Sunday, December 22, 2024

పదితలలు గిల్లివేసె రామమూర్తి

13తిరుప్పావై

28.12.2023

పుళ్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై
క్కిళ్లిక్కళైందాననై కీర్తిమై ప్పాడి ప్పోయ్
పిళ్లైగళ్ ఎల్లారుమ్ పావై క్కళం పుక్కార్
వెళ్లి ఎఝుంద్ వియాజమ్ ఉరంగిట్రు
పుళ్లుం శిలంబిన్ కాణ్ పోదరి కణ్ణినాయ్
కుళ్ల క్కుళిర కుడైందు నీరాడాదే
పళ్లికిడత్తియో పావాయ్ నీనన్నాళాల్
కళ్లమ్ తవిర్ న్దు కలందేలో రెంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

రాకాసికొంగ ముక్కుచీల్చివేసె రాజగోపాల కృష్ణమూర్తి

రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి

రామకథలు రాసలీలలు భజించు కన్నెపడుచులెల్ల

గగనాన గురుడు క్రుంగి శుక్రుడుదయించు శుభవేళ

పక్షులకలరవములు వినవేల పంకజాక్షి పలుకవేల

మనసెల్ల మాధవుగోరుచు పైకి నిద్రనటించుటేల

మేను జిల్లనగ యమున జలాలనీవు మునగవేల

నటనజాలించి నళినాక్షి రావమ్మవ్రతము జేయ

శ్రీరాముడిని శ్రీ కృష్ణుడిని కీర్తిస్తారు. తొండరడిప్పొడియాళ్వార్ కూడా తన తిరుమాలై గ్రంధంలో రామకృష్ణులను సమంగా స్తుతిస్తారు.  కొంగ దంభానికి, రావణుడు అహంకారానికి ప్రతీకలు.

విప్రనారాయణ
         ఈ పాశురంలో భక్తాంఘ్రిరేణు, శ్రీపాదరేణువు అంటే విప్రనారాయణుని మేల్కొల్పుతున్నారు. ఆయన పూలసేవలో తరించిన వాడు. పావాయ్ అంటే పతివ్రత. ఒక్క భర్తకే వశమై ఉండడం ఆవ్రతం. ఈ ఆళ్వార్ కేవలం రంగనాథుడిని తప్ప మరే దివ్యదేశ పెరుమాళ్ ని కలవని తలవని వాడు. భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడి యాళ్వారు) కలియుగము పుట్టిన రెండొందరేళ్ల తరువాత చోళదేశమునందు మండంగుడి అను గ్రామములో ఒక పురశ్చూడ వైష్ణవునకు పుత్రుఁడై వనమాల అనే అంశంతో అవతరించినారు, విప్రనారాయణుఁడు ప్రముఖుడైన ఆళ్వార్. చాలా సందర్భాలలో చలన చిత్రాలు కూడా నిర్మించారు. సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసము అనే పేరుతో కావ్యంగా రచించాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని విప్రనారాయణ 1954 విడుదలైన చిత్రం ఈ సినిమాను నిర్మించారు.

