- రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ
- కౌలు రైతులకూ, భూములు లేని రైతులకూ నగదు సాయం
- నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించేవారిపైన కఠిన చర్యలు
టీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు కల్ల అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎవరైనా నాయకులు ఎంత పెద్దవారైనా సరే టీఆర్ఎస్ తో పొత్తుగురించి మాట్లాడితే వారు టీఆర్ఎస్ లో చేరవచ్చుననీ, లేకపోతే బీజేపీలోకి వెళ్ళవచ్చుననీ రాహుల్ అన్నారు.
వరంగల్లులో గురువారం జరిగిన పెద్ద బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రైతులపై వరాలు కురిపించారు. రెండు లక్షల రూపాయల వరకూ రుణాలను మాఫ్ చేస్తామనీ, కౌలు రైతులకు రూ. 15 వేలూ, భూములు లేని రైతులకు రూ. 12 వేలూ చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. నకిలీ వంగడాలూ, ఎరువులూ సరఫరా చేసేవారిపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకొని వారిని జైలుకు పంపుతామని చెప్పారు.
బీజేపీకి తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే విశ్వాసం లేదనీ, అందుకే టీఆర్ఎస్ తో పరోక్ష ఒప్పందం కుదుర్చుకున్నదనీ, టీఆర్ఎస్ విజయానికి కావలసిన సహకారం అందిస్తుందనీ అన్నారు. లేకపోతే తెలంగాణను ఎనిమిదేళ్ళుగా దోచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపైన ఈడీని కానీ సీబీఐని కానీ ఎందుకు ప్రయోగించలేదని రాహుల్ అడిగారు. తెలంగాణను దోచుకున్న దొంగ పేరేమిటంటూ సభికులను ఒకటికి రెండు సార్లు రాహుల్ రెట్టించి అడిగారు.
తెలంగాణ ఏ ఒక్కరి వల్లా రాలేదనీ, అందరి త్యాగాల వల్ల వచ్చిందనీ, తెలంగాణ ప్రజల వ్యథను అర్థం చేసుకొని సోనియాగాంధీ ఇచ్చారనీ రాహుల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మంజూరు చేయడం వెనుక ఒక స్వప్నం ఉన్నది, అది సాకారం కాలేలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల స్వప్నం సాకారం అవుతుందని రాహుల్ అన్నారు. ఎంత సీనియర్లు అయినా, ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేసినవారికి మాత్రమే ఎన్నికలలో పోటీ చేయడానికి టిక్కెట్టు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్లు డిక్లరేషన్ ను చదివి వినిపించారు. రైతులకోసం కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేస్తుందో వివరించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, సీఎల్ పీ నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడారు.