- రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటన
- క్షమించమంటూ అభిమానులకూ, ప్రజలకూ సందేశం
- 31 రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తారని ఊహిస్తున్న తరుణంలో బ్రేక్
- రాజకీయాలలో ప్రవేశించకుండా ప్రజాసేవ చేస్తానంటూ వాగ్దానం
చెన్నై: ‘‘నేను రాజకీయాలలో ప్రవేశించలేనని చాలా బాధాతప్తమైన హృదయంలో తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం ప్రకటించే సమయంలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు ఒక్కడికే తెలుసు,’’ అని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. మంగళవారంనాడు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఇంకా ఇలా అన్నారు : ‘‘రాజకీయాలలో ప్రవేశించకుండా నేను ప్రజలకు సేవచేస్తాను. ఈ నిర్ణయం నా అభిమానులకూ, ప్రజలకూ ఆశాభంగం కలిగిస్తుంది. నన్ను క్షమించండి.’’ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కోలుకొని చెన్నై వెళ్ళిన రెండో రోజున రజినీకాంత్ ఈ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఆయన 31వ తేదీనాడు రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తారనీ, ఎంజి రామచంద్రన్ జయంతినాడు జనవరి 17న రాజకీయపార్టీ స్థాపిస్తారనీ ఇంతవరకూ ఊహాగానాలు సాగాయి. వాటికి ఆయన కూడా అవకాశం కల్పించి ఊతం ఇచ్చారు. ఇంతలో కథ అడ్డం తిరిగింది.
ఇది చదవండి : ‘రజని’ రాజకీయంలో అదే సస్పెన్స్
తమిళుల ఆరాధ్య నటుడు రజినీకాంత్ రెండేళ్ళ కిందట రజినీ మక్కల్ మన్రం ను నెలకొల్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఐదు మాసాల ముందు జనవరిలో సొంతపార్టీ పెడతారని ఆయన అభిమానలు అనుకుంటున్నారు. ఇందుకు సన్నాహక సమావేశాలు సైతం జరిగాయి. మన్రం జిల్లా స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. అందులో రజినీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. రాజకీయరంగంలో ప్రవేశించవలసిన సమయం ఆసన్నమైందంటూ రజినీ ట్వీట్లు కూడా పెట్టారు. ఆయన కూడా మానసికంగా పార్టీ పెట్టడానికి సిద్ధపడినట్టు కనిపించారు.
హైదరాబాద్ రామోజీ ఫిలం సిటీ లో షూటింగ్ జరుగుతున్న సందర్భంలో రజినీ యూనిట్ లో ఏడుగురికి కరోనా సోకింది. ఆ వార్త వెలువడిన మరుసటి రోజు రక్తపోటు స్థిరంగా ఉండటం లేదనే కారణంగా రజినికాంత్ శుక్రవారంనాడు అపోలో ఆస్పత్రిలో చేరారు. ఒక రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని అస్పత్రి నుంచి విడుదలై ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి చైన్నై వెళ్ళిపోయారు.
ఇది చదవండి : రాజకీయాల్లోకి రావట్లేదు-రజనీకాంత్ ప్రకటన