Sunday, December 22, 2024

మోదీకి ఎట్టకేలకు చురుక్కుమనిపించిన రాహుల్

రాష్ట్రపతి ప్రసంగంపైన ప్రధాని నరేంద్రమోదీ కిందటివారం లోక్ సభలోనూ, మంగళవారంనాడు రాజ్యసభలోనూ మాట్లాడారు. పోయినవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని ఖండఖండాలుగా చీల్చి పోగులు పెట్టారు మోదీ. ఈ పని ఆయన ఎనిమిదేళ్ళుగా చేస్తూనే ఉన్నారు. ఇందులో కొత్త కానీ, వింతకానీ ఏమీ లేదు. రెండో సారి విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పైన దాడిని ఉధృతం చేశారు. కానీ రాహుల్ గాంధీ పదిహేనేళ్ళకు పైగా లోక్ సభలో ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా ప్రసంగించిన సందర్భాలు తక్కువ. ముఖ్యంగా కడచిన ఏడున్నర సంవత్సరాలలో ప్రధానిని కలవరపెట్టిన సందర్భం లేదు. మొన్ననే మొట్టమొదటి సారి బాగా మాట్లాడారు. సరైన అధ్యయనం చేశారు. తెలుసుకున్న విషయాలు సమర్థంగా, ప్రభావవంతంగా లోక్ సభకు నివేదించారు.

కాంగ్రెస్ గురించి విన్నవే, ఉన్నవే మోదీ చెప్పారు

రాహుల్ ప్రసంగ ప్రభావం మోదీపైన ఉంది. కానీ రాహుల్ లేవనెత్తిన అంశాలకు, సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ప్రధాని నేరుగా చెప్పలేదు. ఇంతకు ముందు విన్న విషయాలే, ఉన్న విషయాలే కాంగ్రెస్ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీజీ అన్నారనీ, వంశపాలనలో విశ్వాసం ఉన్న పార్టీ కాంగ్రెస్ అనీ పాత విషయాలే పునరుద్ఘాటించారు. పైగా మొదటి విడత కరోనా వచ్చినప్పుడు తాను దేశమంతటా పరిమితులు విధిస్తే, ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  సూచిస్తే కాంగ్రెస్ నాయకులు, ఆప్ నాయకులు  మాత్రం వలస కార్మికులకు రైలు టిక్కెట్లు ఉచితంగా పంచడం ద్వారా వ్యాధివ్యాప్తికి దోహదం చేశారంటూ కొత్త ఆరోపణ చేశారు. ఈ ఆరోపణకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీవద్రా సమాధానాలు ఇచ్చారు. మోదీ అసత్యం చెబుతున్నారనీ, ప్రజల కష్టాలతో రాజకీయం చేయడం ప్రధాని పదవిలో ఉన్నవారికి భావ్యం కాదనీ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని వలస కార్మికులను గాలికి వదిలేశారు కనుక మరెవ్వరూ వారిని ఆదుకోకూడదని ప్రధానిఉద్దేశమా? అంటూ ప్రియాంక ప్రశ్నించారు. కోవిద్ రెండో దఫా తీవ్రంగా వ్యాపించిన సందర్భంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల సమావేశాలు పెట్టింది ఎవరని కూడా ప్రియాంక ప్రశ్నించారు. ‘ఎక్కడ చూస్తే అక్కడ జనం. జనాన్ని చూస్తే నా మనసు పొంగిపోతోంది,’ అంటూ ప్రధాని మాట్లాడిన సమయంలో దేశవ్యాప్తంగా కోవిద్ రెండో తరంగం ప్రజలను గడగడలాడిస్తున్నదని ఆమె గుర్తు చేశారు.

