Friday, December 27, 2024

రజనీ బాబాసాహెబ్ ఫాల్కే పురస్కారం బస్సు డ్రైవర్ సహా ఆత్మీయులందరికీ అంకితం

  • నిగర్వి, నిరాడంబరుడు, స్నేహశీలి, వదాన్యుడు
  • రాఘవేద్రస్వామి భక్తుడు, ఆధ్యాత్మికతలో అగ్రగణ్యుడు
  • వీలైనప్పుడల్లా హిమాలయ పర్వత సానువుల్లోకి
  • నటుడుగా రజనీని తీర్చిదిద్దింది మన దేవదాసు కనకాలే
  • జీవితాన్ని మలుపు తిప్పిన దుర్యోధనుడి పాత్ర

సుప్రసిధ్ధ సినిమా కథానాయకుడు రజనీకాంత్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం’ అందుకున్న శుభ సందర్భమిది. జాతీయ స్థాయి నటుడుగా పేరు ఉన్నప్పటికీ తమిళనాడులోనే ఎక్కువ విఖ్యాతిని ఆర్జించారు. తెలుగు, కన్నడ సీమలోనూ గొప్ప గుర్తింపును సాధించుకున్నారు. తమిళులందరూ ‘తలైవర్’  గా కొలుచుకుంటూరు. సినిమారంగ ప్రస్థానం లోనూ,వ్యక్తిగత జీవితంలోనూ ఇప్పటి వరకూ మచ్చలేని స్వచ్ఛమైన కీర్తిని సంపాయించుకున్నారు. సూపర్ స్టార్ గా కీర్తి, కనక, ఐశ్వర్య, సౌధాలు నిర్మించుకున్నా,రవ్వంత అహంకారాన్ని దరిచేరనివ్వలేదు. గత కాలపు  గతుకు బతుకును మరువ లేదు. తనను మలచిన శిల్పులను, ప్రోత్సహించిన స్ఫూర్తిమూర్తులను, చేయందించిన ఆత్మీయులను, తనలోని ప్రతిభను మొట్టమొదటగా గుర్తించిన వ్యక్తులను, విద్య, బుద్ధులు నేర్పిన పెద్దలను, తనని ప్రేమించి పోషించిన అభిమానులను, తన జీవితంలో తారసపడిన ప్రతి ఒక్కరినీ రజనీకాంత్ గుండెల్లో నిలుపుకున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరిస్తున్న రజనీకాంత్

బాలచందర్ కు గురుదక్షిణ

ఇంతటి సుదీర్ఘ ప్రగతి ప్రయాణంలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. తను సాధించుకున్న ఈ పురస్కార సర్వస్వాన్ని పూర్తిగా తన సొత్తుగా భావించడం లేదు. ఎందరెందరో అందించిన ఆశీర్వాద ఫలంగానే భావిస్తూ, పేరు పేరునా వారందరికీ అంకితం చేయడం రజనీకాంత్ సంస్కారానికి, కృతజ్ఞతాస్వరూపానికి ప్రతిరూపం. గురువు కె. బాలచందర్, సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్, సహచర ఉద్యోగనేస్తం రాజ్ కుమార్ బహుదూర్ కు అంకితం చేస్తూ, వారిలో తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని దర్శించుకున్నారు.ఈ మానసిక ప్రకృతి అతనిని ఉన్నతంగా నిలుపుతాయి. కథానాయకుడుగా రజనీకాంత్ ప్రస్థానాన్ని గమనిస్తే  తమిళనాడు, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఇదే క్రమంలో ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ మూడు రాష్ట్రాలలోనూ కలిసి, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందినవారి సంఖ్య చాలా తక్కువ. నటుడు,నిర్మాత,స్క్రీన్ ప్లే రచయితల కోటాలో రజనీకాంత్ ను ఎంపిక చేశారు. ఎంపికకు ఎంచుకున్న కొలతలు ఎలా ఉన్నా రజనీని నటుడు, నాయకుడుగానే చూడాలి. తమిళనాడు నుంచి శివాజీ గణేశన్, కర్ణాటక నుంచి రాజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కినేని నాగేశ్వరావు మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వీరందరిని ప్రధానంగా కథానాయకులుగానే భావిస్తాం. ఎం.జి.ఆర్, కమల్ హాసన్, ఎన్టీఆర్ వంటి మహానటులకు, అగ్రస్థాయి కథానాయకులకు కూడా దక్కని గౌరవాన్ని దక్కించుకున్న భాగ్యశాలి రజనీ. అనామకంగా సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు, అండగా నిలిచి, తొలి అవకాశం ఇచ్చి, పరిశ్రమలో నిలబెట్టిన దర్శకుడు కె.బాలచందర్. సినిమాసీమలో రజనీకాంత్ ప్రవేశించే నాటికే దర్శకుడుగా కె.బాలచందర్ సుప్రసిద్ధుడు. దాదాసాహెబ్ పురస్కారం నాడు గురువుకు అందింది. నేడు శిష్యుడుకి చేరింది. ఈ పురస్కారాన్ని గురువుకు అంకితం చేయడం ద్వారా గురుదక్షిణ సమర్పించి, ఋణం తీర్చుకున్నట్లయింది. గురువు-శిష్యుడు ఇద్దరికీ ఇంతటి పురస్కారం దక్కడం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన గౌరవం.

