ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ముఖ్యమైన భారతీయ ఆంగ్ల నవలా రచయితలలో రాజారావు ఒకరు. భారత దేశం గర్వించదగ్గ ఆంగ్ల రచయిత రాజారావు (1908 – 2006). ఇంగ్లీషులో ఆయన రాసిన నవలలు, కథలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.
హసన్ లో జననం
రాజారావు 8 నవంబర్ 1908 న మైసూరు రాజ్యం (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) లోని హసన్ పట్టణంలో ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు వారి తల్లి దండ్రులకు జన్మించిన తొమ్మిది మంది సంతానంలో పెద్దవాడు. ఇతనికి ఏడుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడు యోగేశ్వరానంద ఉన్నారు. ఇతని తండ్రి హెచ్.వి.కృష్ణస్వామి హైదరాబాదు లోని నిజాం కళాశాలలో కన్నడ భాషను బోధించేవాడు. ఇతని తల్లి గౌరమ్మ ఒక గృహిణి. ఇతడు 4 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మరణించింది.
నిజాం కాలేజీలో చదువు
ఇతడు నైజాం పరిపాలనలో ఉన్న ఆనాటి హైదరాబాదులోని మదరసా – ఎ – ఆలియాలో మెట్రిక్యులేషన్ వరకూ చదివాడు. తరువాత తండ్రి పనిచేస్తున్న నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. తరువాత ఇతడు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రెంచి అధ్యయనం చేశారు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు, చరిత్రలలో పట్టా పుచ్చుకున్నారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1929లో ఏషియాటిక్ స్కాలర్‌షిప్ పొంది ఫ్రాన్స్ లోని మొపెయి విశ్వవిద్యాలయంలో ఐరిష్ సాహిత్యంపై భారతీయ ప్రభావం అనే అంశంపై అధ్యయనం చేశారు. 1931లో ఇతడు కేమిల్ మౌలీ అనే ఫ్రెంచి అధ్యాపకురాలిని వివాహం చేసుకున్నారు. 1939 వరకు వీరు కలిసి ఉన్నారు. తరువాత వీరి సంబంధం భగ్నమైంది. ఈ వైవాహిక జీవితం గురించి రాజారావు తన నవల “ది సెర్పెంట్ అండ్ ది రోప్”లో వర్ణించాడు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాత్ర
రాజారావు 1939లో భారతదేశం తిరిగి వచ్చారు. 1942లో ఇతడు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1943-1944లో బొంబాయి నుండి వెలువడిన “టుమారో” అనే పత్రికకు సహ సంపాదకుడిగా వ్యవహరించారు. “శ్రీ విద్యా సమితి” అనే సాంస్కృతిక సంస్థ ప్రారంభానికి ఇతడు ముఖ్య కారకుడు. “చేతన” అనే మరో సాంస్కృతిక సంస్థతో కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. 1966 నుండి 1986 వరకు ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో తత్త్వశాస్త్రాన్ని బోధించాడు. అక్కడ ఇతడు బోధించిన వాటిలో మార్క్సిజం నుండి గాంధీయిజం దాకా, మహాయాన బౌద్ధము, భారతీయ తత్త్వము, ఉపనిషత్తులు మొదలైనవి ఉన్నాయి. 1965లో ఇతడు అమెరికన్ రంగస్థల నటి కేథరిన్ జోన్స్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి క్రిస్టఫర్ రామారావు అనే ఒక కుమారుడు కలిగాడు. 1986లో ఆమెకు విడాకులు ఇచ్చి సూసన్ వాట్‌ను మూడవ వివాహం చేసుకున్నాడు. సూసన్ 1970లో టెక్సాస్ యూనివర్సిటీలో ఇతని శిష్యురాలు.
ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథా రచన
రాజారావు తన రచనా వ్యాసంగ తొలిదశలో ఫ్రాన్సు దేశంలో ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథలు వ్రాశాడు. 1939లో ‘ఛేంజింగ్ ఇండియా’ అనే సంకలనానికి సంపాదకునిగా, ‘విదర్ ఇండియా’ అనే పుస్తకాన్ని ఇక్బాల్ సింగ్‌తో కలిసి సహ సంపాదకునిగా ప్రచురించారు. జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ‘సోవియట్ రష్యా సమ్ రాండమ్ స్కెచెస్ అండ్ ఇంప్రెషన్స్’ అనే పుస్తకానికి సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్న అనుభవాలు తొలి నవల “కాంతాపుర”లోనూ, కథా సంకలనం “ది కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్”లోనూ ప్రతిఫలించాయి. ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన చాలా కాలం తర్వాత 1960లో ఇతడు “ద సర్పెంట్ అండ్ ద రోప్” రచించారు. దీనిలో భారతీయ పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాలను నాటకీయ ఫక్కీలో వర్ణించారు. ఈ నవల పేరులోని సర్పం (Serpent) భ్రాంతికి, త్రాడు (Rope) వాస్తవానికి ప్రతీకలు.
ప్రముఖ రచనలు
కాంతాపుర (1938), ద సర్పెంట్ అండ్ ద రోప్ (1960), ద క్యాట్ అండ్ షేక్స్‌పియర్: ఎ టేల్ ఆఫ్ ఇండియా (1965), కామ్రేడ్ కిరిలోవ్ (1976), ద చెస్ మాస్టర్ అండ్ హిజ్ మూవ్స్ (1988), ఆన్ ది గంగా ఘాట్ (1989), ద కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్ (1947), ద పోలీస్‌మాన్ అండ్ ద రోజ్ (1978), ద ట్రూ స్టోరీ ఆఫ్ కనకపాల, ఇన్ ఖందేష్, కంపేనియన్స్, ద కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్అక్కయ్య, ద లిటిల్ గ్రామ్ షాప్, జవని, నిమ్క, ఇండియా ఎ ఫేబుల్, ద పోలీస్‌మాన్ అండ్ ద రోజ్; ఛేంజింగ్ ఇండియా: ఏన్ ఆంథాలజీ (1939); టుమారో (1943–44); విదర్ ఇండియా? (1948) ద మీనింగ్ ఆఫ్ ఇండియా; వ్యాసాలు (1996); ద గ్రేట్ ఇండియన్ వే: ఎ లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ, జీవిత చరిత్ర (1998), ద బెస్ట్ ఆఫ్ రాజారావ్ (1998), 5 ఇండియన్ మాస్టర్స్ (రాజారావు, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్, డా. ముల్క్ రాజ్ ఆనంద్, కుష్వంత్ సింగ్) (2003) తదితర రచనలు చేశాడు.
అత్యున్నత పురస్కారాలు పొందిన రచయిత
1964: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు; 1969: పద్మభూషణ్ పురస్కారం; 1988: న్యుస్టాడ్ట్ అంతర్జాతీయ సాహిత్య బహుమతి; 2007 లో మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం లభించాయి. 2006, జూలై 8వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలోని తన గృహంలో 97వ యేట గుండెపోటుతో మరణించారు.
(నవంబర్ 8న రాజారావు వర్థంతి)
Good article