వోలేటి దివాకర్
దేవుణ్ణి పూజిస్తే పుణ్యం వస్తుంది.. అదే దేవుణ్ణి పూజించే వారిని సేవిస్తే మరింత పుణ్యం మూటకట్టుకోవచ్చు. పిల్లికి బిచ్చం పెట్టని వారు కూడా శివరాత్రి రోజు ఎదో ఒక వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహా శివరాత్రి పర్వదినం రోజు దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో అదే జరుగుతోంది. శివరాత్రి రోజున గోదావరి తీరంలో ఉన్న రాజమహేంద్రవరం వచ్చే భక్తులకు ఆహార పానీయాలకు లోటు ఉండదు. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్నీ పంచుతారు. యువత కూడా ఈవితరణల్లో పాల్గొనడం విశేషం.
Also read: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ
తెల్లవారుజాము నుంచే భక్తులకు భోజనం
ఇక్కడ వేలల్లో వితరణ శీలురు తెల్లవారుజాము నుంచే భక్తులకు భోజనం, బిర్యానీలు, పండ్లు పంచిపెడతారు. రైల్వేస్టేషన్లు … బస్టాండ్లు … కూరగాయల మార్కెట్లో వెండర్లు కేకలు వేసి మరీ విక్రయాలు సాగిస్తారు. పవిత్ర గోదావరి తీరాన ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం రాజమహేంద్రవరంలో మాత్రం మహాశివరాత్రి రోజున భక్తులకు అడగకుండానే అన్ని పంచేస్తారు. చిన్న పిల్లలకు పాలు, నీళ్లు, టీ, కాఫీ, మజ్జిగ, పండ్లు, పులిహోర, దద్దోజనం, టిఫిన్ల బిర్యానీ, మధ్యాహ్న భోజనం వరకు ఉచితంగా పంపిణీ చేస్తారు. అది రోడ్డుపై వెళ్లే వారిని పిలిచి మరీ వితరణ చేయడం ఇక్కడి ప్రత్యేకత.
Also read: గోరంట్ల మళ్లీ రాజమహేంద్రవరం రాజకీయాల్లో చక్రం తిప్పుతారా?!
పేదగొప్ప తారతమ్యాలు లేవు
వితరణ చేసే వారంతా ధనికులు, కార్పొరేట్ సంస్థలే అనుకుంటే పొరపాటే. శివరాత్రి రోజున పేద, గొప్ప తారతమ్యాలు లేకుండా బడా వ్యాపారుల నుంచి ఆటోడ్రైవర్ వరకు తమకు తోచిన విధంగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం విశేషం. గోదావరి తీరాన ఉన్న రాజమహేంద్రవరం నగరం మహాశివరాత్రి రోజున జన సంద్రంగా మారుతుంది. ఆసియాలోనే అతి పెద్దదైన స్నానఘట్టం కోటిలింగాల రేవు ఇక్కడే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన భక్తులు లక్షలాది మంది శివరాత్రి నాడు రాజమహేంద్రవరం చేరుకుని పవిత్రస్నానాలు చేస్తారు. పుష్కరాలరేవు, కోటిలింగాల రేవు, మార్కండేయస్వామిఘాట్ వంటి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడతాయి. స్నానాల అనంతరం సమీపంలోని కోటిలింగేశ్వరుడు, మార్కండేయస్వామి, ఉమా కోటిలింగేశ్వరస్వామి వంటి ఆలయాలను దర్శించుకుని అభిషేకాలు చేస్తారు. రాజమహేంద్రవరం నుంచే పడవలు, బోట్లలో పట్టిసీమ ఆలయానికి వెళతారు. శివరాత్రి నాడు వితరణ చేయడం ఇక్కడివారికో తృప్తి.!!!