Also read: సీతను విడదీసిన రావణుని దునిమాడిన దాశరథి

విప్రనారాయణశ్రీరంగని భక్తుడు. పరమ నిష్టాగరిష్టుడైన పూజారి. రంగనాథుడిని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దానితో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతడిని తన పాదదాసున్ని చేసుకొంటానని అక్కతో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియ సచివుడు రంగరాజు అడ్డు తగిలినా లాభం లేకపోతుంది.దేవదేవి నెరజాణ, వేశ్య. నాట్యం, హొయలు, నయగారాలు, అమాయకంగా కళ్ళభాషతో కవ్వించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. విప్రనారాయణునిలో నెమ్మదిగా సంచలనం కలిగిస్తూ అక్కడ వున్న మూడో వ్యక్తి రంగరాజుకు ఉద్వాసన పలికిస్తుంది. ఆమె భక్తినుంచి రక్తిపైపు విప్రనారాయణుని మళ్ళిస్తుంది. అదను కోసం ఎదురుచూసిన దేవదేవికి అవకాశం రానే వస్తుంది. వర్షంలో తడిసి జ్వరంతో కాగిపోతున్న అతనికి సపర్యలు చేసే వంకతో దేవదేవి అతనిపై చేయివేస్తుంది. స్త్రీ స్పర్శ తొలిసారిగా అనుభవించిన ఆ పూజారి మెల్లగా ఆమెకు దాసుడవుతాడు. ఆమె లేనిదే క్షణం కూడా ఉండలేనివాడవుతాడు.అప్పుడు శ్రీరంగనాథుడు తన భక్తుడికి ఐహిక బంధాల నుండి విముక్తి కలిగించే ఉద్దేశ్యంతో, ఆలయంలోని కాంచనపాత్రను అపహరించిన నేరం విప్రనారాయణునిపై పడేటట్లు చేస్తాడు. రాజసభలో విచారణ జరిగి అతనికి శిక్ష పడుతుంది. విప్రనారాయణుడు తాను భగవంతుడిని విస్మరించిన సంగతి గుర్తించి పశ్ఛాత్తాప పడతాడు. రాజభటులు విప్రనారాయణుని చేతులు నరకబోయే సమయంలో భగవంతుడు కలుగజేసుకుని అతన్ని రక్షిస్తాడు. తరువాత పతాక సన్నివేశంలో విప్రనారాయణుడిని, దేవదేవినీ తనలో ఐక్యం చేసుకుంటాడు.ఈ సినిమాకు కీలకమైన మాటలు, పాటలను సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు.ఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా, భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు. (పూర్తి సినిమా చూడవచ్చు https://www.youtube.com/watch?app=desktop&v=SVrFkXOR-A4)

మీరలీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్

సారంగుతమ్మయ్య రచించిన వైజయంతీవిలాసముపన్నిద్దరు ఆళ్వారులలో

తొండరడిప్పొడి(భక్తాంఘ్రిరేణువు)గా అయిన 7వ ఆళ్వారు విప్రనారాయణుని కథ తెలుపుతుంది. విప్రనారాయణుడు క్రీ.పూ. రమారమి 3000సంసత్సరముల క్రిందటివాడని ద్రవిడగ్రంథాలలోని ప్రస్తావించారు. అది క్రీ.శ.7వ శతాబ్దంగా అని పెద్దలు నిర్ణయించారు.

దీనిక వెనుక ఒక కథ ఉంది. రంగనాథుని గుడిలో బంగారు పాత్ర దొంగిలించబడింది.ఆ నేరం విప్రనారాయణునిపై మోపినారు. ఆ సమయంలోఇతర మతాలవారు  ఎత్తి పొడుపుగా అన్నమాటలుసారంగు తమ్మయ్య ఈ విధంగా పద్యరూపం కల్పించాడు, ఈ విధంగా.

చోరుఁ డనంగరా దొరుల సొమ్ములు మ్రుచ్చిలినం బ్రసన్నునిన్

జారుఁ డనంగరా దు వెలుచం బరకాంతల గూడ, వీ డనా

చారుఁ డనంగ గూడ దనిశంబును వేశ్యలతో రమించినన్

బోరన మీరలీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్

                                                            (వైజయంతీ విలాసము – 4-101)

ప్రపన్నుడు(విష్ణువును నమ్ముకున్నవారిని ప్రపన్నులంటారు). ఓ వైష్ణవులారా! మీరంతా ఇతనికి గొప్పగాబ్రహ్మరథం పట్టి సత్కరించండి – అని పద్యభావం అని సాహితీ నందనం వైబ్ సెట్ లో వివరించారు.

శ్రీ పుండరీకాక్షాయనమః

గురుపరంపరలో శ్రీ పుండరీకాక్షాయనమః అనే నమోవాకాన్ని అనుసంధించుకోవాలి ఈ పాశురంలో. పుండరీకాక్షాయ నమః అని పవిత్రం చేయించే మంత్రం. నారాయణుని మరో నామమైనదీ పుండరీకాక్షాయుడు.తిరువెళ్ళరై (Thiruvellarai) తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిరాపల్లి నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుండరీకాక్షాయుని దేవాలయం ఉంది. ఇక్కడి శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ దేవాలయం వైష్ణవ దివ్యదేశాలుగా ప్రసిద్ధిచెందినది.పంగయచ్చెల్వి తాయార్ (చంపకవల్లి) పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణి కర్ణిక, వరాహ, గంద, క్షీర, పుష్కరణులు ఉన్నాయి. తిరుమంగై ఆళ్వారులు, పెరియాళ్వారులు పాశురాలు పాడిన వారు. శ్వేతాద్రి-విమలాకృతి విమానము కలిగిన వారు. మార్కండేయ, శిబి, గరుడ, భూదేవులకు వారికి దర్శనం లభించింది.

Also read: నిరంతరం యవ్వనంలో ఉన్న గోకులంలో గోవులన్నీ

అరక్కనై అంటే రాక్షసుడు  ఆ మాట అంటే సరిపోయేది. కాని పొల్లా అరక్కనై అనే పదం ఇక్కడ వేశారు. దుష్టుడైన రాక్షసుడు. రాక్షసులలో విభీషణుడి వంటి మంచివారూ ఉంటారు. కనుక రావణుడని చెప్పకనే చెప్పడం ఇది.

నేపథ్యం

పోదరికణ్ణినాయ్ నేత్రమే జ్ఞానంఅని చెప్పే ఈ పాశురంలో తొండరడిప్పొడి యాళ్వార్ ను నిద్రలేపుతున్నారు. పుష్పకైంకర్య పరాయణులైన విప్రనారాయణుడీయన. పోతరికణ్ణినాయ్ అంటే పూలు సమకూర్చడమే కార్యంగా పెట్టుకున్నవారు అని. అందంగా తులసి మాలలు కట్టి, ఆ మాలలతో నిండిన బుట్టను భుజాన ధరించి శ్రీరంగంకోవెలలో దర్శనమిచ్చే ఆళ్వార్ విప్రనారాయణుడు. ఈ పాశురంలో శ్రీరాముడిని శ్రీ కృష్ణుడిని కీర్తిస్తారు. తొండరడిప్పొడియాళ్వార్ కూడా తన తిరుమాలై గ్రంధంలో రామకృష్ణులను సమంగా స్తుతిస్తారు.  కొంగ దంభానికి, రావణుడు అహంకారానికి ప్రతీకలు.

విష్ణు సేవలో కులభేదం లేదు

మథురలో పుట్టి బృందావనంలో తిరుగాడే గోపికలు కృష్ణుని కాక రాముని తలవడం ఏమిటి? అయోధ్యలో రాముడు రాముడు అనే తప్ప మరో మాట ఎరుగరు. నందవ్రజంలో కృష్ణుడిని గాక అన్యనామం ఎందుకు తలుస్తారు? ఈ పాశురంలో రాముడా కృష్ణుడా ఎవరుమిన్న అనే వాదం సాగుతుంది. ఆకారాలు వేరుగా ఉన్నా ఇరువురూ పరమాత్మస్వరూపాలే కదా అని నిర్ధారణకు వస్తారు. భద్రుడి తపస్సు మెచ్చి విష్ణువు అవతరిస్తే, ఆయన నువ్వెవరు? నేను నిన్నెరుగను. నాటి రూపుచూప నమ్మగలను అంటాడట. సరే అని శ్రీరాముని ఆకారంలో కనిపిస్తే తప్ప ఆయనకు తృప్తి కలగలేదు. శంఖ చక్రాలు ధనుర్బాణాలతో శ్రీరాముడు ఉండడం సాధారణంగా మనకు తెలియదు. కాని భద్రాచలంలో ఆయన రూపం అది.

శ్రీ కృష్ణుడిని ఊయలలో నిద్రబుచ్చుతూ, అనగా అనగారాముడనే బాలుడుండేవాడు అని యశోద కథ మొదలు పెట్టింది. కిట్టయ్య ఊఊ అన్నాడు. రాముడికి సీత అనే భార్య ఉంది. చిట్టి కిట్టయ్య ఊహూఊ అన్నాడుమళ్లీ. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లారు. ఊఊ.. అక్కడ సీతమ్మను రావణుడు అపహరించాడు అని యశద చెప్పగానే ఆవేశంతో లక్ష్మణా ధనుస్సు ధనుస్సు ఏది ధనుస్సు ఎక్కడ అని ఆవేశంతో అరుస్తూ లేచాడట. రాముడు కృష్ణుడు ఒక్కరే అనడానికి ఇంకే ప్రమాణం కావాలి? 

అర్థం

పుళ్లిన్ వాయ్= కొంగ (బకాసురుని) నోటిని, కీన్దానై =చీల్చిన శ్రీకృష్ణుని, పొల్లా=దుష్టుడైన: అరక్కనై = రావణాసురుడి తలలను, క్కిల్లి = త్రుంచి, క్కళన్దానై= పారవేసినశ్రీరాముని, కీర్తిమై= కీర్తిని, పిళ్లెగళ్ = పిల్లలు, ఎల్లారుమ్= ఎల్లరును, ప్పాడి=గానం చేసి, ప్పోయ్= వెళ్తూ, పావైక్కళం = వ్రతం చేసే ప్రదేశాన్ని, పుక్కార్ =ప్రవేశించారు. వెళ్లి=శుక్రుడు, ఎజుందు=ఉదయించి, వియాజమ్ గురు(వారం) అస్తమించాడు, పుళ్లుమ్ =పక్షులును, శిలంబినకాణ్= కిలకిలరావములు చేస్తున్నాయి, పోదు= తామరపుష్పంలోని, అరి= తుమ్మెదల వంటి, కణ్ణినాయ్=కన్నులున్నదానా, పావాయ్= ఓ సుకుమారి, నీ= నీవు, నన్నాళాళ్= ఈ మంచి రోజున, కుళ్లక్కుళిర = చల్లచల్లగా, కుడైందు= అవగాహనం చేసి, నీరాడాదే= స్నానం చేయకుండా, పళ్లిక్కిడత్తియో=పాన్పుపై పడుకొని ఉన్నావా? కళ్లమ్= కపట స్వభావాన్ని, తవిర్ న్దు= వదిలి, కలన్దు =మా తో చేరు.

Also read: హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

కొంగ రాక్షసుడు బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడు, రావణుని తలలు గిల్లిపారేసిన శ్రీరాముని కీర్తిస్తూ గోపికలందరూ వ్రతస్థలికి చేరుకున్నారు. గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నవేళ, పక్షులు గలగలా ఆహారపు వేటకు వెళ్తున్నాయి. తుమ్మెద దూరిన తామెరపూవు వంటి కన్నుల దానా సుకుమారీ, శ్రీకృష్ణుని గుణానుభవాన్ని నీవొక్కదానివే అనుభవించాలనే కపట స్వభావాన్ని వదిలి మా అందరితో చేరి చల్లని నీటిలో స్నానం చేయకుండా ఇంకా పాన్పుపై పడుకోవడం ఎందుకు?(ఇదీ మేలుకొలుపు ఇక్కడ: పళ్లిక్కిడత్తియో.. పాన్పుపై పడుకొని ఉన్నావా కలన్దుమా తో చేరు)

ఉత్తిష్ఠ జాగ్రతా ప్రాప్య వరన్ నిబోధత”

కఠ ఉపనిషద్ (1.3.14)లో యమ నచికేతుల ఇద్దరి మధ్య వచ్చిన సంభాషణలో ఈవిధంగా, ‘ఉత్తిష్ఠ జాగ్రతా ప్రాప్య వరన్ నిబోధత”,”ఓ జీవుడా, నీవు ఈ భౌతిక ప్రపంచంలో నిద్రపోతున్నావు. దయచేసి లేచి నీ మానవ రూపాన్ని సద్వినియోగం చేసుకో”,”నిద్రపోయే పరిస్థితి అంటే సమస్త జ్ఞానాన్ని కోల్పోవడం” లేవండి అని ప్రభోదిస్తున్నారు”