రెండు భారతాలు

బెంజామిన్ డిజ్రాయిలీ పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థంలో బ్రటిన్ లో ప్రధానిగా,ప్రతిపక్ష నేతగా పని చేసిన రాజనీతిజ్ఞుడు. అప్పటి రోజుల్లో ఆయన  ఇంగ్లండలో రెండు దేశాలు ఉన్నాయనీ, ఒకటి సంపన్న దేశమనీ, రెండోది కటికపేద దేశమనీ అన్నారు. అదే బాటలో రాహుల్ ప్రసంగం సాగింది. రెండు భారతాలు ఉన్నాయనీ, సంపన్న భారతం ఒకటి కాగా, నిరుపేద భారతం రెండోదని అన్నారు. దేశంలో 98 మంది వ్యక్తుల దగ్గర ఉన్న సంపద 55కోట్ల మంది భారతీయుల దగ్గర ఎంత సంపద ఉన్నదో అంత ఉన్నదని అంకెలు చెప్పారు. 144 మంది బిలియనీర్లు (వందకోట్ల కంటే మించిన స్థితిమంతులు) మోదీ పాలనలో తమ సంపదరను రెట్టింపు చేసుకున్నారని (23లక్షల కోట్ల రూపాయల నుంచి 56 లక్షల కోట్ల రూపాయల వరకు) రాహుల్ అన్నారు. మరో వైపు ప్రపంచ  ఆకటి సూచికలో భారత్ 101వ స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి పొరుగుదేశాల కంటే అడుగున ఉన్నదనీ రాహుల్ గుర్తు చేశారు.

కోవిద్ బాధలనూ, వలస కార్మికుల కష్టాలనూ, ఆక్సిజన్ లేక సంభవించిన మరణాలనూ, గంగానదిలో తేలియాడిన కోవిద్ మృతదేహాలనూ రాహుల్ ప్రస్తావించారు. ఇవన్నీ ఇటీవల జరిగిన దుర్ఘటనలు. ప్రజలు త్వరగానే మరచిపోతారనే నానుడి ఉన్నది. నిజమే. ఇవి మరీ ఇటీవల జరిగిన హృదయవిదారకమైన ఘటనలు. వీటిని ప్రజలు మరచిపోయారని మోదీ భావిస్తే పొరపాటు అవుతుంది.

రాహుల్ గాంధీ మాట్లాడినవన్నీ వాస్తవాలే. ప్రభుత్వానికీ, అధికారపార్టీకి రుచించకపోవడంలో వింత లేదు. మోదీ కొన్ని వాస్తవాలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి ఒక సేవా సంస్థను నిర్మించాలని మహాత్మాగాంధీ అనుకున్న మాట వాస్తవమే. కానీ గాందీ కలలో కూడా హిందూత్వవాద ప్రభుత్వం ఒక రోజు అధికారంలోకి వస్తుందని కానీ, ముస్లిలను ద్వితీయ స్థాయి పౌరులుగా పరిగణించే పరిస్థితులు దాపురిస్తాయని కానీ ఊహించి ఉండరు. కాంగ్రెస్ పార్టీ వంశపాలనలో విశ్వాసం ఉన్న పార్టీ అనడంలో సందేహం లేదు. కానీ మోదీ మాత్రం వంశపాలనలో విశ్వాసం ఉన్న అకాలీదళ్ తోనూ, శివసేనతోనూ పొత్తు పెట్టుకోలేదా?

తమిళనాడు ఉదాహరణ మాత్రమే

మోదీ హయాంలో రాష్ట్రాలహక్కులను హరిస్తున్నారని వాదిస్తూ తమిళనాడును ఒక ఉదాహరణగా రాహుల్ తీసుకున్నారు. దాన్ని కేంద్రంపైకి రాష్ట్రాలను దాడికి సమాయత్తం చేయడంగా ప్రధాని అభివర్ణించారు. నిజమే, రాష్ట్రాల హక్కులను హరించడంలో కాంగ్రెస్ పాత్ర ఏమీ ప్రశంసనీయమైనది కాదు. చీటికీమాటికీ రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసేందుకు 356 వ అధికరణను ఉపయోగించిన చెత్తచరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రద్దుల పద్దు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండగానే1955లో కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని పడగొట్టటంతో మొదలైంది. అప్పుడు ప్రధాని ఆమె తండ్రి, నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ. అప్పటి నుంచి తమకు అడ్డంగా ఉన్న, ఇష్టం లేని ప్రభుత్వాలను నిష్కారణంగా కూల్చివేస్తూ వచ్చారు. 1984లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టిరామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ సహకారంతోనే కూల్చివేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకోసం తీవ్రమైన ఉద్యమం జరిగిన తర్వాత నెలరోజులకు అదే ఎన్ టి ఆర్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించారు.  ఈ లోగా బొమ్మయ్ (ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తండ్రి) కేసు సుప్రీంకోర్టులో వచ్చింది. అనంతరం సర్కారియా కమిషన్ వచ్చింది. ఫలితంగా 356వ అధికరణ వినియోగించడం బాగా తగ్గిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ ను విమర్శించడంలో తప్పులేదు. కానీ ఏకంగా రాష్ట్రప్రభుత్వాలనే ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ, మణిపూర్, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ టిక్కెట్టుపైన గెలిచినవారినీ, ఇతర పార్టీల టిక్కెట్ల పైన గెలిచినవారినీ కొనుగోలు చేసి తాము మైనారిటీగా ఉన్న రాష్ట్రాలలోప్రభుత్వాలను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి కానీ దాని తిరుగులేని నాయకుడు మోదీకి కానీ రాష్ట్రాల హక్కుల గురించి, హక్కుల హననం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఆ మాటకు వస్తే పూర్వ ప్రధాని వాజపేయికి ఆ హక్కు ఉన్నది. ఎందుకంటే, 1999లో జయలలిత మద్దతు ఉపసంహరించుకుంటే విశ్వాస తీర్మానం ఒక్క వోటుతో ఓడిపోతుందని కూడా తెలిసి వాజపేయి ఒక్కరిని కూడా పార్టీ ఫిరాయించి తనప్రభుత్వాన్ని కాపాడాలని కోరలేదు. ఒక్క ఓటుతోనే ఓడిపోయారు. తర్వాత జరిగిన ఎన్నికలలో మళ్ళీ అతిపెద్ద  పార్టీగా బీజేపీ అవతరించింది. వాజపేయి నేతృత్వంలో ఎన్ డిఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ విధంగా నీతి, నియమం పాటించిన వాజపేయికి రాష్ట్రాల స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడటానికీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి నైతిక హక్కు ఉంటుంది. కానీ మోదీకి ఉండదు. పీవీ నరసింహారావుకు కూడా ఉండేది కాదు.

కృష్ణ, గోదావరి నదుల స్వాధీనం తాజా ఉదంతం

మోదీకి అటువంటి హక్కు ఉండదనడానికి కృష్ణ, గోదావరి నదుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తాజా ఉదాహరణ. ఈ రెండు నదుల నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత దానికి స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించేందుకు బ్రజేష్ ట్రిబ్యూనల్ అంగీకరించడం లేదు. బచావత్ అవార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎంత నీరు కేటాయించిందో దానినే రెండు రాష్ట్రాలూ పంచుకోవాలని బ్రజేష్ ట్రిబ్యూనల్ చెబుతోంది. ఆ ట్రిబ్యూనల్ ఏర్పడి కూడా 17 సంవత్సరాలు దాటుతోంది. కొత్త ట్రిబ్యూనల్ ను నియమించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కొత్త ట్రిబ్యూనల్ ను నియమించడమో, రెండు తెలుగు రాష్ట్రాలమద్య వివాదాన్ని పరిష్కరించడమో కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఆ పని చేయకుండా ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణ, గోదావరి నదులూ, వాటిపైన నిర్మించిన ప్రాజెక్టులూ, జలవిద్యత్తు ప్రాజెక్టులూ, వాహనాలు వగైరాలన్నీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందట. కృష్ణానది ప్రవహిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మాత్రం ఇటువంటి గెజెట్ నోటిఫికేషన్ లేదు. రెండు రాష్ట్రాలలో నదులు స్వాధీనం చేసుకోవడం, మరి రెండు  రాష్ట్రాలలో  ఆ పని చేయకపోవడం వివక్ష. అసలు నదులు స్వాధీనం చేసుకోవడమే శుద్ద తప్పు. నదులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్రానికి లేదు. లేని అధికారాలను ఉపయోగించి అన్ని రంగాలలోనూ కేంద్రీకృత  వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి వీలు చిక్కినప్పుడల్లా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వానికి రాష్ట్రాల హక్కువ విషయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఏ మాత్రం లేదు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles