రామాయణమ్ – 208
ఏది విశల్యకరణి?
ఏది సంధాన కరణి
ఏది ఎలా ఉంటుంది గుర్తుపట్టలేకపోయి చింతించిన ఆ మహాబలి పర్వతము పర్వతమునే పెళ్ళగించి తన అరచేతిలో ఉంచుకొని తిరుగు పయనమాయెను. శిఖరమును అరచేతిలో మోసుకొని వచ్చుచున్న హనుమను చూసి రాక్షసులు నోళ్ళు వెళ్ళబెట్టి చూచుచుండిరి.
రణరంగము చేరి, శిఖరమును దింపి, ‘‘సుషేణుడా ఏది ఏ ఔషధో నాకు తెలియరాక పోయెను అందుచేత శిఖరమునే తీసుకొచ్చితిని’’ అని పలికెను.
Also read: రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు
ఆయన చేసిన మహత్కార్యమునకు సంతసించి సుషేణుడు తనకు కావలసిన ఔషధములను శిఖరమునందుండి తీసుకొనెను.
దానిని నలుగ కొట్టి ఆ వాసనను లక్ష్మణునకు చూపినంతనే శల్యములన్నీ తొలగిపోయి బాధలేనివాడై సౌమిత్రి తిరిగి కూర్చుండెను.
లేచిన తమ్ముని చూడగనే రాముడు ‘‘రారా! నా ప్రాణమా’’ అనుచూ గాఢముగా కౌగలించుకొని ధారాపాతముగా కన్నీరు కార్చి, ‘‘నీవులేని ఈ లోకము నాకెందుకు? ఏమి ప్రయోజనము? నేడు నేను అదృష్టవంతుడను’’ అని పలికి తమ్ముని శిరస్సుపై చుంబించెను.
Also read: రావణుడు రణరంగ ప్రవేశం
‘‘అన్నా ఎందుకు బేలవైతివి? సామాన్యమానవుడి వలె చేసిన ప్రతిజ్ఞ మరచి నా కొరకు నీవు దుఃఖించుటయా? రావణ వధ నీ తక్షణకర్తవ్యము! సింగము వలె విజృంభించుము! ఆ రాక్షసమత్తగజమును సంహరింపుము. ఇనుడు అస్తాద్రి చేరులోపు వాని ప్రాణములు యమపురికేగవలెను…ఇది నా కోరిక’’ అని లక్ష్మణుడు పలికెను.
లక్ష్మణుడి పలుకులాలకించి రాముడు శత్రువులను సంహరింప నిశ్చయించుకొని ధనుస్సు చేతబూనెను. బాణములను సంధించి రావణునిపై ప్రయోగించెను. రావణుడు స్వర్ణ రధముపై రాముడు నేలపైనుండి యుద్ధము చేయుట పైనుండి ఇంద్రుడు గమనించి ఒక దివ్యరధమును తన సారధి మాతలి ద్వారా రామునికొరకై పంపించెను.
ఆ రధము కాంచన వర్ణశోభితమై అలరారుచుండెను..మాతలి వచ్చి రామునకు నమస్కరించి ‘‘రామా, సహస్రాక్షుడు నీ విజయము కాంక్షించి ఈ రధమును, ఇదుగో ఈ దివ్యచాపమును పంపినాడు. దీనిని స్వీకరింపుము’’ అని పలికెను. రాముడు ఆ రధమునకు ప్రదక్షిణము చేసి వెంటనే అధిరోహించెను.
Also read: రాముడి చేతిలో రాక్షస సంహారం
ఆ నాటి రామరావణుల యుద్ధము చూచువారికి ఒడలు గగుర్పొడొచుచూ లోకభీకరమై యుండెను. ఎవరు ఎవరిని కొట్టుచున్నారు? ఎవరిది పైచేయి? అని నిర్ణయించుట ఎవరికీ సాధ్యము కాకున్నది.
వేలకోలది బాణములు ఏకధాటిగా వర్షించి రాముని చీకాకు పెట్డి మాతలిని కూడా కొట్డినాడు రావణాసురుడు.
రాముని రధము యొక్క జండానుపడగొట్డి తొడగొట్టి మీసముమెలివేసినాడు రాక్షసరాజు. ఇది చూచున్న సకల దేవసంఘాలు ఒకింత నిరాశకు లోనైనారు. రావణుడు రాహువై రామచంద్రుని మ్రింగబోవుచున్నాడా? అను అనుమానము వారిలో పొడసూపినది.
Also read: ఇంద్రజిత్తును కూల్చివేసిన లక్ష్మణుడు
వూటుకూరు జానకిరామారావు