రామాయణమ్ – 209
రావణుని ధనుర్విద్యా కౌశలము రాముని దాదాపుగా కదలనీయక నిలిపివేసినది. రాముని కన్నులు క్రోధము తో ఎర్రబారినవి. కనుబొమ్మలు ముడివడినవి. ఆయన అప్పటి చూపులు ముల్లోకములను దగ్ధము చేయగలుగు శక్తికలిగివున్నవి.
పిడికిలి బిగించినాడు కోదండమును స్థిరముగా పట్టుకొనినాడు. రావణుని విజృంభణము రామునిలోని రణపండితుడిని మేల్కొలిపినది. రాముని ఆ రూపము చూసి రావణుడు కూడా ఒకింత జంకినాడు. కానీ రావణుని మదిలో ఒకటే సంకల్పము ఎటులైనా సరే రాముని కొట్ట వలె నని. రామునిదీ ఒకటే సంకల్పము వాని ప్రయత్నములు అరికట్టి వానిని నేలకు పడగొట్టవలెనని.
Also read: మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ
రావణుడు హుంకరించి వజ్రసారము అనే ఒక మహా శూలమును సంధించి విడిచినాడు. అది వాయుమండలములో ప్రకంపనలు పుట్టించుచూ వచ్చునప్పుడు ఒక మెరుపుల వరుసను సృష్టించుచూ అతివేగముగా దూసుకొని రాముని తాకవలెనని వచ్చుచున్నది.
అప్పటికే రాముని సకల ప్రయత్నములు వృధా అయిపోయినవి.
ఇంతలో మాతలిచేత ఇంద్రుడు అంతకు మునుపు పంపిన శక్తి ఆయుధము స్ఫురణకు వచ్చి దానిని ప్రయోగించినాడు. ఆ శక్తి కదలునప్పుడు ప్రచండముగా గాలులు వీచసాగెను. దాని గమన తీవ్రతకు ఆకసమునుండి ఉల్కలు నేల రాలిపడినవి. అది అటులనే వెళ్ళి రావణుని శూలమును నిర్వీర్యము చేసి ఆతని గుర్రములను పడగొట్టెను.
అంత రాముడు ఏక కాలములో నాలుగు బాణములు సంధించి విడిచెను. అవి రావణునికి ఊపిరి తీయు అవకాశము కూడా ఈయలేదు అతని గుండెలపై పిడుగులలాగా బలముగా తాకినవి.
Also read: రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు
వెనువెంటనే ఒక శ్రేణిలో రాముడు సంధించి విడిచిన బాణములు రావణుని నుదుటిపై నాటుకొని జివ్వున రక్తము పైకి ఎగసెను.
వరుసగా వచ్చు రణభీముడు రాముని బాణములు రావణుని శరీరమంతా జల్లెడలాగ మార్చివేసినవి. కాయము చిల్లులు పడి వేవేల గాయములై ఒడలంతా రక్తము ధారలుగా కారి చారికలు కట్టి పూవులు వికసించిన మోదుగచెట్టువలే చూపరులకు రావణుడు కనపడెను.
ఆ దెబ్బలకు తాళలేక అతలాకుతలమైపోతున్న తన రాజును వెంటనే రణరంగమునుండి ప్రక్క కు తప్పించినాడు ఆతని సారధి.
‘‘ఎంత పని చేసినావురా దుర్మతీ ఎన్నాళ్ళుగానో సమ ఉజ్జీ కోసం ఎదురుచూసిన నాకు నేటికి లభించినాడురా మేటి పోటరి! ఆతని ముందు నా పరువు గంగపాలు చేసినావు కదరా! రణమున బెదిరి వీపు చూపినాడు రావణుడని నన్ను గేలి సేయదా లోకము! వీర్యము, ధైర్యము, శౌర్యము లేనివాడనా నేను? నా వద్ద అస్త్రములు లేవా? శస్త్రములు లేవా? వైరిని ఎదుర్కొను బలము లేదా? నా అభిప్రాయము తెలుసుకొనకుండా నీ వెందుకు రధము మళ్ళించితివి? నా చిరకాల యశస్సు నీ ఈ అనాలోచిత చర్యవలన మాసిపోయెను గదరా!’’ అని సారధిని పరుషముగా రావణుడు గద్దించెను.
Also read: రావణుడు రణరంగ ప్రవేశం
‘‘ఏమిరా! శత్రువు నీకేమైనా ఆశ చూపినాడా? దానికి నీవు లొంగిపోలేదు కదా? అయినదేమో అయినది ఇక శీఘ్రముగా తేరును తిప్పుము. మరల రణరంగమునకు తీసుకు వెళ్ళుము’’ అని పలికిన రావణుని చూసి అతని సారధి….
‘‘ఏలికా! నీ ఉప్పు తిని పెరిగిన శరీరమిది. నీకు ద్రోహము చేయదు. అలసిన శరీరముతో బడలికగా ఉన్న నీవు కాస్త సేద తీరవలెనని రధమును మరల్చితిని కానీ వేరొకటి కాదు. మీ ముఖములో కాంతి తగ్గినది. గుర్రములు దాహముతో రొప్పుచున్నవి. ఎన్నో అశుభసూచనలు కానవచ్చుచున్నవి. నిన్ను కాపాడుకుంటూ నీ యుద్ధరీతికి అనుగుణముగా రధమును నడుపుట సారధిగా నా కర్తవ్యము. ఏ విధముగా రధమును నడిపిన యోధుడు తన సహజరీతిలో విజృంభించునో అది కనిపెట్టి నడుపగలిగినవాడే కదా సమర్ధుడైన సారధి. నీవు ఆజ్ఞాపించినట్లే రణమున రామునికి ఎదురుగా రధమును నిలిపెదను’’ అనుచూ మరల రామునితో యుద్ధమునకు రధమును కదిలించెను.
అటు పిమ్మట దేవతలతో కలిసి యుద్ధమును చూచుటకై వచ్చిన అగస్త్యమహర్షి, అప్పటిదాకా యుద్ధము చేసి అలసిపోయిన రాఘవుడు మరల తనకు ఎదురు నిలచిన రావణుని చూసి చింతక్రాంతుడై ఉండుట గమనించి రామునిఎదుట ప్రత్యక్షమై ఇటుల పలికెను.
Also read: రాముడి చేతిలో రాక్షస సంహారం
వూటుకూరు జానకిరామారావు