- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీనిలో తమిళనాడు తీరానికి దగ్గరలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం విలీనమై శ్రీలంక నుంచి తమిళనాడు వరకు అతిపెద్ద ఆవర్తనంగా మారింది.
ఈ ప్రభావంతో ఈనెల 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అనేక చోట్ల వర్షం పడింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రంలో బుధవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 35.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది