Thursday, November 21, 2024

జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు

రామాయణమ్ 54

‘‘భరతా, తండ్రి ఋణగ్రస్తుడైనప్పుడు ఆయన ఋణము తీర్చవలసిన బాధ్యత పుత్రులుగా మనపైన ఉన్నదికదా! “పుత్” అనే నరకం నుండి తండ్రిని తప్పిస్తాడు కావున పుత్రుడు అని పిలుస్తారు. మన తండ్రి నీ తల్లిని వివాహము చేసుకొనే సందర్భములో ఆవిడ కుమారునకు మాత్రమే రాజ్యమిస్తానని నీ తాతగారికి వాగ్దానము చేసియున్నాడు. దేవాసుర సంగ్రామము జరిగే సమయములో నీ తల్లి చేసిన సేవకు మెచ్చి వరము కూడా ఇచ్చి ఉన్నాడాయన. దాని ప్రకారము నీకు రాజ్యము నాకు అరణ్యవాసము మన తండ్రిగారు నిర్ణయించినారు.

Also read: తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు

‘‘తండ్రి వాక్కునందు  స్థిరముగా నిలచి నేను అరణ్యవాసము సీతా లక్ష్మణ సమేతముగా చేయ నిశ్చయించుకొన్నాను. నీవు కూడా పట్టాభిషిక్తుడవై తండ్రిగారి సత్యవాదిత్వమును నిలబెట్టుము. ఆయనను ఋణవిముక్తుని చేయుము. భరతా, నీవు నరులకు రాజువగుము, నేను వనములోని మృగములకు రాజు నయ్యెదను .శీఘ్రమే తిరిగి వెళ్ళి పట్టాభిషిక్తుడవు కమ్ము!’’

రాముడు భరతునితో ఇలా మాట్లాడుతుండగా, బ్రాహ్మణోత్తముడైన జాబాలి మధ్యలో కల్పించుకొని. ‘‘రామా! చాలాబాగున్నదయ్యా నీవు చెప్పేది! ఎంత నిష్ప్రయోజనమైన ఆలోచన నీది. ఎవడైనా గానీ ప్రాణి ఒంటరిగానే పుడుతున్నాడు. ఒంటరిగానే గిడుతున్నాడు. ఎవడు ఎవడికి బంధువు? ఎవడినుంచి ఎవడు ఏమి పొందుతున్నాడు? నా తల్లి, నా తండ్రి అని అంటూ ఇంత ఉన్మత్తమైన ప్రేమ ఎందుకు? ఎవ్వడూ ఎవడికి ఏమీ కాడు! ప్రయాణం చేసేటప్పుడు ఒక ఊరిలో రాత్రిపూట బస చేసినట్లు ఎక్కడ నుండి వచ్చాడో తెలియని మనిషికి తల్లి తండ్రి బంధువులు వీరుండే చోటుకూడా అలాంటిదే! ఎందుకయ్యా హాయిగా రాజ్యాన్ని ఏలుతూ సుఖంగా ఉండకుండా “తండ్రిమాట” అంటూ అత్యంత కష్టమైన అరణ్యవాసాన్ని కౌగలించుకొంటావు? ఏడి? దశరధుడు ఇప్పుడున్నాడా? అతడిప్పుడు నీకేమీ కాడు, నీవతనికి ఏమీ కావు! అసలు తండ్రి ఎవరు? అతను బీజము మాత్రమే. తల్లి ఋతుమతి అయినప్పుడు శుక్లము, శోణితము కలువగా పురుషుడు జన్మిస్తున్నాడు. అంతే! నిన్ను చూస్తే జాలికలుగుతున్నది. ధర్మము, ధర్మము అంటూ పట్టుకొని పాకులాడుతున్నావు! చచ్చినవారి కోసము ఏవేవో తద్దినాలు పెడుతున్నారు. ఎంత అన్నము వృధా అవుతున్నదో వాటివల్ల!  నీవు ఇక్కడ పెట్టే అన్నము అక్కడ అది నీ తండ్రిని చేరుతున్నదా!  దానాలివ్వమనీ, యజ్ఞాలు చెయ్యమనీ పనికిరాని మాటలు కొందరు మేధావులు చెపుతున్నారు.

Also read: భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు

రామా, నాకు తెలిసి ఇక్కడ మనమున్న లోకమొక్కటే లోకము. పరలోకము లేదు పాడులేదు. దానిని నీవు లెక్కపెట్టవలసిన పనిలేదు. ఆనందంగా రాజ్యమేలుకో. ధర్మము అంటూ పట్టుకొని వేళ్ళాడకు.’’

జాబాలి మాటలు అధికమైన భక్తితో శ్రద్ధతో విని చలించనిబుద్ధితో ఇలా అన్నాడు రాముడు.

‘‘నీవు నా సంతోషాన్ని కోరి ఇప్పటివరకు పలికిన పలుకులు పైకి బాగానే కనబడతాయి. కాని అవి చేయకూడనివి, హితముకానటువంటివి అయినవి. కట్టుబాట్లు గాలికి వదిలివేసి మంచినడవడి, మంచి చూపు లేని మానవుడు సమాజంలో గౌరవము పొందజాలడు. మనిషి నడవడికను బట్టే వాడు కులీనుడో కాడో, వీరుడో కాడో,పరిశుద్ధుడో కాడో చెప్పవచ్చును. నేను పైకి మంచివాడిలా కనపడుతూ లోపల దుష్టత్వము నింపుకొని యుండవలెనా? నిజాయతీ అవసరములేదా ? లోపల ఎన్నో దౌర్భాగ్యపు ఆలోచనలు పెట్టుకొని బయటకు గొప్ప శీలవంతుడిలా కనపడమంటావా? గోముఖవ్యాఘ్రమని, పయోముఖ విషకుంభమనీ, తేనెపూసినకత్తి అని లోకులు నన్ను ఆడిపోసుకోరా?

