రామాయణమ్ – 86
‘‘అన్నా నీ శక్తిసామర్ధ్యములెటువంటివో తెలిసిన నేను వదినగారిని ధైర్యముకోల్పోవద్దు అని చెప్పితిని. జగదేకవీరుడైన రామునికి ఏ ఆపద వాటిల్లదు నీవు నిర్భయముగా ఉండుతల్లీ అని చెప్పినప్పటికీ వినక నన్ను నానా దుర్భాషలాడినది. నేను భరతుడు కలసి కుట్రపన్నామనీ, వదినగారి మీద నాకు ఉండకూడని భావనలున్నాయనీ నన్ను ఆడిపోసుకొని అక్కడనుండి కదలేవరకు ఒకటే పోరుపెట్టగా, ఆవిడ మాటలు వినలేక నీ ఆజ్ఞ ధిక్కరించలేక సతమతయి పోయిన నన్ను మరలమరల అవే పలుకులు ములుకులలాగా బాధించి అక్కడ నుండి కదలునట్లు చేసినవి. తప్పనిసరి పరిస్థితిలో నీకొరకు వచ్చితిని.’’
Also read: సీత క్షేమమేనా? రాముడిని మనసు అడుగుతున్న ప్రశ్న
‘‘లక్ష్మణా, నీకు తెలియదా రాక్షసులను మర్దించగల నా సామర్ధ్యము?
తప్పు చేసినావయ్యానీవు , తప్పుచేసినావు.’’
తడబడుతున్న పాదములు, వణుకుపుడుతున్న హృదయముతో సీతాదేవి క్షేమము గురించి తలుస్తూ పర్ణశాల ప్రాంతమంతా కలియతిరిగినాడు. ఎక్కడా కనపడలేదు తన ప్రియ సతి సీత. ఆశ్రమములో పక్షులు, ప్రాణులు దీనముగా రామునివైపే చూస్తున్నాయి. పూవులు వాడిపోయాయి. వనదేవతలందరూ ఆ వనాన్ని విడిచిపోయారు శోభా విహీనముగా ఉన్నది ఆ ప్రాంతమంతా. పర్ణశాలలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి వున్నాయి. సీత ఏమై ఉంటుంది? ఎవరో హరించి యుండవచ్చును. లేక మరణించి యుండవచ్చును. లేక తప్పిపోయి ఉండును. ఎవరో భక్షించి యుండ వచ్చును. లేదా వనములోనికి వెళ్ళియుండెనా? లేక ఎచటనైనా దాగి యున్నదా? లేక నీటి కొరకై నదికి వెళ్ళియుండెనా? పూవులకొరకు పద్మసరస్సుకు వెళ్ళి యుండెనా? మొత్తము వనమంతా గాలించినా ప్రియసతి జాడ తెలియరాలేదు. దుఃఖముతో కన్నులు ఎర్రబారి పిచ్చివానివలే శోకించసాగాడు రాముడు.
Also read: సీతమ్మకు గడువిచ్చి అశోకవనమునకు తరలించిన రావణుడు
ఒక చెట్టునుండి మరియొక చెట్టుకు, ఒక గుట్టనుండి మరియొక గుట్డకు, ఒక గట్టునుండి మరియొక గట్టుకు పిచ్చివాని వలే పరుగులు పెడుతూ శోక సంద్రములోమునిగి తేలుతూ కనపడిన చెట్టునూ, పుట్టనూ అడుగుతున్నాడు సీతావియోగబాధాపీడితుడై పిచ్చివాడైన రామచంద్రమూర్తి.
‘‘ఓ కదంబమా, నీ పువ్వులు అనిన నా సీతకు ప్రాణము. నీకు ఆవిడ కనపడ్డదా? ఓ బిల్వమా, నా మైథిలి నీకు అగుపడినదా? ఓ అర్జున వృక్షమా నా జానకి నీకు ఎక్కడైనా కనపడ్డదా? ఓ తిలక వృక్షమా నారీతిలకమైన విదేహరాజపుత్రిని చూచినావా ఎక్కడైనా? ఓ అశోకమా నీవైనా నా ప్రియ సతి జాడ తెలిపి నా శోకము బాపుమా. ఓ జంబూ వృక్షమా, ఓ కర్ణికారమా, ఓ చూతమా, ఓ పున్నాగమా, ఓ దాడిమ వృక్షమా ఏది నా సీత? ఎక్కడ నా హృదయేశ్వరి?’’