గోదా మేలుకొలుపులు ఇవి

పిళ్లాయ్ ఎళుందిరాయ్ అంటూ 6 వ పాశురంలో విష్ణుని సేవకు వేగమై రండి అనీ, 7 వ పాశురంలో నీకెట్టే కడిత్తియో మీకు వినబడడం లేదా, అనీ 8వ పాశురంలో తెలవారుతున్నది రండి, నీకు లేపగ వస్తున్నాననీ, కొండనెత్తినవాని కొండంత వరమడిగ చేతాము ఈ వ్రతం రావమ్మ వేగ అనీ, 9 పాశురంలోమామకూతురా లేవమ్మా మణికాంతులీను గడియ తెరువమ్మా అనీ 10వ పాశురంలో కుంభకర్ణుని దగ్గర మొద్దు నిద్రను మీకు ఇచ్చెనే ఏమిఅనీ, 11 పాశురంలో కలివైరి అనే బిరుదు పొందిన దావా బంధుమిత్రులాం నీ ముంగిట జేరి ఘనశ్యాముని ఘన కీర్తనలు పాడుతూ ఉంటే నిద్రిస్తున్నామా అనీ, 12పాశురంలో మీ అన్ననీవేమో యోగ నిద్రలో మునిగి ఉన్నారా, మామాట వినికూడా నోరు విప్పవా కులశేఖరా రావమ్మా వ్రతం చేద్దాం అనీ, 13న దశకంఠులన తలలు గిల్లి పారవైచి కృష్ణ రాముల శౌర్య గాధలను కీర్తించడానికి ఉంటే ఇంటా పడకపై పరుండియున్నారా, మాతో గూడి తానమాడగ నీవు తరలి రావమ్మ, అనీ 14వ పాశురంలోనేనే ముందే వస్తామని గొప్పలు చేసుకున్నా అనంత నామధేయుడిని కీర్తించడానికి రావడం లేదే, దివరకు భక్తాంఘ్రిరేణువు మేలుకొలుపినా రావడం లేదే, 15వ పాశురంలో నీవు మాతా కూడా కలసివస్తే మాకానందం కదా, ఇంకా అందరూ రాలేదా అని అనుమానిస్తున్నారా కావలంటే వచ్చి ఎంచుకొండి అని మేలుకొలుపుచేస్తున్నారు. 16వ పాశురంలో నాయగనాయ్ లో అందరం పొద్దున్నే స్నానాలకు వచ్చినా మేలు కొలుపు పాడించడానికి ఎదురుచేస్తున్నామనీ 17న ఓ తిరుమంత్రమా యశోద, నీవూ నీ తమ్ముడూ కలిసి మేలుకొనండీ అనీ 18న జగమునంతా మేలుకొలుపుచున్నామై రండి, 19న నీవు కదలించి లేవమ్మా అని, 20వ పాశురంలో 33 కోట్ల మిమ్మల్నిందరినీ ఆపదలు వదిలే నీవు రావా అనీ, 21న పాశురంలోనిను శరణు వేడుచు నీ వాకిట నిలిచి ఉన్నాం ఇక రండి అనీ, మేలుకొలుపులు పలుకుతున్నారు.

అంతరార్థం
         గోపికలంతా వ్రతం చేయడానికి ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. శ్రీకృష్ణావతారం ముగిసిన తరువాత రామావతార వైభవానికి వారు పాడుకుంటున్నారు. తమతో కలిసి రమ్మని లోపలున్న గోపికను మేలుకొలుపు పాడుతుంటే, ఆమె లేవడం లేదు.

గోపిక: అప్పుడే తెల్లారిందనడానికి ఏమిటి రుజువులు

బయటి గోపికలు: శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు.

గోపిక: వేరే గుర్తులేమీ లేవా?

గోపికలు: పక్షులు కలకలం చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. కలకలం అంటే భాగవతులు కలిసి చెప్పుకునే అనుభవాలు, భగవద్గుణానుభవాలు.వాటిని అందరూ పంచుకుంటూ ఉంటే, నీవేమిటమ్మా ఒంటరిగానే శ్రీకృష్ణ గుణానుభవాలను అనుభవిస్తున్నావు. ఇది న్యాయమా? పోనీ శ్రీకృష్ణవిరహం వల్ల స్నానం చేయాలని ఉందా? అలా అయితే సూర్యోదయానికి పూర్వమే నీళ్లు చల్లగా ఉంటాయి. తెల్లవారితే నీళ్లు వేడెక్కుతాయి సుమా. శ్రీరాముని విడిచి ఉండలేక భరతుడు అర్థరాత్రి సరయూనదిలో స్నానం చేసేవాడట. ఇవి మంచిరోజులు. శ్రీకృష్ణుడితో మనను కలవనివ్వని పెద్దలు ఇప్పుడు కలవడానికి అనుమతించారు. నీవొక్కదానివే భగవద్గుణానుభవం చేయడం సరికాదు. దీన్ని కాపట్యం అంటారు. కాకపోతే మాతో కలిసి ఆ అనుభవాలు పొంద వచ్చుకదా అని గోద లోపలి గోపికలతో వాదిస్తున్నారు. ఒక్కరే భగవదారాధన చేయడం కాదు. గోష్టిగా సమిష్టిగా శ్రీకృష్ణుడి గుణగణాలను తలచుకోవాలని గోదమ్మ బోధిస్తున్నారు.

