వోలేటి దివాకర్
రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశంలో ఏదో తెలియని అలజడి… ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మతోన్మాదం..అసహన పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, 13 రాజకీయ పార్టీలు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే మే 3 లోపు మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే …“సిద్ధంగా ఉండండి” అని “హిందూ సోదరులకు” పిలుపు ఇచ్చారు.
శ్రీరాముని దర్శనం కోసం జూన్ 5న అయోధ్యను సందర్శిస్తానని కూడా ప్రకటించడం గమనార్హం. లౌడ్‌స్పీకర్లు ‘ఆజాన్’ ప్రసారం చేయడం మతపరమైన సమస్య కంటే సామాజిక సమస్య అని పేర్కొన్న రాజ్ థాకరే, సమాజంలో శాంతికి భంగం కలగకూడదని అన్నారు, “అయితే లౌడ్ స్పీకర్ల వాడకం కొనసాగితే ప్రతిగా మసీదుల ముందు హనుమాన్ చాలీసా పఠిస్తాం’’ అని హెచ్చరించారు.
మే 3లోగా మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాలని, “మసీదుల పైన లౌడ్ స్పీకర్లు పెట్టి రోజుకు ఐదుసార్లు ఆజాన్ ను ప్రసారం చేయాలనుకుంటే, రంజాన్ తర్వాత మసీదుల ముందు ఐదుసార్లు ‘హనుమాన్ చాలీసా’ చదువుతామని స్పష్టం చేశారు. మొన్నటి వరకు మౌనంగా ఉన్న రాజ్ థాక్రే తాజా ప్రకటనతో దేశంలో ముఖ్యంగా సున్నితమైన దేశ ఆర్థిక రాజధాని ముంబయ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.