Wednesday, December 25, 2024

విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

రామాయణమ్ – 6

ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి.

అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు.

భృశాస్వుడు ఒక ప్రజాపతి, ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ, సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు!

వీటిని విశ్వామిత్రుడు పొందినాడు!

అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము (guided missiles).

ఈయన క్రొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడుకూడా!

(శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది! అస్త్రము అంటే మంత్రపూర్వకముగా ప్రయోగించేది! Bullet కు intercontinental ballistic missile కు ఉన్నంత తేడా అన్నమాట).

Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు

ఓ దశరధ మహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధోసంపన్నుడు! అతులిత పరాక్రమవంతుడు! ఆయన తన యాగసంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్ధుడు!  అలాంటి  ఆయన అడుగుతున్నాడు నీ రాముడిని పంపమని!

ఆయనవెంట వెళితే రామునకు మేలుకలుగుతుంది! మహర్షి ఉద్దేశ్యము అదే! రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన! నీవు మనసులోని భయసందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయనవెంట పంపు సకల శుభములు ఒనగూరుతవి!

కులగురువు మాటలు విని దశరధుడి శరీరం ఉప్పొంగింది! రాముని మహర్షివెంట పంపటానికి సంతోషంగాఒప్పుకొన్నాడు! స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుని శిరస్సుముద్దిడుకొని,మహర్షి చేతిలో పెట్టాడు! 

మూపున విల్లమ్ములు ధరించి రాముడు,లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు.

Also read: శ్రీరామ జననం

బ్రహ్మదేవుడు ముందువెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీదేవతలనుసరించినట్లుగా కనపడుతున్నారు వారివురూ చూపరులకు! బాటలు నడిచారు,పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు.  ఆ విధంగా మొదటిసారి నగరువిడచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదరసమేతుడై!

అలా చాలా దూరం నడచిన తరువాత తనలోని ప్రేమంతా మాటరూపంలో బయలుపడేటట్లుగా “రామా” అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి!

.

అప్పటిదాకా ఆయన వెనుదిరిగిచూడలేదు, చూస్తే రాముని మధురమోహనరూపం కట్టిపడేస్తుంది, ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా!

సరయూనదీ దక్షిణతీరం చేరారు! ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చేయండి! మీకు కొన్ని మంత్రములను, “బల,” “అతిబల” అను విద్యలను ఉపదేశిస్తాను! స్వీకరించండి!

ఈ విద్యలెటువంటివి అంటే ఇవి తెలుసుకొన్న తరువాత నీకు శ్రమగానీ, జ్వరముగానీ, రూపములో మార్పుగానీ సంభవించదు! నీవు నిద్రపోయినప్పుడుగానీ, ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు!

రామా! బాహుబలములో నీతో సమానుడు మూడులోకములలో ఎవడునూ లేడు ఇకముందు ఉండడు! రామా! సౌందర్యము,సామర్ధ్యము, జ్ఞానము బుద్ధినైశిత్యములలో నీతో సరిసమానుడు ఈ లోకములో ఉండడు! ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు!

అంత శ్రీరాముడు శుచియై, శుద్ధాంతరంగుడై, ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు

తెలతెలవారుతున్నది తూర్పుదిక్కు అప్పుడే విచ్చుకుంటూ ఉన్నది.

గడ్డిపక్కపైన పట్టుపరుపులమీద పడుకున్నంత హాయిగా రామలక్ష్ష్మణులు నిదురిస్తూఉన్నారు. వారి ముఖాలను కనురెప్పవాల్చకుండా తనివితీరా చూస్తూ ఉన్నారు మహర్షి! రాముని ముఖపద్మంలోని సౌందర్యము అనే మధువును గ్రోలే తుమ్మెదలా ఉన్నారాయన! ఆయన రాముడికి మేలుకొలుపు పాడుతున్నారు రామా నిద్దురలే అని!

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్యా  ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికమ్!

.

కౌసల్యా సుప్రజా …కౌసల్యయొక్క ఉత్తమ సంతానమైన

రామా…. ఓ రామా

పూర్వా సంధ్యా ప్రవర్తతే…తూరుపు దిక్కున తెలవారబోతున్నది

ఉత్తిష్ఠ…..లెమ్ము

నరశార్దూలా.. మానవులలో శ్రేష్టమైన వాడా!

కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్…ప్రతిదినము చేయవలసిన పనులు చేయాల్సిఉన్నది.

రామలక్ష్మణులు సంధ్యావందనాది పనులన్నియు చక్కగా ఆచరించి మరల మునివెంట బయలుదేరినారు.

Also read: దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు

అలా నడచినడచి సరయూ, గంగానదుల సంగమప్రదేశం చేరినారు. అక్కడ వేల సంవత్సరాల నుండి తపస్సుచేస్తున్న ఎంతోమంది ఋషీశ్వరులగుపించారు. ఆ ప్రదేశాన్ని అంతటిని ఆసక్తిగా చూశారు రామలక్ష్మణులు.అక్కడ ఒక ఆశ్రమము చూశారు, అది చూడగనే వారి మనస్సులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించింది. కుతూహలంతో మహర్షిని ప్రశ్నించారు!