ప్రతిజ్ఞను మరచి ప్రవర్తిస్తే ఇంక నేను ఎవరికి మంచి మార్గము ఉపదేశించగలను? స్వర్గమునకు చేరుకోగలనా? ధర్మ వర్తనము లేక రాజు స్వేచ్ఛావర్తనుడైతే ప్రజలు కూడా అదేవిధముగా ప్రవర్తించరా! ఈ రాజ ధర్మము అతిపురాతనమైనది. సత్య స్వరూపమైనది. దీనిలో క్రూరత్వమునకు తావులేదు . రాజుకు సత్యమే ప్రధానము. జాబాలీ, సత్యము మీదనే లోకము ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యే లోకః ప్రతిష్ఠితః!

Also read: రాముడి పాదాల చెంతకు చేరిన భరతుడు

ఈ లోకములో సత్యమే ఈశ్వరుడు. లక్ష్మి సత్యమునే ఆశ్రయించి ఉంటుంది. సత్యాన్నిమించిన ఉత్తమధర్మము లేదు. సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్! నేను సత్యప్రతిజ్ఞ కలవాడను. తండ్రి ఎదుట సత్యముపై శపధము చేసిన నేను ఆయన ఆజ్ఞను పాలించకుండా ఉండలేను. నా సత్యప్రతిజ్ఞను లోభమువలన కానీ, చిత్తభ్రమవలనకానీ, తమోగుణమువలన కలిగిన అజ్ఞానము వలన కానీ భేదించను.

స్థిరచిత్తుడైన రాముడు ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నాడు.

(మనలో కలిగిన భావమేదో దానికి అనుగుణముగా రాగముండవలే తదనుగుణముగా తాళముండవలె!

భా.ర.త..వాడే ఈ సంస్కృతిని కాపాడే భా.ర.తీ యుడు))

(ప్రస్తుత ప్రపంచంలో “జాబాలి” సంతతి ఎక్కువ అయినట్లుంది కదూ!)

రాముడు గంభీరంగా చెపుతున్నాడు. గొంతులో ఒక స్థిరత్వం మాటలో పటుత్వం కలగలసి వస్తున్నాయి. ఆయన వాక్కులు దృఢంగా ఉన్నాయి..

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన

‘‘నీచులు, క్రూరులు, పాపాత్ములు, దురాశాపరులు సేవించేటటువంటిది అధర్మముతో నిండినదీ అయిన క్షత్రియధర్మమును నేను పరిత్యజించెదను. మనిషి చేసే పాపము, ముందు  అతని మనసులో పుడుతుంది. ఆతరువాత శరీరము ఆ పాపకర్మ చేస్తుంది . నాలుక అబద్ధమాడుతుంది. ఈ విధముగా పాపము మూడు విధాలుగా ఉంటుంది. ..

ఒకటి .మానసికము,,

రెండు..శారీరికము.,, మూడు ..వాచికము.

‘‘జాబాలీ,  నీవు శ్రేష్ఠము అని నాకు చెప్పినదంతా కూడా చెడ్డదే! నా తండ్రిగారి ఎదుట చేసిన ప్రతిజ్ఞ కాదని ఇప్పుడు భరతుడి మాటలను ఏల పాటించగలను? నా తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ స్థిరమైనది! అప్పుడు కైకేయీ దేవి కూడ సంతసించినది. నేను పరిశుద్ధుడనై ,మితభోజనము చేయుచు, పవిత్రములైన, పితృదేవతలను తృప్తి చెందించుతూ, సంతుష్టి చెందిన పంచేద్రియములు కలవాడనై ,కపటము విడనాడి (Without Hypocrisy) శ్రద్ధావంతుడనై కార్యాకార్యములు తెలుసుకుంటూ వనవాసజీవితము గడిపెదను. దేవతలందరును ధర్మసమ్మతమైన శుభకార్యములు చేయుటవల్లనే ఆయా పదవులు పొందగలిగారు.’’

Also read: గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం

అని పలుకుతూ నాస్తికత్వముతో కూడిన జాబాలి మాటలను నిర్ద్వంద్వముగా ఖండించాడు రాముడు.

‘‘అసలు నీలాటి వారిని చేరదీసిన నా తండ్రిని నిందించవలె నిన్నుకాదు. సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియవాక్కు, అతిధులపూజ ..ఇవి స్వర్గానికి మార్గములని సత్పురుషులు చెపుతున్నారు.’’

రాముడి ఆగ్రహన్ని చూసిన జాబాలి ‘‘రామా! నేను నాస్తికుడను కాను. నిన్ను అయోధ్యకు మరల్చవలెననే ఉద్దేశ్యము తప్ప వేరే ఏదియును లేదు.

రాముడికి కోపము వచ్చినదని గ్రహించిన వశిష్ఠులవారు ఆయనకు ఇక్ష్వాకుల చరిత్ర అంతా తెలిపి, ‘‘ఇక్ష్వాకులలో జ్యేష్ఠుడే రాజు! అదే ధర్మము’’ అని తెలిపి శాంతింపచేశారు. ‘‘అతి ప్రాచీనమైన మీ కుల ధర్మాన్ని నీవు చెరచవద్దు’’ అని హితబోధ చేశారు.

‘‘రామా, నేను  నీకు, నీ తండ్రికి ఆచార్యుడను. నేను చెప్పిన విధముగా చేసినచో నీవు ధర్మమార్గమును అతిక్రమించినవాడివి కాజాలవు….’’ అని అన్నారు వశిష్ఠ మహర్షి.

Also read: భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles