Tuesday, January 21, 2025

లఖింపూర్ లో బాధితులను ఆలింగనం చేసుకున్న రాహుల్, ప్రియాంక

  • గుర్విందర్ సింగ్ శవం రెండె ఆటోప్సీలోనూ బుల్లెట్ ప్రస్తావన లేదు
  • మంత్రి కుమారుడు పేల్చిన తూటా గుర్విందర్ నుదుటిన తాకిందంటున్న తల్లిదండ్రులు
  • మృతి చెందిన నలుగురు రైతుల శవాలకు అంత్యక్రియలు
  • రాకేష్ తికాయత్ వ్యవహారంపైన అనుమానాలు

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. శనివారంనాడు లఖింపూర్ లో జరిగిన ఘటనలో మరణించిన నలుగురు రైతుల మృతదేహాలకూ బుధవారం అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాతనే లఖింపూర్ వెళ్ళడానికి రాహుల్ గాంధీనీ, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నూ, పంజాబ్ ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ చన్నీనీ అనుమతించారు. లక్నో విమానాశ్రయంలో రాహుల్ బృందం దిగిన తర్వాత వారు పోలీసు వాహనాలను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు పట్టుపట్టారు. ఇందుకు నిరసనగా రాహుల్ కొంతసేపు ధర్నా చేశారు. చివరికి ప్రవేటు వాహనాలలో బయలుదేరి రాహుల్ ముందు సితాపూర్ లో గృహనిర్బంధంలో ఉన్న ప్రియాంక దగ్గరికి వెళ్ళారు. ఆమె లఖింపూర్ వెళ్ళడానికి బయలుదేరినప్పుడు పోలీసులు అరెస్టు చేసి ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ లో నిర్బంధంలో సోమవారం నుంచి ఉంచారు. చివరికి ఆమెను పోలీసులు విడుదల చేశారు.

బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న రాహుల్, ప్రియాంక

రాహుల్, ప్రియాంకా కలిసి పాలియా గ్రామానికి వెళ్ళి మరణించిన రైతుల కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించారు. వారిని ఆలింగనం చేసుకొని ఓదార్చారు. తనను అరెస్టు చేశారు కానీ ప్రజలమీదుగా కారు నడిపిన మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అషీష్ మిశ్రాను మాత్రం పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేయలేదంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు. అషిష్ మిశ్రాను అరెస్టు చేసి, ప్రశ్నిస్తారా అని పోలీసులను విలేఖరులు అడిగితే వారు  స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందనీ, ఇక దర్యాప్తు వేగవంతం అవుతుందని మాత్రమే వారు చెప్పారు. పోలీసులు దాఖలు చేసిన మొదటి ఎఫ్ఐఆర్ లో అషిష్ మిశ్రాపైనా, మరికొందరి పైగా హత్యానేరం కింద ఆరోపణలు ఉన్నాయి. నిన్న రెండో సారి గుర్విందర్ సింగ్ శవానికి ఆటోప్సీ చేసిన తర్వాత దాఖలైన రెండో ఎఫ్ఐఆర్ లో మంత్రి కుమారుడి పేరు తొలగించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులపైన అభియోగం మోపుతూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అషిష్  పిస్తోలు నుంచి వచ్చిన తూటా గుర్విందర్ సింగ్ నుదుటిపైన తాకిందనీ, అక్కడున్న గాయాన్ని ఆటోప్సీ రిపోర్టులో రెండు సార్లూ పేర్కొనలేదనీ, ఇది మంత్రి కుమారుడిని రక్షించేందుకేననీ మృతి చెందిన రైతు కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఈలోగా రైతు నాయకడు, కిసాన్ ముక్తిమోర్చా అధినేత, భారతీయ కిసాన్ యూనియన్ సారథి రాకేష్ తికాయత్ వ్యవహార శైలిపట్ల కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. తికాయత్ ఇంతవరకూ మంత్రి కుమారుడిని అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేయలేదనీ, మృతి చెందిన రైతుల కుటుంబాలకు అధికమొత్తంలో పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నించారు కానీ మంత్రి కుమారుడి జోలికి మాత్రం వెళ్ళలేదనీ, తికాయిత్ బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయనీ కొందరు అన్నారు. అటువంటిదేమీ లేదనీ, టికాయత్ చాలా సమర్థంగా పరిస్థితి ఆకళింపు చేసుకొని స్పందించారనీ, ఆయన కారణంగానే రైతు ఉద్యమం పట్టాలమీద ఉన్నదనీ, ఆయన రైతులకు తిరుగులేని నాయకుడిగా ఎదిగారనీ మరి కొందరు వాదిస్తున్నారు. తికాయత్, పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్ కుమార్ (లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్)తో కలిసి మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొనడం తప్పుడు సంకేతాలు పంపిందని అంటున్నవారు కూడా ఉన్నారు. మొత్తం మీద తియాకత్ పట్ల మోదీ  ప్రభుత్వం, యోగీ ప్రభుత్వం కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నాయనే పరిశీలకుల అభిప్రాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles