విషయం అగస్త్య మహామునికి తెలిసి స్వయంగా ఆయనే ఒక రోజు భోక్తగా వెళ్ళాడు. ఎప్పటిలాగే వాతాపి ఆహారరూపంలో అగస్త్యుడి కడుపులోకి వెళ్ళాడు..రోజుటిలాగే ఇల్వలుడు అరిచాడు ‘‘వాతాపీ బయటకు రా’’ అని. అగస్త్యమహర్షి నవ్వుతూ ఇంకెక్కడి వాతాపి వాడేప్పుడో నా కడుపులో జీర్ణమయ్యాడు అని అన్నాడు.
Also read: దండకారణ్యంలో నివాసయోగ్యమైన స్థలంకోసం రాముడి అన్వేషణ
‘‘ఇల్వలుడికి కోపం వచ్చి మహర్షి మీదికి దూక బోతే ఆయన చూపు వాడిని భస్మం చేసేసింది. అంతటి మహామహిమాన్వితుడు అగస్త్యమహర్షి’’ అని చెప్పాడు రామచంద్రుడు..
(చిన్న పిల్లలకు అజీర్ణం వస్తే వారి పొట్ట నిమురుతూ మన పెద్దలు ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనేది అందుకే)
అగస్త్య భ్రాత ఆశ్రమములో ఆయన ఆతిధ్యం స్వీకరించి ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారగానే మహర్షి వద్ద సెలవు తీసుకొని ఆయన చూపిన బాట వెంట నడిచి అగస్త్యమహాముని ఆశ్రమానికి చేరుకొన్నారు సీతారామలక్ష్మణులు.
ఆ ఆశ్రమ సమీప వనమందు రాముడు వివిధరకములైన వృక్షజాతుల చెట్లు ఏపుగా పెరిగి ఉండటాన్ని గమనించాడు పనస ,తాటి, తినాస, పొగడ, చండ్ర, గానుగ, ఇప్ప, మారేడు, తిమ్మికి చెట్లున్నాయక్కడ. వందలకొలది పక్షులు ఆ చెట్ల మీద కూర్చుండి ధ్వని చేస్తున్నాయి.
మృగాలన్నీ జాతి వైరాన్ని మరచి కలసిమెలిసి జీవిస్తున్నాయి..
Also read: దండకారణ్యంలో విరాధుడి వధ
ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కనపడుతున్న వాతావరణం చూసి రాముడు లక్ష్మణునితో ‘ఇది అగస్త్య మహాముని ఆశ్రమమే. ఆ మహానుభావుడు గొప్పతపఃశాలి.
అగస్త్యః ఇతి.
అగస్త్యడు అనగా పర్వతమును నిలిపిన వాడు అని అర్ధము (అగము అంటే పర్వతము అని అర్ధము). ఆ మునిని చూస్తే రాక్షసులకు గుండె దడ.
‘‘లక్ష్మణా, మనము మిగిలిన వనవాస కాలాన్ని ఈ గొప్ప తపఃసంపన్నుడిని సేవిస్తూ ఇక్కడే ఉండి పోదాము. నీవు ముందుగా లోనికి వెళ్లి మన రాక అగస్త్య మహర్షికి తెలుపు,’’ అని పలికి ఆశ్రమ ప్రాంగణంలో వేచి ఉన్నారు సీతారాములు.
లక్ష్మణుడు లోనికివెళ్ళి మహర్షి శిష్యుడొకరితో దశరథ మహారాజు పెద్ద కొడుకు భార్యా సమేతంగా మిమ్ముచూడటానికి వచ్చి వాకిలి వద్ద వేచిఉన్నాడని మహర్షితో చెప్పమన్నాడు.
Also read: సీతారామలక్ష్మణుల అరణ్య ప్రవేశం
ఆ శిష్యుడు లోనికి వెళ్లి మునితో ఈ కబురు చెప్పాడు.
ఆయన వెంటనే ‘‘రాముడు వచ్చాడా! ఇక్కడకు వస్తే బాగుండును అని మనసులో అనుకుంటున్నాను రానే వచ్చాడు దాశరథి. నా అనుమతి తీసుకొనకుండగనే నీవు వారిని వెంట పెట్టుకు రావలసినది. నన్ను చూడటానికి రామునికి అనుమతి కావలెనా? తక్షణమే ఇక్కడకు తీసుకొనిరా’’ అని అగస్త్య ముని శిష్యుడితో రామసందర్శనాభిలాషతో తొందరపెట్టాడు.
ఆ శిష్యుడు వడివడిగా బయటకు వచ్చి రాముడెక్కడ మునిని చూడటానికి ఆయనకు అనుమతి అవసరములేదు అని పలికాడు. అగస్త్యముని శిష్యులు రాముని తగురీతిన సత్కరించి ఆశ్రమము లోనికి సగౌరవముగా తీసుకుని వెళ్ళారు.
Also read: సీతారామలక్ష్మణులకు అత్రి, అనసూయల ఆతిథ్యం
వూటుకూరు జానకిరామారావు