• డిసెంబర్ 31న విధివిధానాలు ప్రకటిస్తారు
• 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారు
చెన్నై:దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొత్త మలుపు. పార్టీ ప్రకటనపై ఊరిస్తూ వచ్చిన ఆయన, ఇక పార్టీ ప్రతిపాదన విరమించుకున్నట్లేనని వస్తున్న వార్తలు, విశ్లేషణల మధ్య `నేను పార్టీ పెడుతున్నా, ఈ నెల 31న పార్టీని ప్రకటిస్తా. వచ్చే నెల నుంచి క్రియాశీలకంగా మారతా`అని చేసిన తాజా ట్వీట్ తో అభిమానుల్లో ఆనందం ఉరకలేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా నాలుగు నెలల సమయం కూడా లేనందున సూపర్ స్టార్ రాజకీయ అరంగేట్రం ఉండకపోవచ్చనే అంతా అనుకున్నారు.`పార్టీ పెట్టేందుకు ఇప్పడే ఏం తొందర`అని నాలుగు రోజుల క్రితం `రజనీ మక్కల్ మండ్రం` (ఆర్ఎంఎం) కీలక ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు వార్తలు రాగా, తాజా ట్వీట్ మరో మలుపు…
దారి మార్చిన బీజేపీ
వాస్తవానికి రజనీతో కలసి పనిచేయడానికి బీజేపీ ఉవ్విళ్లూరింది. ఆ మేరకు చర్చల కోసం గత నెలలో కేంద్రహోం మంత్రి అమిత్ షా చెన్నై పర్యటన సందర్భంగా ఆయనతో భేటీ దాదాపు ఖరారైంది. కానీ రజని అనిశ్చిత వైఖరితో కమలం పార్టీ రెండాకులు ( ఏఐడీఎంకే ) వైపు దృష్టి మళ్లించింది. దాంతో ఆ పార్టీతోనే ముందుకు వెళుతుందన్నది సుస్పష్టం. జాతీయ పార్టీ స్థానిక ప్రముఖ పార్టీతో జత కట్టినప్పుడు రజనీ పార్టీ కూడా మరొకరితో కలిసే అవకాశం లేక పోలేందంటున్నారు. అయితే కాంగ్రెస్ తో చేయి కలకపోవచ్చు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో గల స్నేహంతోనూ, తక్కువ వ్యవధిని అధిగమించేందుకు ఆయనతో కలవచ్చని భావిస్తున్నారు. మరోవంక `వచ్చే శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్ సహాయం తీసుకుంటాం. ఎన్నికల సందర్భంగా సంప్రదించేందుకు అందరి ఇళ్లకు వెళ్లాలను కుంటున్నా. స్నేహితుడైన రజనీ ఇంటిని వదిలేస్తానా?`అని కమల్ రెండు రోజుల క్రితం అన్నారు.అంటే ఆయన పరోక్షంగా రజనీ మద్దతు ఆశిస్తున్నట్లే భావిస్తున్నారు.అయితే వాటిని రజనీ అభిమానుల్లో అత్యధికులు తోసిపుచ్చు తున్నారు. `మీరు సొంతగా రాజకీయ పార్టీ పెట్టండి. అప్పడే ఓట్లేస్తాం.అందుకు భిన్నంగా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తామంటే ఒప్పకునేది లేదు`అని రజనీ అభిమానులు ఇప్పటికే ముక్తకంఠంతో చెప్పారు.
రజనీ ఎన్టీఆర్ అవుతారా?
ఇక ఇంత తక్కువ వ్యవధిలో పార్టీ పెట్టడం ద్వారా రజనీ ఎంత వరకు విజయం సాధిస్తారనే సందేహాలు, విశ్లేషణలు సాగుతుండగా ఆయన అభిమానులు మాత్రం ధైర్యంగా ఉంటూ, 1980వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి అఖండ విజయం సాధించడాన్ని ఉదహరిస్తున్నారు. కానీ అప్పుడు అక్కడి రాజకీయ శూన్యతను, కొత్త పార్టీ ఆవశ్యకతను గమనించవలసి ఉందిని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ అనుకున్నతడవుగా ఎన్నికలకు తొమ్మిది నెలలకు ముందు పార్టీని ప్రకటించి ఎన్నికల పోరుకు దిగారు. రజనీ తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. భగవంతుడి ఆశీస్సులు ఉంటే రాజకీయాల్లోకి వస్తానని నాలుగేళ్ల క్రితమే చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం ఇటు అభిమానుల్లో నిరాశతో పాటు అటు రాజకీయ వర్గాలలో ప్రహసనంగా మారిందని అంటున్నారు. ఆయన రాజకీయ ప్రవేశ ఉద్దేశంతో స్ఫూర్తి పొందిన సహ నటుడు కమల్ హాసన్ పార్టీ (మక్కళ్ నిది మయ్యం) పెట్టేశారు కూడా. తమిళనాడులో రాజకీయం శూన్యత లేకపోయినా కొత్తదనం కోరుతున్న జనం వచ్చిన, రానున్న పార్టీలను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.