Also read: సకారాత్మక సంచలనాలకు చిరునామా స్టాలిన్

సర్వత్రాహర్షం

రజనీకాంత్ కు పురస్కారం ప్రకటించిన వేళ, తమిళనాడులో ఎన్నికల పోరు హోరుగా సాగుతోంది. అటువంటి సందర్భంలో ప్రకటన వెలువడడం అప్పుడు జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. సరే, రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నాడు. అది మంచి నిర్ణయంగానే ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వివాదరహితుడుగా పరిశ్రమలో ఎంతో మంచి పేరున్న రజనీకాంత్ కు ఇంత పెద్ద గౌరవం లభించడం పట్ల నేడు అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి ఉన్నత స్థితికి చేరుకున్న రజనీకాంత్ జీవితం వడ్డించిన విస్తరి కాదు.వైవిధ్య భరితమైన ప్రయాణం.మహారాష్ట్ర మూలాలు కలిగి, కర్ణాటకలో పుట్టిపెరిగి, తమిళనాడులో నటనా రంగంలో శిక్షణ పొంది, క్యారెక్టర్ పాత్రలతో మొదలుపెట్టి, ఆల్ ఇండియా సూపర్ స్టార్ దాకా ఎదిగిన రజనీ జీవితం తెరచిన పుస్తకం. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి, పేదరికంలో మగ్గుతూ, కర్ణాటకలో బస్సు కండక్టర్ గా జీవితం ప్రారంభించాడు. కండక్టర్ గా ఉన్నా,తనలోని నటుడికి వీలున్నప్పుడల్లా పని పెడుతూనే వున్నాడు. తను వేసిన దుర్యోధన పాత్ర మలుపు తిప్పింది. తన ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. శిక్షణ పొందితే నటనలో మరింత పరిపక్వత వస్తుందని తన ప్రాణ స్నేహితుడు రాజ్ కుమార్ బహుదూర్ నమ్మాడు. డబ్బులిచ్చి మద్రాస్ కు పంపించాడు. రజనీకాంత్ కు శిక్షణ ఇచ్చింది ఎవరో కాదు, మన దేవదాస్ కనకాల. శిక్షణ పూర్తవ్వగానే అవకాశాలు వెల్లువెత్తలేదు. ఇటు అవకాశాలు రావడం లేదు, అటు ఉద్యోగం పోయింది. పెద్ద చదువులు కూడా చదువుకోక పోవడం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. జీవితమే వృధా.. అనే నిర్ణయానికి వచ్చిన రజనీకాంత్ కు ఆధ్యాత్మిక శక్తి అండగా నిలిచింది. రాఘవేంద్రస్వామి బొమ్మలో నుంచి గొప్ప వెలుగును, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పొందాడు.  ఇప్పటికీ ఆధ్యాత్మికశక్తిపై అదే విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.

Also read: అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

రజనీగా మారిన శివాజీరావు గైక్వాడ్

దిగ్ దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడడంతో రజనీ జీవితమే మారిపోయింది. శివాజీరావు గైక్వాడ్ ను రజనీకాంత్ గా మార్చింది కూడా బాలచందర్. గురువు నిర్దేశించినట్లు నటిస్తూ, కమల్ హాసన్ నటనను చూస్తూ తనను తాను మలుచుకున్నానని రజనీకాంత్ ఇప్పటికీ చెబుతుంటారు. తనదంటూ ఒక శైలి, తనకంటూ ఒక ముద్ర లేకపోతే,  గుంపులో గోవిందగా మారిపోతానని అనుకున్నాడు. నడకలో, నటనలో, మాటలో, హావభావాల్లో విలక్షణమైన రీతులను అలవాటు చేసుకొని, ప్రదర్శించడం మొదలు పెట్టాడు. అతని మేనరిజం, స్టైల్ అతితక్కువ సమయంలోనే రజనీని ప్రత్యేకంగా నిలిపాయి. తమిళ, కర్ణాటక, తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక ముద్ర వేసుకొని, పెరుగుతూ వచ్చాడు. కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలోనే వరుసగా అవకాశాలు వచ్చాయి. 1978  సంవత్సరంలో 20కు పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించాడు. తమిళ్ లో హీరోగా నటించిన ‘భైరవి’ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. అప్పటి నుంచి ‘సూపర్ స్టార్’ బిరుదు రజనీని చేరింది. ఇప్పటికీ సూపర్ స్టార్ గానే వెలుగొందుతున్నారు. ఆ వివరాలు,విశేషాలు అందరికీ తెలిసినవే. అతనిలోని వైరాగ్య భావాలు, అసలు మనిషి పరిచయస్తులకు మాత్రమే పరిచయం. అతను నటించిన ఒక సినిమా పేరు ‘బాబా’. నిజంగా, ఆ పేరుకు తగ్గట్టుగానే రజనీకాంత్ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో సూపర్ స్టార్ స్టేటస్ ఎక్కడా కనిపించదు. డబ్బు, సుఖాలు, విజయాల పట్ల తన దృక్పథం వేరుగా ఉంటుంది. సినిమాల్లో కనిపించే రజనీ వేరు. లోపలి మనిషి పూర్తిగా వేరు.

