రామాయణమ్ – 38
గుహుడు కనపడగానే రాముడి అంతరంగంలో ఆనందం పొంగి పొర్లింది. తన ఆత్మసమానుడైన సఖుడు తన ఎదురుగా ఉన్నాడు. అంతే! తన దృఢమైన బాహువులలో బంధించాడు. ప్రాణ సఖుడిని కౌగలించుకొని క్షేమ సమాచారం కనుక్కొన్నాడు.
గుహుడి కంట నీరు ఆగటంలేదు. ‘‘రామా! నీకు అయోధ్య ఎట్లో ఈ నగరమూ అంతే. నీ కోసం నన్నేం చేయమంటావో చెప్పు. నీ వంటి ప్రియాతిప్రియమైన అతిధి మరెవ్వరికైనా దొరుకుతాడా!’’ అని పలికాడు.
Also read: గంగానదీ తీరం చేరిన సీతారామలక్ష్మణులు
రాముడొస్తున్నాడని భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాదులతో కూడిన అమృతప్రాయమైన తినుబండారాలు తెచ్చాడు గుహుడు. అవి రాజులు ఆరగించేవి. వాటిని తన ప్రియమిత్రుడికి అర్పించగా వాటిని సున్నితంగా తిరస్కరించాడు రామచంద్రుడు.
తానిప్పుడు తాపసవృత్తి అవలంబించిన విషయం గుర్తుచేసి తను ఆహారంగా స్వీకరించేది కందమూలఫలాలు కావున పంచభక్ష్యపరమాన్నాలు తాను స్వీకరించలేను అని తెలిపాడు
అశ్వాలు తన తండ్రిగారివికావున వాటికి శ్రేష్టమైన మేత తెప్పించమన్నాడు. అప్పుడు గుహుడు ఆ గుర్రాలకు ఆహార, పానీయాదులు అందచేశాడు.
Also read: కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ
రాముడు నారచీరను ఉత్తరీయంగా ధరించి సాయం సంధ్యను అర్చించి, లక్ష్మణుడు తెచ్చిన నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించాడు.
చీకట్లు నలుదెసలను కప్పివేశాయి. రాత్రి వేళ అది. రాముడు భార్యాసమేతుడై కటిక నేలమీద పడుకున్నాడు. అది చూసిన గుహుడి కంట దుఃఖమాగలేదు.
.
లక్ష్మణుడికి చక్కని పక్క ఏర్పాటు చేసి నీవుకూడా విశ్రమించవయ్యా అన్నాడుగుహుడు. ‘‘మేమందరమూ శ్రమజీవులము నీవు రాకుమారుడవు. రాముడి కోసం మేమంతా ఈ రాత్రి మేల్కొనే ఉంటాము. నీవు హాయిగా నిదురపో! రాముని రక్షణ బాధ్యత నాది. నేను నమ్ముకొన్న సత్యముపై వట్టేసి చెపుతున్నాను నాకు రామునికన్నా ప్రియమైనది ఈ ప్రపంచంలో లేదు. నీవు చింతలేకుండా నిదురపో’’ అని అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు గాద్గదికమైన గొంతుతో ఇలా అన్నాడు ….
“”ఎవరు ధనుస్సు ఎక్కుపెట్టి నిలుచుంటే సమస్త దేవగణాలు గజగజ వణికి పోతాయో! ఎవరి ధనుష్ఠంకారము దానవుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందో! అట్టి జగదేకవీరుడు రాముడు నేడు నేలపై పవళిస్తే నాకు నిద్రెలా పడుతుంది?నా తండ్రి ఎన్నో నోములు వ్రతాలు యజ్ఞాలు చేస్తే ఆయనకు లభించినవాడు ఈ రాముడు. అట్టి పుణ్యాలప్రోవు రాముడు నేడు నేలపై నిదురిస్తూ ఉంటే నేనెలా విశ్రమించగలను? ఈ రాముడు కనపడక ఆ తండ్రికూడా ఎక్కువ కాలం జీవించడు. కొద్దికాలంలోనే ఈ భూమి భర్త లేనిదవుతుంది.”
Also read: తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత
గుహుడు, లక్ష్మణుడు ధనుర్ధారులై వారిని సంరక్షిస్తూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, సుమంత్రుడితో సంభాషిస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది.
భాస్కరోదయ కాలొయం గతా భగవతీ నిశా
అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి
నాయనా పూజ్యురాలైన రాత్రి గడిచినది సూర్యోదయ సమయము ఆసన్నమైనది చాలా నల్లనియైనపక్షి కోకిల కూయుచున్నది.
..
(పూజనీయురాలైన రాత్రి అట ఎంత చక్కటి పదప్రయోగం! వందే వాల్మీకి కోకిలం).
