- రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన షర్మిల
- వైఎస్ఆర్ లేని లోటు తీరుస్తా
తెలంగాణలో త్వరలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లేటు తెలంగాణలో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని షర్మిల అన్నారు. రాజన్న లేని లోటు పూడ్చిందుకే మళ్లీ వచ్చానని ఆమె స్పష్టం చేశారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళేనంలో నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు షర్మిల తెలిపారు.
అభిమానుల కోలాహలం:
కాస్త ఓపిక పట్టండి అందిరితో చర్చించాక అన్ని విషయాలు చెబుతానన్నారు. కచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్న షర్మిల భర్త అనిల్ కుమార్ తో కలిసి లోటస్ పాండ్ లోని నివాసానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి షర్మిల నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. జోహార్ వైఎస్సార్ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో లోటస్ పాండ్ మార్మోగింది.
Also Read: దూసుకుపోతున్న జగనన్న విడిచిన బాణం
ఫెక్సీల్లో లేని జగన్ ఫొటో :
షర్మిల నివాస పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో తన సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో లేకుండా షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు.
నేను .. రాజన్న కూతుర్ని:
నేను..మీ రాజన్న కూతుర్ని జగనన్న విడిచిన బాణాన్ని అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ షర్మిల చేసిన పాదయాత్ర ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో పాదయాత్రకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టబోతున్నారు. 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జిల్లాల్లో కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ఇంటింటికీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాతే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.