సంజయ్ గుండ్ల – చెన్నై
- రాజకీయాలలోకి వస్తాడా, రాడా?
- అనారోగ్య సమస్యలూ, మీదపడుతున్న వయస్సూ
- అభిమానుల ఆత్రం అవధులు దాటుతోంది
- ముఖ్యమంత్రి పదవిపై ఏ మాత్రం ఆశలేదు
- పార్టీ, ప్రభుత్వం ఎవరు నడుపుతారు?
- గందరగోళంలో రజనీ అభిమానకోటి
‘అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు’ చందంగా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ పరిస్థితి. పెళ్లికొడుకు నాప్రెండే కానీ వాడు వేసుకున్న చొక్కా మాత్రం నాదే అనే తన సినిమాలోని డైలాగ్ లా అచ్చు గుద్దినట్టు కామెడీ చేస్తుండటం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ పై సెటైర్ల ట్రెండింగ్ కు దారితీసింది. అదే సమయంలో రజనీకాంత్ నాన్చుడు దోరణి ఇక ఆయనను నమ్మిన అభిమానులను నడిరోడ్టుపై నిలబెట్టేలా చేస్తోంది.
‘ఒకసారి చెబితే వందసార్లు అన్నట్టే’
రజనీకాంత్ ఒకసారి చెపితే వందసార్లు అన్నట్టే. ఇది నాలుగున్న దశాబ్దాల సూపర్ స్టార్ సినిమా కెరీర్ కు హుందానీ గౌరవాన్నీ కట్టబెట్టింది. ఆ తర్వాత పాతికేళ్ల కిందట, అంటే 1996లో, ఓ పార్టీకి మద్దతుగా గొంతు విప్పటం, ఆ పార్టీ మద్దత్తుతో ప్రభుత్వం ఏర్పడటం రజనీకాంత్ మాటకు రాష్ట్ర అభిమానగణం విలువిచ్చేలా, జనం ఆయనపై ఎనలేని నమ్మకం పెట్టుకునేలా చేసింది. ఆ తర్వాత తనవంటికి రాజకీయాలు పడవులే అంటూ సినీ కెరీర్ లో దూసుకెళ్లినా.. అడపాదడపా తన సినిమాల ద్వారా రాజకీయాలపై సెటర్లు, వ్యంగ్యాస్త్రాలు, వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలు తాను గమనిస్తూనే ఉన్నాననే సంకేతం పంపుతూ వచ్చారు.
శూన్యత పూడ్చగల నాయకుడెవ్వరు?
అయితే, తమిళ రాజకీయాలలో ఉద్దండులుగా దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించిన డిఎంకె అధినేత కరుణానిధి, అన్నాడిఎంకే సుప్రిమో జయలలితల మరణానంతరం ఏర్పడిన శూన్యత, లోటు, అనిశ్చితిని పూడ్చగలిగే తదుపరి నేత ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో అన్నాడిఎంకే బాద్యతల బారం మోసే పనిలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ మూడుముక్కలాటగా మారి తదనంతరం సర్దుకున్నా పార్టీ ఒక తాటిపై ఇంకా కొనసాగుతుందా అనే మీమాంశలోనే ఉంది. అందుకు కారణం గత ఎన్నికల్లో (2019లో) 40 లోక్ సభ స్థానాలలో కేవలం ఒక్కదానితోనే సరిపెట్టుకోవటం ద్వారా అన్నాడిఎంకే పార్టీ లుకలుకలు తేటతెల్లం అయ్యాయి. మరోవైపు డిఎంకే పగ్గాల విషయంలో ముందస్తుగానే సిద్దం చేసినట్టుగా స్టాలిన్ బాద్యతలు చేపట్టిన అనంతరం 39 లోక్ సభ స్థానాలు గెలిచి కరుణానిధి వారసుడిగా కొంత మేరకు హుషారుగా ముందుకు సాగుతున్నాడనే రాజకీయ వాదనకు బలం చేకూర్చేలా చేసింది. ఇక్కడే తమిళ రాజకీయాలలో శూన్యతను తన ద్వారా భర్తి చేయవచ్చనే రజనీకాంత్ ఆలోచనకు బీజం పడిందని ఆయన రాజకీయారంగేట్రంపై చేసిన ప్రకటన తేటతెల్లం చేసింది.