రామచంద్రుడు నిదుర లేచాడు ఆయనకు కోకిలకూతలు, నెమళ్ల క్రేంకారాలు సుప్రభాతగీతికలయి మేల్కొలుపులు పాడినాయి.( ప్రకృతి ఏర్పాటు చేసిన వంది మాగధులు వీరు).
Also read: మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి
లేచిన వెంటనే ఆలస్యం చేయకుండా తాము చేయవలసిన పనిని లక్ష్మణునకు చెప్పాడు. వెంటనే గంగ దాటాలి.
లక్ష్మణుడు ఆ వార్త గుహుడికి చేరవేశాడు. హుటాహుటిన గుహుడప్పుడు దృఢమైనది, చక్కగా అలంకరింపబడినది, సమర్ధులైన నడుపువారు కలది అయిన నావను రేవులో సిద్దం చేసి, రాముని వద్ద వినమ్రుడై నిలుచున్నాడు.
అప్పుడు రాముడు ఆనందంగా ‘‘మిత్రమా మమ్ము ఆవలి ఒడ్డుకు చేర్పించవయ్యా’’ అని పలికాడు.
ఇంతలో సుమంత్రుడు వచ్చి రామా ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు మోడ్చి నిలుచున్నాడు.
రాముడు తన కుడి చేతితో సుమంత్రుని స్పృశిస్తూ ‘‘ఇక నీవు తిరిగి వెళ్ళి రాజును కనిపెట్టుకొని ఉండుము’’ అని పలికాడు.
అప్పటిదాకా రాముడితో కలిసి వున్న సుమంత్రుడు తిరిగి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి కరిగి నీరైనాడు …‘‘రామా! నీ కష్టాలు చూస్తుంటే ఋజుత్వానికి గానీ, బ్రహ్మచర్యానికి గానీ, వేదాధ్యయనమునకు గానీ, మృదుత్వానికిగానీ ఫలం లేదు అనిపిస్తున్నది! నీ కష్టాలు భరించగలగటం నీవలననే సాధ్యం. లోకంలో ఏ ఒక్క పురుషుడి వల్లకూడా కాదు సుమా!’’ అన్నాడు.
(ఈ మూడు రోజులకే ఇట్లా అంటున్నాడీయన, ఇక ముందు ఏమి కానున్నదో ఈయనకు తెలియద).
‘‘మేమెంత దురదృష్టవంతులము! నీకు దూరమై పాపాత్మురాలైన ఆ కైక వశులమై ఇక బ్రతుకీడ్చాలి ’’అని పరిపరివిధాలుగా దుఃఖిస్తున్న సుమంత్రుని చూసి రాముడు, ‘‘సుమంత్రా, ఇన్ని వేల సంవత్సరాలనుండీ రాజులు పరిపాలిస్తున్నారు. రాజాజ్ఞ అనుల్లంఘనీయము. అప్రతిహతము కదా! అయినా అడవిలో జీవించవలసినందులకు నేనుగానీ, సీతగానీ, లక్ష్మణుడుగానీ ఏ మాత్రము బాధపడటంలేదు. పద్నాలుగేండ్లు ఎన్నాళ్ళలో తిరిగి వస్తాయి చెప్పు? మేము ఇలా వెళ్లి అలా తిరిగి వస్తాము. అయోధ్యలో మరల మీ అందరితో కలిసి ఆనందంగా కాలం గడుపగలము. కావున నీవు విచారింపకుము’’ అని పలికి అయోధ్యలో అందరికీ పేరుపేరునా తన నమస్కారములు తెలియచేయమన్నాడు.
Also read: నారవస్త్రాలు ధరించిన సీతారామలక్ష్మణులు
‘‘రామా నిన్ను విడిచి నేను వెళ్ళలేను. నిన్ను విడిచి ఉండలేనయ్యా! నీ భక్తుడను,నీ భృత్యుడను,మర్యాద కాపాడువాడను నన్ను విడువకయ్యా, నీ తోటే ఉంటాను. నాకు అనుజ్ఞ ఇవ్వు’’ అని సుమంత్రుడు రాముని వేడుకుంటున్నాడు.
‘‘సుమంత్రా నీవు తిరిగి వెళ్ళకపోతే మా అమ్మ కైకేయికి నేను అరణ్యానికి వెళ్ళాననే నమ్మకము కలిగేదెట్లా? అందుకోసమైనా నీవు తిరిగి వెళ్లాలి’’ అని సుమంత్రుని సమాధాన పరిచినాడు.
గుహుని వైపు తిరిగి ‘‘మిత్రమా మర్రిపాలు తెప్పించయ్యా, జటాధారిని కావాలి నేను’’ అని పలికాడు.
Also read: దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ
వూటుకూరు జానకిరామారావు