- రాహుల్ పర్యటనను ప్రశంసించిన మణిపూర్ బీజేపీ అధ్యక్షురాలు
- సహాయ శిబిరాలలో సౌకర్యాలు మెరుగు పరచాలని రాహుల్ విజ్ఞప్తి
కల్లోలసాగరమైన మణిపూర్ ను సందర్శించినందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు అధికరమయూం శారదాదేవి అభినందించారు. ‘‘ప్రస్తుత పరిస్థితిలో మణిపూర్ ను సందర్శించినందుకు రాహుల్ గాంధీని అభినందిస్తున్నాను. అయితే, అందరి దృష్టీ ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించడంపైనే ఉండాలి. దీన్ని రాజకీయం చేయరాదు’’అని శారదాదేవి ఏఎన్ఐ వార్తాసంస్థకు శనివారంనాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కేంద్ర మంత్రి ఒకరు ‘రాహుల్ గాంధీ ఫొటోలు దిగి ఆనందించారనుకుంటా’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రవక్త ఒకరు ‘రాహుల్ కి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు.
రెండు రోజులు మణిపూర్ పర్యటనలో రాహుల్ గాంధీ చురచంద్ పూర్ జిల్లాలోని సహాయక శిబిరాలను సందర్శించారు. అదే విధంగా బిష్ణుపూర్ జిల్లాలోని మెయిరంగ్ లో శిబిరాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నవారిని పరామర్శించారు. ఆ తర్వాత పౌరసమాజం ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం మణిపూర్ గవర్నర్ అనసూయా ఊకేను కలుసుకున్నారు.
అయితే, మణిపూర్ లో ఇప్పుడు రాజకీయ నాయకుల సందర్శనలు అక్కరలేదనీ, దయ, మానవత్వం అవసరమనీ అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పర్యటనను ‘మీడియా హైప్’ అంటూ శర్మ విమర్శించారు.
హింస ద్వారా ఏమీ సాధించలేరనీ, శాంతి బాట పట్టాలని మణిపూర్ ప్రజలకు రాహుల్ గాంధీ ఉద్బోధించారు. గురువారం ఉదయం ఇంఫాల్ లో దిగి హింసాకాండ జరిగిన ప్రాంతానికి కారులో వెడుతున్న రాహుల్ ను భద్రతాదళాలు నిలువరించాయి. కావాలంటే ఇంఫాల్ నుంచి హెలికాప్టర్ లో వెళ్లవచ్చనని వారు చెప్పారు. అదే విధంగా రాహుల్ ఇంఫాల్ కు తిరిగి వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ లో గురుచంద్ పూర్ జిల్లాలో సహాయశిబిరాలకు వెళ్ళారు. గురువారం రాత్రి ఇంఫాల్ కు తిరిగి వచ్చి తిరిగి శుక్రవారం ఉదయం హెలికాప్టర్ లో మొయిరంగ్ కు వెళ్ళారు. రెండు శిబిరాలలో మైటీలనూ, కుకీలనూ కలుసుకొని పరామర్శించారు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఒక్రామ్ ఇబోబీ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు కీషం మేఘచంద్ర సింగ్, మాజీ ఎంపి అజయ్ సింగ్ రాహుల్ వెంట ఉన్నారు.
హింసాకాండలో కష్టాలు అనుభవించినవారి మాటలు వినడానికి బాధకలిగిందనీ, తాను కలుసుకున్న ప్రతి సోదరుడూ, సోదరీ, చిన్నారి సహాయంకోసం అడిగారని రాహుల్ ఒక సందేశంలో అన్నారు. హింసాకాండ విషాదభరితమనీ, ఇది మణిపూర్ ప్రజలకూ, దేశప్రజలకూ బాధాకరమనీ, సహాయ శిబిరాలలో వసతులను మరింత పెంచవలసిన అవసరం ఉన్నదనీ రాహుల్ అన్నారు. మణిపూర్ హింసాకాండపైన ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకూ ఒక్క మాటైనా మాట్లాడకపోవడంపైన వ్యాఖ్యానించవలసిందిగా ఒక విలేఖరి అడగగా,తాను రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడానికి ఇక్కడికి రాలేదనీ, ఎవరిపైనా తాను వ్యాఖ్యానించబోననీ రాహుల్ అన్నారు.
మణిపూర్ లో మెజారిటీ వర్గమైన మైటీలకు ఆదివాసీల హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు చెప్పిన దరిమిలా మే మొదటివారంలో ఆ రాష్ట్రంలో మైనారిటీ వర్గమైక కుకీలు ఆందోళన ప్రారంభించారు. ఈ కారణంగా జరిగిన హింసాకాండలో వందమందికిపైగా మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు.