- అయిదు శతాబ్దాల నిరీక్షణకు తెర
- పెరిగిన నరేంద్రమోదీ ప్రతిష్ఠ
అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠ దేశ వ్యాప్తంగా ద్విగుణీకృతమైంది.వందల ఏళ్ళ నిరీక్షణకు నేటితో తెరపడింది. సనాతన సంప్రదాయవాదులంతా జై మోదీ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది రామభక్తులు చేసిన జైశ్రీరామ్ నినాదం దుందుభి వలె దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో, బిజెపి మళ్ళీ విజయ దుందుభి మోగిస్తుందనే విశ్వాసం రెట్టింపు శబ్దం చేస్తోంది. అయోధ్యలో బాలరాముని పునఃప్రతిష్ఠతో చరిత్ర పుటల్లో నరేంద్రమోదీ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నారు. బిజెపి కురువృద్ధులైన వాజ్ పెయి, అడ్వానికి కూడా దక్కని ఖ్యాతి మోదీకి దక్కింది. ఐదు వందల ఏళ్ళ ఆధునిక భారతంలో ఏ పాలకుడికి దక్కని కీర్తి మోదీకే దక్కింది. ఈ ఆలయ స్థాపన కోసమే నరేంద్రమోదీని విధి ఎంచుకుందని అడ్వానీ అన్న మాటలు అక్షర సత్యాలు. న్యాయ స్థానాల తీర్పుతో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ మహాక్రతువు సంపూర్ణమైంది. నరేంద్రమోదీ ఈ విధంగా చరిత్రలో గొప్పగా మిగిలిపోనున్నారు. అశేష ప్రశంసలతో పాటు విమర్శలు, వాదనలు వెల్లువెత్తాయి, ఎత్తుతూనే వున్నాయి. ప్రతిపక్షనేతలు, కొందరు పీఠాధిపతులు ఏ రీతిన, ఏ తీరున, ఏ స్థాయిలో వాగ్బాణాలు సాధించినా, బిజెపి ప్రభుత్వం చెక్కు చెదరలేదు. తను సంకల్పించుకున్న యజ్ఞాన్ని సుసంపన్నం చేసుకుంది.
అబ్బురపరచిన నరేంద్రమాదీ
పరమ భక్తి ప్రపత్తులతో నరేంద్రమోదీ నడుచుకున్న వైనం అందరినీ అబ్బురపరిచింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం కూడా ఎంతో ఆకట్టుకుంది. 11రోజులు పాటు ఉపవాస దీక్ష చేసి, విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి కోట్లాదిమందిని ఆయన ఆకట్టుకున్నారు. దేశభాషలలోని అన్ని ప్రసిద్ధ రామాయణాలను కూడా అంతే శ్రద్ధతో విని రామాయణ జ్ఞానాన్ని కూడా పరిపుష్టం చేసుకున్నారు. ఆ జ్ఞాన సంస్కార ఫలంతో శబరి, గుహుడు, ఉడుత నుంచి జటాయువు వరకూ ఆ యా పాత్రల నుంచి ఎటువంటి స్ఫూర్తిని పొందాలో జాతికి మోదీ సవివరింగా చాటిచెప్పారు. దేశంలోని ప్రముఖులంతా అయోధ్యలో బారులుతీరారు. కోట్లాదిమంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు. అంతకంటే కావాల్సింది ఇంకేముంది? మతకల్లోలాలు లేకుండా శాంతి స్థాపన జరిగితే ఎల్లరకూ సంతోషమే. భిన్న మతాలకు, సంస్కృతులకు ఆలవాలమైన భారతదేశంలో సర్వమత సోదరత్వం సౌందర్య శోభితం. సహనం సదా శక్తిమంతం. మెజారిటీ ప్రజలు హిందువులే అయినప్పటికీ, అందరి ఆలనాపాలనా పాలకుల ప్రథమ కర్తవ్యం. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండవచ్చు గాక.దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి.
సర్వజన హితంగా పరిపాలన
అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ చిరకాల స్వప్నమే. న్యాయ, రాజకీయ పోరాటలన్నింటినీ అధిగమించి, రామునికి శాశ్వత మందిరం నిర్మించిన ఘనత నరేంద్రమోదీ సారథ్యంలోనే బిజెపికే నూటికి నూరు శాతం దక్కుతుంది. దక్కింది కూడా. ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ క్రితం 1528 ప్రాంతంలో మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద జనరల్ హోదాలో వున్న మీర్ బాఖి అయోధ్యలో మసీదు నిర్మించారు. శ్రీరాముడి జన్మస్థలానికి గుర్తుగా అప్పటికే అక్కడ వెలసి వున్న ఆలయంపై మసీదు నిర్మించారన్నది వాదన. ఇలా మొదలైన ఈ వివాదం రకరకాల రూపు తీసుకుంది. ఇప్పటికి ఆలయం మళ్ళీ వెలసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బిజెపి అగ్రనేత అడ్వాణీ చేపట్టిన రధయాత్రను తలచుకొని తీరాలి. 1990లో చేపట్టిన ఈ యాత్ర ప్రభావం ఈరోజు ఈ ఫలితానికి పునాదియై నిలవడమే కాక, నేటి బిజెపి ప్రాభవానికి, మోదీ వైభవానికి మూలమై నిలిచింది.చలి ఎక్కువగా ఉందనే కారణంతో అయోధ్య ఉత్సవానికి అడ్వాణీ రాలేదు. నిజానికి, గర్భగుడిలో ఈరోజు ప్రవేశం పొందిన ఐదుగురుతో పాటు అడ్వాణీ కూడా ఉండవలసింది. కారణాలు ఏవైనా ఆయనకు ఆ ప్రతిష్ఠ దక్కలేదు. బహుశా అందుకే ఆయన రాలేదేమో! చట్టపరమైన గండాలన్నింటినీ దాటుకొని,2020 ఆగస్టు 5 వ తేదీన ఆలయ నిర్మాణానికి శ్రీకారం జరిగి, నేటికి ప్రాణప్రతిష్ఠ పూర్తిచేసుకొని, కోట్లాదిమంది భక్తుల సందర్శనానికి సిద్ధమైంది. వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా వుండేలా నిర్మాణం పూర్తి చేసుకుంది. నేటి నుంచి అయోధ్య గొప్ప పర్యాటక ప్రాంతంగా వెలుగనుంది. రామవిగ్రహ స్థాపన జరిగింది. ఆ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని, సర్వజన హితంగా ధర్మపాలన సాగిస్తే, అదే నిజమైన రామరాజ్యం.