Also read: లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె

కొంగ అంటే దంభము. ఇతరులను హింసించడం అతని ప్రవృత్తి కాని పైకి సజ్జనుడివలెకనిపించే ప్రయత్నం. ఇదే దంభము. రావణుడనే వాడు అహంకారానికి ప్రతీక. ఈ రెండూ తొలగాలంటే ఆచార్యుడి ద్వారా వచ్చిన భగవన్నామకీర్తన ఒక్కటే మార్గం. శుక్రుడు జ్ఞానము, బృహస్పతి అజ్ఞానమునకు సంకేతము. పక్షులంటే ఆచార్యులు. నేత్రమంటే జ్ఞానం. నేత్ర సౌందర్యమంటే భాగవతోత్తముల స్వరూపం తెలుసుకోగలగడం, స్నానమంటే భగవద్గుణానుభవం. భగవంతుని అనుభవం అందరితో కలిసి చేయాలి. ఒంటరిగా చేయడమంటే దంభం.

రామకృష్ణులు పరమాత్మ స్వరూపాలే.

         ఈ జగమంతా ఆ భగవంతుని ఉద్యానవనమైతే, ఇందులో బకుడు, రావణుడు వంటి అధర్మపరులు పురుగు పట్టిన చిగురుల వంటి వారట. వారిని గిల్లి పారేస్తాడట. కిళ్లిక్కళైన్దానై.  శ్రీరాముడు రావణుడిని చంపడానికి చాలా కష్టపడ్డట్టు ఎందరి సాయమో తీసుకున్నట్టు రామాయణంలో ఉంది. సుగ్రీవుడు, హనుమంతుడు, అగస్త్యుడు చెప్పిన ఆదిత్యహృదయం మంత్రం సేతుబంధనం వంటి ఎన్నో సహాయాలతో జయించినట్టు ఉంటుంది. ఇదంతా ఒక లీల. విభీషణుడు శరణు కోరినప్పుడు, సుగ్రీవుడు ఆతనికి ఆశ్రయం ఇవ్వరాదంటాడు. శత్రురాజు తమ్ముడిని నమ్మడం మంచిది కాదని ఆయన హితవు. శ్రీరాముడికి యుద్ధంలో హాని కలిగిస్తాడని సుగ్రీవుని భయం. అప్పుడు రాముడేమంటాడంటే .. మొత్తం భూమ్మీద ఉన్న రాక్షసులంతా వచ్చినా నేను సంకల్పిస్తే కొనగోటితో చంపగలను నిశ్చింతగా ఉండు అంటాడు. కాని సంకల్పించడు. మానవుడి వలె మానవ ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయం సాధిస్తాడు. రావణుడి అహంకారాన్ని రాముడు ముందు సంహరిస్తాడు. ఒక సాయంత్రం యుద్ధభూమిలో రావణుడి రథాన్ని, ధనుస్సును విరిచి, సారథిని, గుర్రాల్ని చంపి, పతాకాన్ని పడగొట్టి, కిరీటం కూల్చి ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు రావణుడిని సులువుగా చంపవచ్చు. కాని వదిలేస్తాడు. వెళ్లు, అలసట తీర్చుకుని, కొత్త రథాన్ని ఆయుధాలని సమకూర్చుకుని రేపు రా, నీకు అనుమతిస్తున్నాను. అని గంభీరంగా అందరిలోప్రకటిస్తాడు. ఇంకెక్కడి రావణుడు. అతని సర్వస్వమూ అభిమానమే, దాన్ని అంతమొందిన ఘడియ అది. తన రాజ్యంలో  ప్రవేశించి తనను ముట్టడించి, పడగొట్టి తనకు బడలిక తీర్చుకునేందుకు అనుమతిస్తున్నాడు రాముడు. ఇంకేం మిగిలింది. అహంకార సంహారం జరిగిన ఆ సంఘటనలోనే రాముని అంతులేని ఔదార్యం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొంగ దంభాన్ని, రావణుడి అహంకారాన్ని అవలీలగా సంహరిస్తాడు రాముడు. గిల్లి పారేస్తాడు, కొనగోటితో. కృష్ణుడు కొనగోట గోవర్ధనాన్ని ఎత్తి ఏడురోజులు పట్టుకుంటే, రాముడిగా కొనగోట రావణుని అహంకారాన్ని కొట్టిపారేస్తాడు. దేవతలలో విష్ణువిరోధులూ ఉండవచ్చు. మహావిష్ణువు సేవలో కులభేదం లేదు. ఒంటరిగా కన్న భగవత్సేవలో అందరూ కలిసి ఉండాలని భోదించే మరో పాశురం ఇది.

Also read: గోదా తపన: ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల!

గోదమ్మ పాదాలకు శరణు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles