Tuesday, January 21, 2025

కృద్ధుడైన తండ్రిని చూసి వేదన చెందిన రాముడు

రామాయణమ్ 24

ఎంత ఎంత వేడుతుంటే అంత బెట్టు చేస్తున్నది కైక. ‘‘ఛీ దుర్మార్గురాలా నీ ముఖం చూస్తుంటేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి నాకు అని కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నాడు దశరథుడు.అయినా నీ కోరిక భరతుడు మన్నిస్తాడనుకుంటున్నావా? వాడు రామునికన్నా ధర్మాత్ముడు!’’

రామాదపి తమ్ మన్యే ధర్మతో బలవత్తరం.

ఓ రాత్రీ తెల్లవారకు! వద్దులే!శీఘ్రముగా వెళ్ళిపో నీవు.

ఈ దుష్టురాలి గృహమునుండి త్వరగా వెళ్లిపోవాలి నేను అని తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు దశరథుడు. ఇంతటి దైన్య స్థితి జీవితంలో ఇదే మొదటిసారి దశరథునికి.  అంతకు మునుపెన్నడూ ఇంతటి విపత్కర పరిస్థితిలో చిక్కుకొని ఎరుగడు.

Also read: కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

ఇంకా క్రూరంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘ఏమిటిది? నేనేదో కోరరానిది కోరినట్లు నీవంత బాధ పడుతూ క్రిందపడి విలపిస్తున్నావు? అసలు నీ ప్రాణం నేను పెట్టిన భిక్ష, పెద్ద సత్య సంధుడవైనట్లు ఆ రోజు మాట ఇవ్వనేల నేడు విలపించనేల. శిబిచక్రవర్తి మాట కోసం శరీరంలో తన మాంసం కోసి ఇచ్చిన సంగతి నీవెరుగవా?  అలర్కుడు ఇచ్చిన మాటకోసం తన కన్నులు ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యలేదా?  సముద్రుడు చెలియలికట్ట దాటుతున్నాడా?

నీకు మూడుమాట్లు చెపుతున్నాను. రాముడిని అడవికి పంపుము, పంపుము, పంపుము. నీవు మాట నిలబెట్టుకో.  నేను ప్రాణత్యాగం చేస్తాను’’ అని బెదిరించి దశరథుడిని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది కైక.

ఇంతలో భళ్ళున తెల్లవారింది వసిష్టాది మునులంతా రామ పట్టాభిషేక మహోత్సవ ముహూర్తం సమీపిస్తున్నదని దశరథుని పిలుచుకొని రమ్మని సుమంత్రుని పంపారు.

Also read: కోపగృహంలో కైక, ప్రాధేయపడుతున్న దశరథుడు

సుమంత్రుడు కైక ఇంటికి వెళ్లి రాజుకు  విషయం తెలిపాడు. దశరథుడు మాట్లాడే పరిస్థితిలో లేడు. కళ్ళు చింతనిప్పులవలె ఎర్రగా ఉండటం గమనించాడు సుమంత్రుడు.

సుమంత్రుడి ఆలోచన గ్రహించిన కైక రాత్రి సంతోషముతో నిదురలేక అలా అయినాయి ఆయన కళ్ళు. నీవు వెళ్లి త్వరగా రాముని ఇచ్చటికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించింది .

రాముడు వచ్చి దోసిలి యొగ్గి తండ్రి వద్ద వినయంగా  నిలుచున్నాడు.

Also read: కైక మనసు నిండా విషం నింపిన మంథర

…….

అయోధ్య అంతా సందడిగా ఉన్నది ఎటుచూసినా పండుగే. ఎవరిని కదిలించినా రాముడి గుణగణాల ప్రస్తావనే. నేటి నుండీ సుగుణాభిరాముడి పరిపాలనే! రామరాజ్యం కొన్ని ఘడియలలో ప్రారంభం కాబోతున్నది.