Also read: ‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత
చెట్లు పుట్టలు పొదరిళ్ళ వద్దకు వెళ్ళి పిచ్చివాని వలే ప్రశ్నిస్తూ .సీత అల్లంత దూరములో ఉన్నట్లుగా భ్రమిస్తూ ఉన్మాదియై వనమంతా గాలిస్తున్నాడు రామభద్రుడు.
‘‘‘సీతా సీతా సీతా ఎక్కడున్నావు? నీవు నన్ను పరిహసించటానికై ఎక్కడన్నా దాక్కున్నావా? ఇంక పరిహాసాలు వద్దు. రా, నీవులేక నా బ్రతుకు శూన్యము. లక్ష్మణా, ఇక నేను జీవించలేను. మన తండ్రి దశరథ మహారాజును స్వర్గలోకములో కలుసుకొందును. అయ్యో! అందుకు కూడా నాకు అనుజ్ఞలేదయ్యా! వనవాసకాలము పూర్తిచేయక ముందే ఎందుకు నా వద్దకు వచ్చినావు? నా ఆజ్ఞను ధిక్కరించుటయే కదా ఇది! అని మన తండ్రి నన్ను కోపగించుకొనవచ్చును.’’
సీతకానరాక పసిపిల్లవానిలాగ విలపించుచున్న పురుషోత్తముని చూసి లక్ష్మణుడు, అన్నా, శోకింపకుము. ప్రయత్నము చేయుదము. ఈ వనములో ఎన్నో గుహలున్నవి కదా. వాటినన్నిటినీ వెదుకుదము’’ అని పలికాడు.
వదినగారు స్నానము కొరకో, పూలకొరకో, నీటికొరకో, లేక మనలను ఆటపట్టించుటకొరకో ఎచటికైనా వెళ్ళి యుండవచ్చును కదా! ముందు ఆమెను వెదికే ప్రయత్నము చేద్దాము.
Also read: రావణ ఖడ్గప్రహారంతో కుప్పకూలిన జటాయువు
ఆ విధంగా ఆ వనమంతా అణువణువు గాలించారు అన్నదమ్ములిరువురూ. కానీ కానరాలేదు సీతమ్మ. మరల రాముని దుఃఖము అధిక మయినది. వేడివేడి నిట్టూరుపులు విడుస్తూ స్పృహ తప్పుతూ బుద్ధికోల్పోయి పిచ్చివాడిలాగ అటుఇటు తిరుగుతున్న ఆయనను పట్టుకొని ధైర్యము చెపుతూ లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు.
మాటిమాటికి స్పృహ కోల్పోతూ, లేస్తూ అయ్యో ప్రియురాలా అంటూ నేలపై చతికిల పడుతూ పొర్లుతూ దీనుడై ఉన్న రాముని చూసి లక్ష్మణుడు తాను కూడ ధైర్యం కోల్పోయినవాడై మరల తేరుకొని అన్నను జాగ్రత్తగా పట్టుకొని సాంత్వన వచనాలు పలుకసాగాడు.
‘‘లక్ష్మణా, ఒక్కసారి గోదావరి వద్దకు వెళ్ళి చూసిరా. తామరపూవులు కోసుకొని వచ్చుటకు వెళ్ళినదేమో’’ అని పంపాడు రాముడు
లక్ష్మణుడు తిరిగి వచ్చి కనపడలేదు అని చెప్పగా ‘‘ఆ పర్వత గుహ వద్ద ఉన్నదేమో చూసిరా’’ అని మరల పంపాడు. ఈ విధముగా లక్ష్మణుడు వెదుకని చోటులేదు. తిరుగని ప్రదేశములేదు. ఎక్కడా సీతాదేవి జాడ కానరాలేదు.
లక్ష్మణుని మాటలు నమ్మక మరల స్వయముగా తానే ‘‘సీతా సీతా’’ అని కేకలు వేస్తూ అన్ని ప్రదేశాలు తిరిగి తిరిగి హృదయవేదన భరింపరానిదై శోకము బరువై కూలబడ్డాడు రామచంద్రుడు.
Also read: రావణుడిని తీవ్రంగా హెచ్చరించిన జటాయువు
వూటుకూరు జానకిరామారావు