“మహర్షీ ఈ ఆశ్రమము ఎవ్వరిది?

ఇక్కడ పూర్వము పరమశివుడు తపమాచరించేవాడు! ఆయనకు అప్పుడే వివాహం జరిగింది. శివుడంతటివాడు వివాహం చేసుకోవటంతో, అది నావల్లనే జరిగింది అని అహంకరించాడు మన్మధుడు ( అప్పుడు మన్మధుడికి శరీరముండేది). శివుడు ఆతడి అహంకారాన్ని చూసి హుంకరించాడు! మూడోకన్నుతెరచి మన్మధుని చూశాడు. అప్పుడు మన్మధుడి శరీరంలోని ఒక్కక్క అంగము కాల్చివేయబడింది!

మన్మధుడు దేహము విడిచిన ప్రదేశము కాబట్డి అంగదేశము అని పేరు వచ్చింది!

పరమపావనమైన ఈ ప్రదేశంలో ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం.

రేపు తెల్లవారగనే గంగను దాటుదాం అని గంగాస్నానం చేసి శుచిగా ఆశ్రమంలో ప్రవేశించారు!

శ్రీ రాముని వెంటపెట్టుకొని విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి ఆశ్రమంలోని మునులందరూ సంతోషంతో పులకరించిపోయారు! వారికి తగువిధముగా సత్కారాలు చేసి అక్కడ వారు విశ్రమించటానికి కావలసిన ఏర్పాట్లు చేసినారు. ఆ రాత్రి అంతా రాజకుమారులకు మనోహరమైన కధలుచెపుతూ ఆనందింపచేశారు మహర్షి!

Also read: రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ

తెలవారగనే స్నానసంధ్యాదులు పూర్తిచేసుకొని ఆశ్రమవాసులు ఏర్పాటు చేసిన నావమీద గంగానది దాటుతున్నారు. గంగ మధ్యలోనికి రావడంతోనే నీరు బద్దలవుతున్నట్లుగా గొప్పశబ్దం వినిపించింది! అదేమిటి? అని ప్రశ్నించాడు రామచంద్రుడు కుతూహలంతో!

అప్పుడు మహర్షి ఇలా చెప్పారు! పూర్వం తన మనస్సులో జనించిన సంకల్పంతో బ్రహ్మదేవుడు కైలాస పర్వతప్రాంతములోఒక సరస్సు నిర్మించాడు. ఆయన మనస్సంకల్పంనుండి పుట్టినది కాబట్టి దానికి మానస సరోవరమనిపేరు. అక్కడ నుండి సరయూనది జన్మించింది! సరస్సునుండి ప్రవహిస్తున్నది కావున” సరయూ” అని పేరు వచ్చింది!

ఆ సరయూనది గొప్ప తరంగాలతొ గంగాప్రవేశం చేస్తున్నది అప్పుడు పుట్టే జలఘోషనే నీవు వింటున్నది అని చెప్పారు మహర్షి.

గంగదాటగనే ఏ మాత్రము మానవ సంచారంలేని భయంకరమైన ఒక అడవిలో ప్రవేశించారు వారు! ఆ భయంకరమైన, దుర్గమమైన అడవిని చూసి రాముడు విస్మయంతో మహర్షిని ప్రశ్నించాడు!

Also read: వాల్మీకి మహర్షి మనోఫలకంపైన నారద మునీంద్రుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

1 COMMENT

  1. అర్యా…
    నమస్కారములు. మీ రామాయణము గురించిన వ్యాఖ్యానము చదివి ఆనందించాను.. ఇంతకు ముంది నేను కొన్ని అంతర్జాల పలకలపై , మరి కొన్ని వివరములు చదివితిని. మీ శైలి బాగుంది. ప్రవచనము లాగా సాగుతున్న ఈ మాటల ధోరణికి నమస్సులు.
    నాకు ఈ క్రింది సందేహములకు రేపు జవాబు ఇవ్వండి..

    1. మనువునకు సంబంధించిన ఏ అస్త్రమును విశ్వామిత్రుడు శ్రీరామునికి ప్రసాదించెను ?
    2. మీరు నా స్మృతి పథమున మసలుచు కార్యావసరములందు సహాయపడుము. ఇక మీరు స్వేచ్ఛగా వెళ్ళండి. అని అది దేవతలతో ఎవరన్నారు?.
    3.విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
    4. పూర్వము ఈ సిద్ధాశ్రమం నందు ఎవరు వందకొలది సంవత్సరాలు తపమాచరించెను?.
    5.బలి చక్రవర్తి వద్ధకు యాచకుని రూపంలో వచ్చిన వామనుడు ఎవరికి కుమారునిగా జన్మించెను?
    6.యజ్ఞము జరుగు ఆరు దినముల పాటు ఎవరు మౌనదీక్షలో ఉన్నారు?.
    ** శ్రీరాముని తీసుకొని విశ్వామిత్రుడు సరయూ నది దాటి పయనించు ఘట్టము నుండి
    పై విషయములు ఒక అంతర్జాలము వారు చిన్న పరీక్ష నిర్వహిస్తున్నారు..కనుక నేను మిమ్ములను కోరుతున్నాను.. అన్యథా భావించ వలదు ..
    ధన్యవాదములు
    ఇప్పగుంట సూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles