వోలేటి దివాకర్
సీనియర్ ఎమ్మెల్యే , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అమెరికాలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు సంచలన ప్రకటన చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిని తానేనని స్పష్టం చేశారు. ఎంపి గా పోటీ చేయనన్నారు. ప్రస్తుతం ఆయన సతీమణి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాసు ప్రకటన బట్టి వచ్చే ఎన్నికల నాటికి అప్పారావు, ఆయన కోడలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అప్పారావు, ఆయన సతీమణి, మాజీ మేయర్ వీరరాఘవమ్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ టిక్కెట్ పై భరోసా దక్కినట్టు చెబుతున్నారు.
మరోవైపు గోరంట్ల ఈమధ్యే 77 వ జన్మదినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు . ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల ఈసందర్భంగా వచ్చే 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు . అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో … అసెంబ్లీకా … పార్లమెంటుకా అన్నవిషయాన్ని వెల్లడించలేదు .
పార్టీలోని తన రాజకీయ ప్రత్యర్థి ఆదిరెడ్డి అప్పారావు తన వారసుడిగా కుమారుడు శ్రీనివాస్ ను ప్రకటించిన వెంటనే తన సోదరుడు శాంతారామ్ కుమారుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ ను గోరంట్ల తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకున్నారు .
పొత్తు కుదిరితే రాజమహేంద్రవరంపై కుస్తీ తప్పదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికార వైసిపి వ్యతిరేక పక్షాలను కలుపుకుని పోటీ చేస్తామని ప్రకటించారు . ఈనేపథ్యంలో ఒకవేళ టిడిపి , జనసేన మధ్య పొత్తు కుదిరితే ప్రస్తుతం గోరంట్ల ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గాన్ని జన సేనకు కేటాయించే అవకాశాలను తోసిపుచ్చలేము . కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన జిల్లా అధ్యక్షుడు , అదే సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు . మరోసారి కందులకు ఈసీటును కేటాయిస్తే గోరంట్లను రాజమహేంద్రవరం అసెంబ్లీ లేదా పార్లమెంటుకు మరీ తప్పదనుకుంటే రాజానగరం నియోజకవర్గానికి పంపవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి .
జనసేనతో పొత్తు కుదిరితే తన సీటు మారుస్తారన్న ముందస్తు అంచనాతోనే గోరంట్ల రాజమహేంద్రవరం నగరంలో మూసివేసిన పాత కార్యాలయాన్ని తెరిచి , మరీ రాజకీయాలు సాగిస్తున్నారని భావిస్తున్నారు. ఆదిరెడ్డి వర్గం అడ్డుకుంటున్నా రాజమహేంద్రవరం టీడీపీ పార్టీలో తనకున్న పట్టు సడలిపోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా వెళ్లినా తన వారసుడితో సమావేశాలు పెట్టిస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజమహేంద్రవరం స్థానం కోసం గోరంట్ల గట్టిగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. వాసుకు బాబు భరోసా దక్కిందన్న ప్రచారం నేపథ్యంలో గోరంట్ల, ఆయన రాజకీయ వారసుడి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా గోరంట్ల, ఆదిరెడ్డిల్లో ఏ ఒక్కరి సీటు గల్లంతై నా టిడిపిలో మరోసారి అంతర్గత విభేదాలు, వెన్నుపోట్లు తప్పకపోవచ్చు.
Sitting mla seats marustharani yela anukuntunnaru .kaneesam rajakeeya parignanam tho alochinchandi Gorantla ki poti chudodhu polika vadhu aayana kaboye minister raasukondi. . Jai Gorantla. …. Talari murthy.