రజనీకోసం తమిళుల ఎదురుచూపు
సరిగ్గా 2017లో తన కళ్యాణ మండపంలో అభిమానులతో ఫోటో సెషన్ ముగియగానే పెట్టిన మీడియా సమావేశం ఏకంగా ఇక రజనీకాంత్ కోసమే తమిళనాడు ఎదురు చేస్తుందనే లెవల్లో ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నా’ అంటూ ఆర్బాటంగా ప్రకటించే సరికి తమిళ ప్రజలు కూడా కాస్త డోలాయమానంలో పడ్డారు. దీనికితోడు అభిమానుల హడావుడి ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి రేంజ్ లో రజనీకాంత్ ను ఆకాశానికి ఎత్తేసరికి కొంతకాలం ద్రవిడ పార్టీలు కూడా ఆయన చర్యలను గమనిస్తూ వచ్చాయి. ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అంటూ కొందరు రజనీ సన్నిహితులు మీడియాకు లీకుల పేరుతో పబ్లిసిటీ చేసుకున్నా కూడా ఆయన ప్రకటన చేసిన సంవత్సరం తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మౌనం వహించటంతో మళ్లీ రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందా ఉండదా అనే సందేహాలకు తావిచ్చింది. మళ్లీ ఇదిగో తలైవా వస్తున్నాడంటూ ఒక్కసారి హడావుడి మొదలవటంతో ఏకంగా రజనీకాంత్ 2019లో మీడియా ముందుకు వచ్చి ఏకంగా మహాబారతం, భగవద్గీత అంతా వినిపించారు.
ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు
“నేను 25 సంవత్సరాల నుండి రాజకీయాలకు వస్తానని ఎక్కడా చెప్పలేదు. 2017లో నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించా. మీడియా నాపై కథనాలు ‘ఇకపై వస్తాడు వస్తాడు’ అంటూ రాయదని నమ్ముతున్నా. వ్యవస్థలో మార్పుకోసమే రాజకీయాల్లోకి వస్తున్నా. నాకు పదవులపై ఆశలేదు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు తక్కువ, ఇప్పటి వరకు 45 సంవత్సరాల పైబడివారు, రాజకీయ వారసులు మాత్రమే పదవులను ఏలుతున్నారు. 45 సంవత్సరాల సినిమా అనుభవం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని నమ్ముతున్నాం. పార్టీకీ ఒక అధిష్టానం ప్రభుత్వానికి మరో అదిష్టానం రాజకీయాలకు అవసరం. పార్టీకి, ప్రభుత్వానికి పాలనాధికారిగా సీఈవోలా వ్యక్తులు ఉండాలి. పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని పర్యవేక్షించే అనుభవజ్ఞులు కావాలి.
రాజనీకాంత్ పార్టీకా,ప్రభుత్వానికా?
‘‘రజనీకాంత్ పార్టీకా, ప్రభుత్వానికా అనేది అనుభవజ్ఞులు నిర్ణయిస్తారు. పదవుల కోసం వచ్చేవారు మాకు అవసరం లేదు. ప్రజా సేవకు వచ్చేవారికే పార్టీలో అవకాశం. నా ఆలోచనలు పంచుకునేందుకే జిల్లా కార్యదర్శులతో సమావేశం అయ్యాను. నాకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు. ఈ విషయం జిల్లా కార్యదర్శులతో కరాఖండిగా చెప్పా. ఎక్కువశాతం మంది నన్ను ముఖ్యమంత్రిగా పదవిలో ఉండాలని ఒప్పించాలని ప్రయత్నించారు. రాజకీయ మార్పు కావాలి. మంచి నాయకుడి నాయకత్వం రావాలి. నాకు డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మార్గదర్శి. ఒకవైపు వారసత్వాన్ని నిరూపించుకునే నాయకత్వం, మరోవైపు అధికారం, ధనబలంతో రాబోయే ఎన్నికలను డీకొట్టాలని చూసే రెండు పార్టీల నడుమ సినిమా అభిమానంతో రాజకీయాలకు వస్తున్న నేను ప్రజల ముందుకు వెళుతున్నా. గాందీ, వివేకానంద నడయాడిన భూమి ఇది. ఇక్కడే రాజకీయాలలో విప్లవాత్మక మార్పుకు నాంది పలకాలి. ఈ వయస్సులో రాజకీయాలు, ముఖ్యమంత్రి అంటూ నన్ను బలి పశువును చేయకండి.
రాజకీయ వ్యవస్థ మార్పుకోసమే ప్రయత్నం
‘‘రాజకీయ వ్యవస్థ మార్పుకోసమే నా ప్రయత్నం. నిజంగా మీకు నిబద్దత ఉంటే ప్రభుత్వం, పార్టీని మీరే నడిపించండి. మంచి వ్యవస్థతో ముందుకు వెళదాం”. అంటూ ఇంత చెప్పిన రజనీకాంత్ మీడియా ముందు భావోద్వేగానికి గురికావడం ఇక తమిళ రాజకీయాల్లో మార్పు వచ్చినట్లే అని అటు అభిమానులు సంబరపడిపోయారు. ఆ తదనంతరం కూడా రజనీకాంత్ కొందరు సీనియర్ రాజకీయ నేతలు, విశ్లేషకులతో చర్చలు, భేటీలు ఇదో నేడో రేపో రజనీ పార్టీ, జెండా, విధివిదానాలు ప్రకటించేస్తాడనే ఊహాగానాలకు తెరలేపాయి. కాని గురువారం సామాజిక మాద్యమాలలో రజనీకాంత్ పేరుతో చక్కర్లు కొట్టిన ఓ కధనం తమిళ రాజకీయాల్లో, అభిమానులను గందరగోళంలో పడేసింది. వయోభారం, ఆరోగ్య సమస్యలు, కరోనా సమస్య ఎప్పుడు సమసిపోతుందో తెలియని సమయం, ఇప్పటికే ఏడు పదులు దాటిన వయస్సు కారణంగా రాజకీయాల్లో వచ్చే విషయం త్వరలో నిర్ణయించాలి. ఈ సమయంలో నాకోసం ఎదురు చూస్తున్న అభిమానులను నిరాశపర్చలేను. పార్టీ ప్రకటన జనవరిలోగా చేయాలంటే డిసెంబర్ లో అందరితో చర్చించాలి. ఆ తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో అభిమానుల చేతుల్లోనే ఉంది’’ అంటూ రజనీ పేరుతో వెలువడిన లేఖ ఇప్పుడు అభిమానులను డైలామాలోకి నెట్టేసింది.
‘లేఖ నాది కాదు, అందులో విషయాలు నిజమే’
లేఖ వెలువడిన కొద్దిసేపటికే రజనీకాంత్ ఆ లేఖ తనది కాదంటూ తన ట్విట్టర్ పోస్ట్ పెట్టడం అభిమానులకు ఊరట కలిగించినా.. ఆ ఆనందం ఎంతోసేపు లేకుండా చేసింది. కారణం లేఖ తనది కాదంటూనే అందులో ఉన్న విషయాలన్నీ నిజమే అనటం అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అసలు ఆయన వస్తాడా.. లేక రాడా.. పక్కన పెడితే ఈ పెద్ద వయస్సులో ఆరోగ్య సమస్యలను దాటుకొని రజనీకాంత్ రాజకీయాలు ఇక కష్టమే అన్నది అటు రాజకీయ విశ్లేషకులు, మేదావులు, సీనియర్ పాత్రికేయుల మాట.