Also read: వంద కోట్ల మందికి టీకాలు

ఆత్మావలోకనం

వీలున్నప్పుడల్లా, వీలుచేసుకొని కూడా హిమాలయ పర్వతాలకు వెళ్తారు. ఎక్కువసేపు ధ్యానంలో గడుపుతారు. అక్కడి యోగులు,గురువులు, స్వాములతో మాట్లాడుతారు. తనను వెంటాడే అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషణ చేస్తారు. తనలోకి చూసుకోవడం ఇష్టం. తానేంటో, తన గమ్యమేంటో తెలుసుకోవడం ఇంకా ఇష్టం. కాషాయం ధరించడు కానీ కర్మయోగ సాధనలో ఉంటారు. తెల్లని పంచె, చొక్కా లేదా లాల్చీ పైజామలో కూర్చొని యోగ సాధన చేస్తారు. ఈ చరాచర జగత్తును నడిపే శక్తి గురించి నిత్యం అన్వేషణ చేస్తూ ఉంటారు. అంతరాత్మ – మనిషి – దైవం – జీవిత పరమావధి గురించి తెలుసుకోడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. హిమాలయాల్లో జీవనం, అనుభవాలు,అనుభూతులు పట్ల మక్కువ చాలా ఎక్కువ. నిరాడంబరంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. తోటి వారికి సహాయం చేయడానికి, దాన ధర్మాల ద్వారా సంపదను సద్వినియోగం చేయడం పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. తన ఆదాయంలో సగభాగం వితరణకే వెచ్చిస్తారు. ఎంత సంపాయించినా  ఎవరూ తనతో పట్టుకెళ్లరు, శరీరాన్ని వీడేటప్పుడు, అన్నీ వదిలి వెళ్లిపోవాల్సిందే, అనే సిద్ధాంతంతో వుంటారు. మానవ సంక్షేమం, శాంతి కోసమే తాను దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటానని చెబుతారు. తను సంపాదించిన సంపాదనంతా తాను స్థాపించిన ‘రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్ట్’ కే చెందుతుందని గతంలో బహిరంగంగానే ప్రకటించారు. తన సినిమాల ద్వారా ఎవ్వరూ నష్టపోడానికి కూడా ఇష్టపడరనే ప్రచారం  పరిశ్రమలో ఉంది. ‘బాబా’ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా, అందరినీ ఇంటికి పిలిపించుకుని ప్రతి ఒక్కరికీ తన సొంత డబ్బులను తిరిగి ఇచ్చారు. కృతజ్ఞత, స్నేహధర్మం, వితరణ, సేవాతత్పరత, మానవత్వం,  తాత్త్వికత మూర్తీభవించిన విశిష్టమైన వ్యక్తిగా రజనీకాంత్ కు ఎంతో మంచిపేరు వుంది. చిన్నగా మొదలైన తన జీవిత ప్రస్థానంలో ఇన్ని మలుపులు, అన్ని గెలుపులు చూసిన రజనీకాంత్ ఆదర్శవంతుడు. గొప్ప నటుడు కాకపోయినా, విలక్షణమైన శైలితో భారతీయ సినిమా రంగంలో అగ్రస్థాయి కథానాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. తనలోని పరిపూర్ణ నటుడిని వెలికితీసే పాత్రలు కూడా పెద్దగా రాలేదు. సినిమా పరిశ్రమ హీరో ఇమేజ్ చట్రంలోపలే కూర్చో పెట్టింది. నిజ జీవితంలోనూ కథానాయకుడే. తలకు పొగరెక్కని తలైవర్ కు అభినందనలు అందిద్దాం.

Also read: పారదర్శకతకు సరైన రూటు ఈ-ఓటు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles