- తెలుగువారు గర్వించదగిన సందర్భం
- రాజమహేద్రవరం, విశాఖ, హైదరాబాద్ లలో వేడుకలు
‘ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది- నన్నయ సహస్రాబ్ది మహోత్సవాలు’ పేరుతో తెలుగునాట ఈ జూలై 23 నుంచి వేడుకలు జరుగనున్నాయి. మొట్టమొదటి రోజు రాజమహేంద్రవరంలో, జూలై 30వ తేదీన విశాఖపట్నంలో, ఆగస్టు 13 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించాలని ప్రణాళిక చేశారు. విశాఖపట్నంకు చెందిన ‘రాసి కేర్స్’ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ సాంసృతిక మంత్రిత్వ శాఖ ఈ వేడుకలకు సౌజన్యాన్ని అందిస్తోంది. క్రీస్తు శకం 1022 వ సంవత్సరం, ఆగస్టు 22 వ తేదీన బెజవాడలో రాజ రాజనరేంద్రుడు పట్టాభిషిక్తుడైనట్లు వివిధ రచనల ద్వారా తెలుస్తోంది. ఈ మహా సందర్భాన్ని పురస్కరించుకొని, రాసి కేర్స్ సంస్థ ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. దానికి కేంద్ర ప్రభుత్వం సౌజన్యం చూపిస్తూ ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించాలనుకోవడం ఎంతో సంతోషకరం.రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక శుభ ఘడియల్లో ఆంధ్ర మహాభారతాన్ని, మహాకవి నన్నయను తలచుకోవడం కడు ముదావహం. వీటన్నిటిని కలిపి ‘సహస్రాబ్ది మహోత్సవాలు’గా రూపకల్పన చేయడం తెలుగువారందరికీ అత్యంత ఆనందకరం. పల్లకీ సేవ,రూపకాలు, ఉపన్యాసాలు,పద్య పఠనం మొదలైన విభిన్న రీతులలో ఉత్సవాలను రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది.
చరిత్రలో ఘనంగా రాజరాజ నరేంద్రుడు
నన్నయ ద్వారా ఆంధ్రమహాభారత శ్రీకార ప్రోత్సాహం ద్వారా రాజరాజనరేంద్రుడు చరిత్రలో ఘనంగా మిగిలిపోయాడు. ఈ మహాకావ్య నిర్మాణం వల్ల తెలుగు భాషా, సాహిత్యాలకు, యావత్తు ఆంధ్రజాతికి జరిగిన మేలు సామాన్యమైంది కాదు. మన వికాస, వైభవ ప్రస్థానంలో ఆంధ్ర మహాభారత సృష్టికి ముందు- తర్వాత అని విభజించి చూసుకోవాలి. అంతటి భాగస్వామ్యం ఆ మహాకావ్యానికి ఉంది. 18 పర్వాల ఆంధ్రభారత సృష్టికి తొట్టతొలిగా సంకల్పం చేసుకున్నవాడు నన్నయ భట్టారకుడు. ఈ మహారచనకు మహోన్నతమైన పూనికను ఇచ్చినవాడు రాజరాజ నరేంద్రుడు. రెండున్నర పర్వాల రచనతోనే నన్నయ పరమపదించినా, ఆ మహనీయుని సత్ సంకల్పం సంపూర్ణంగా సిద్ధించింది. తిక్కన, ఎర్రన మహాకవుల చేతుల మీదుగా ఆ మహాక్రతువు సమగ్రంగా విజయమైంది. దాని కోసం కొన్ని వందల సంవత్సరాల కాలం పట్టవచ్చుగాక! వెయ్యేళ్ల క్రితం నన్నయ్య నాటిన మహావృక్షం కల్పవృక్షమై వర్ధిల్లింది. ఆ మహాభారత భారతి జ్యోతిలో తదనంతర కవులు గొప్పగా వెలిగారు. భాష, వ్యాకరణం, ఛందస్సు, సాహిత్యం, ముఖ్యంగా పద్యం అనంతముఖీనమై విరాజిల్లాయి. నన్నయను గురువుగా, గురుపద్యవిద్యకు ఆద్యుడుగా తదనంతర కవులంతా కొలిచి నిలిచారు. అంతకు ముందే పద్య సాహిత్యం, కవిత్వం ఉన్నప్పటికీ ‘ఆంధ్రమహాభారతం’ స్థాయిలో మహాకావ్య నిర్మాణం జరగలేదన్నది వాస్తవమని చరిత్రకారులు, కవిపండితుల అభిప్రాయం. వ్యాసభగవానుడు సంస్కృతంలో రాసిన ఈ శాస్త్రేతిహాసాన్ని కావ్యేతిహాసంగా మలచినవారు మన కవిత్రయం. వారిలో ఆద్యుడు, పూజ్యుడు, ఆ మహాసృష్టికి బ్రహ్మ వంటివాడు నన్నయ. ” మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్.. ” అని రామరాజ భూషణుడు అందుకే అన్నాడు. శబ్దార్ధాధాలు ఆయన వాక్కును అనుసరిస్తాయి. అంతేకానీ,వాటిని ఆయన అనుసరించడు. అంతటి శబ్దశాసనుడు నన్నయ.తమిళం,కన్నడ మొదలైన అనేక భారతీయ భాషల్లో భారత కావ్యాలు, సంస్కృత అనువాదాలు ఎన్నో వచ్చినప్పటికీ కవిత్రయ భారతానిదే అగ్రస్థానం.
Also read: దాశరథి – కవితా పయోనిథి
సకల పురుషార్థాలు ప్రతిఫలించాయి
ఈ మహాకావ్య సృష్టికర్త వ్యాసమహర్షి నిరూపించదలచిన పురుషార్ధాలన్నింటినీ కవిత్రయం తమ రచనలో నెరవేర్చారు. సంస్కృత రచనకు చేసిన అనువాదమే అయినప్పటికీ, మక్కికి మక్కి అనువాదంలా కాకుండా సృజనశీలతతో సాగిన గొప్ప పునఃసృష్టిని మన కవిత్రయం చేశారు. అందుకే ‘ఆంధ్ర మహా భారతం’ అనువాదం కాదు, అనుసృజన… అనే గొప్ప పేరు సాహిత్య ప్రపంచంలో వచ్చింది. దీనికి కూడా ఆద్యుడుగా నిలచినవాడు నన్నయ్య. రాజరాజ నరేంద్రుడు చంద్రవంశానికి చెందిన రాజు. అతను కూడా దాయదుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. దానికి తోడు మత ఘర్షణలు కూడా రాజ్యమేలుతున్న కాలమది. వైదిక ధర్మాన్ని అచంచలంగా ప్రతిష్ఠ చేయాలని రాజరాజు సంకల్పం చేసుకున్నాడు. ప్రజల భాషలో, స్థానిక భాషలో రచనలు జరిగితే ఎక్కువమందికి చేరుతుందనే ఆలోచన కూడా ఉంది. ముఖ్యంగా చాళుక్యులు తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి, ప్రచారానికి పెద్దపీట వేసిన పాలకులు. రాజ రాజు కూడా పూర్వుల బాటలోనే నడిచాడు. కౌరవపాండవులు కూడా చంద్రవంశపు సార్వభౌములు. తమ వంశ పూర్వులకు చెందిన భారత కథలను తెలుగులో వినాలని, వినిపించాలని, తద్వారా ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని అనుకున్నాడు. అలా.. తెలుగులో మహాభారతం పుట్టింది. రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేకం 1022 ప్రాంతంలో జరిగినా, ఆంధ్రమహాభారత అవతరణ అదే సంవత్సరంలో జరిగినట్లు పెద్దగా ఆధారాలు లభించడం లేదు. సుమారు 1054-1061 సంవత్సరాల మధ్యలో భారత రచనకు నన్నయ శ్రీకారం చుట్టిఉండవచ్చునని కొన్ని రచనల ద్వారా పండితులు అంచనా వేస్తున్నారు.
Also read: ద్రౌపది ముర్ము, మేడమ్ ప్రెసిడెంట్
రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేకం
నిజానికి విమలాదిత్యుని తర్వాత రాజరాజు క్రీస్తు శకం 1019లోనే రాజుగా సింహాసనాన్ని అధిరోహించినట్లు తెలుస్తోంది. సోదరుడు విజయాదిత్యుడి కర్ణాటక (పశ్చిమ) చాళుక్యుల సహకారంతో రాజరాజుపై దాడి చేశాడు. మేనమామ రాజేంద్ర చోళుని సహాయంతో విజయాదిత్యుడిని ఓడించి, మేనమామ కూతురిని పెళ్లిచేసుకొని, క్రీ.శ 1022, ఆగస్టు 22వ తేదీన బెజవాడలో రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడు. సోదరుడు విజయాదిత్యుడు కర్ణాటక చాళుక్యుల సాయంతో మళ్ళీ రాజరాజపై యుద్ధం చేసి బెజవాడను ఆక్రమించుకున్నాడు.1035 ప్రాంతంలో చోళుల సహకారంతో మళ్ళీ బెజవాడను స్వాధీనం చేసుకుంటాడు. ఇలా రాజ్యాన్ని పోగొట్టుకోవడం, తిరిగి తెచ్చుకోవడం పలుసార్లు జరిగింది. క్రీ శ 1047 ప్రాంతంలో రాజధానిని రాజమహేంద్రవరంకు మార్చుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ చాళుక్యులతో జీవితకాలం మైత్రిని కుదుర్చుకున్నాడు. ఈ సంధిని సాధించడంలో నన్నయభట్టు రాయబారిగా వ్యవహరించాడు. ఆ సమయంలో, పశ్చిమ చాళుక్యులకు మంత్రిగా నారాయణభట్టు ఉండేవాడు. నన్నయ, నారాయణభట్టు సహాధ్యాయులు, ప్రాణస్నేహితులుకూడా. ఈ ఇరువురి స్నేహం రాజరాజ నరేంద్రుడి రాజ్యాన్ని కాపాడడానికి, ఆంధ్ర మహాభారత రచనకు కూడా ఎంతో ఉపయోగపడింది. సంస్కృత భారతాన్ని తెలుగులో అనువదించడం, ఆంధ్ర మహాకావ్య నిర్మాణంగా తీర్చిదిద్దడంలో నన్నయకు నారాయణభట్టు ఎంతగానో తోడు నిలిచాడు. ఇవన్నీ ఆంధ్రజాతి భాషా,సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, పరిపాలనా ప్రస్థానంలో మహోన్నతమైన మహోజ్వల ఘట్టాలు. రాజరాజ నరేంద్రుడికి నన్నయ కేవలం కులబ్రాహ్మణుడు కాడు, మహామంత్రి. ఇంకా చెప్పాలంటే సర్వము తాను అయినవాడు. నన్నయ కేవలం మహాకవి మాత్రమే కాదు, మహామనీషుడు, మహాపురుషుడు. సంస్కృతంలో వాల్మీకి ఎటువంటివాడో తెలుగులో నన్నయ అటువంటి వాడు. అందుకే ” ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి ” అని ‘ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అన్నాడు. తదనంతర తెలుగు మహాకవులందరినీ నన్నయతిక్కనలు అవేశించారు.
Also read: బైడెన్ పరపతి పడిపోతోంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించివలసిన కార్యక్రమం
నిజానికి ఈ మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ నిర్వహించి వుంటే బాగుండేది. ఇప్పుడైనా సమయం మించి పోలేదు. రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేకం జరిగిన ఆగస్టు 22 వ తేది నాడు బెజవాడ/విజయవాడలో ఉత్సవాలను జరుపవచ్చు. రాజమహేంద్రవరం, నన్నయకు అనుబంధంగా చెప్పుకొనే తణుకు మొదలైన చోట్ల కూడా నిర్వహించవచ్చు. గతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,సాంస్కృతిక శాఖ 1982-83 ప్రాంతంలో ‘నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలు’ వాడవాడలా ఘనంగా నిర్వహించింది. 1982-83 విద్యా సంవత్సరాన్ని ‘ నన్నయ సంవత్సరం’ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంలో రాజమహేంద్రవరంలో నన్నయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. భారతావతరణము -రూపకం, నన్నయ భట్టారకుడు – వచనం, నన్నయ వ్యాసపీఠము – ప్రత్యేక సంచికల ముద్రణ జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యమైంది. 18 పర్వాల ‘ఆంధ్రమహాభారతం’ ప్రతిపదార్ధ,తాత్పర్య, విశేషవ్యాఖ్యలతో పుస్తకాలుగా ప్రచురించాలనే మహాసంకల్పనికి కూడా అంకురార్పణ జరిగింది. చారిత్రకపరమైన అనేక అంశాలకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. తారీఖులు,దస్తావేజులను పక్కన బెట్టి, మంచి కార్యాన్ని ఎప్పుడైనా తలపెట్టవచ్చు.2012లో విశాఖపట్నంలో, శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం ‘ మహాభారతం – వెయ్యేళ్ళ పండుగ’ పేరుతో మహోత్సవం జరిపి, ఆ మహాకావ్యాన్ని, ఆ మహాకవులను తలచుకొని నీరాజనాలు పలికింది. 1982 మార్చిలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పోతన పంచశతాబ్ది’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొప్పరపు కవులకు నీరాజనంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘అవధాన సప్తాహం’ ఘనంగా జరిపింది.అప్పుడు వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాంస్కృతిక శాఖ ఆ బాధ్యతలను తలకెత్తుకుంది. ఇటువంటి ఉత్సవాలను ప్రభుత్వాలు నిర్వహించాలి.ప్రభుత్వాలకు, ఆ యా శాఖలకు, పాలకులకు మంచిపేరు వస్తుంది.
Also read: అవునా, క్లౌడ్ బరస్టా?