పగటిసమయంలో పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో రామచంద్రుడికి పట్టాభిషేకం.

బంగారుపాత్రలలో నదీనదముల జలాలు, నదీ సంగమస్థానజలాలు, నాలుగు సముద్రాలజలాలు, గంగోదకం నిండిన పాత్రలు ఇలా అన్ని రకాల జలములు సిద్ధం చేశారు.

వాటిలోపేలాలుపోసి,

పాలచెట్లఆకులు,కమలాలు,

కలువలు కప్పి బంగారు,వెండికలశాలు కూడా సిద్ధం చేశారు.

రామునికోసం సరికొత్తవింజామరలు,శ్వేతఛత్రము సిద్ధంచేయబడ్డాయి.

తెల్లటి వృషభము, తెల్లటి గుర్రము, మదగజము ఆయనకోసం వేచివున్నాయి.

Also read: మంథర రంగ ప్రవేశం

సకలాభరణభూషితలైన ఎనమండుగురు కన్యలు, అన్నివాద్యాలు, స్తోత్రపాఠాలు చదివేవారు ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నారు.

కైక ఇంటిలో, రాముడుతండ్రి ఎదుట నిల్చొని ఉన్నాడు. ఆయనకు సమీపంలో లక్ష్మణుడు కూడా నిలుచున్నాడు.

దశరథుడు రామునివంక చూశాడు. ఆయన కళ్ళనిండా నీళ్ళునిండి ఉన్నాయి. రాముడి రూపం అస్పష్టంగా కనపడుతున్నది. గొంతులోనుండి మాట రావడంలేదు అతి కష్డం మీద గొంతుపెకిలించుకుంటూ “రామా” అని మాత్రం అనగలిగాడు.

తండ్రి ఆకారం రాముడికి కొత్తగా ఉన్నది. ఇంతకు మునుపెన్నడూ తానుపుట్టి బుద్ధెరిగిన తరువాత అటువంటి తండ్రి రూపము చూసి ఎరుగడు. ఆయన మనస్సులో తండ్రిగురించిన ఏదో భయం పొడసూపింది. పామును తొక్కినవాడివలే భయపడ్డాడు.

Also read: రాముడితో దశరథుడి సంభాషణ

అంతకు ముందు ఎప్పుడైనా కోపంగా ఉండే తండ్రి తనను చూడగానే ప్రసన్నుడయ్యేవాడు. హాయిగా నవ్వేవాడు.  నేడేమిటి? ఆయన కోపంగా లేడు. కానీ నన్ను చూడగనే హాయిగా ఉండే ఆయన ఇలా ఇంత విచారంగా ఉన్నాడేమిటి?

మనసులో ఆ శంక పీడిస్తుండగా రాముడు దీనుడై ,ముఖకాంతి తగ్గినవాడయి ప్రక్కనేఉన్న పినతల్లి కైకకు నమస్కరించి, ‘‘తల్లీ నా వలన అపరాధమేదీ జరుగలేదుకదా! నాపై ఈయన ఎందుకు కోపించినాడు? నీవయినా ఆయనకు నా పట్ల అనుగ్రహం కలిగించమ్మా!’’ అని వేడుకున్నాడు.

‘‘నా తండ్రికి కోపం వచ్చినచో ఆయనను సంతోషపెట్టకుండా, ఆయన ఆజ్ఞను పాటించకుండా ఒక్క క్షణం కూడ జీవించి ఉండలేను. పూర్వమెన్నడూ నేను ఎరుగని ఈ వికారము నా తండ్రిలో ఏల కలిగినది చెప్పమ్మా!’’ అని ప్రాధేయపడినాడు.

అప్పుడు సిగ్గు,లజ్జ, మర్యాద అన్నీ వదిలిన కైక ఇలా పలికింది.

Also read: రామపట్టాభిషేకంపై వృద్ధనరపతి నిర్ణయం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles