కమల్ నోటిదూల కాంగ్రెస్ కు భారం అవుతుందా?
స్టాలిన్ తో సత్సంబంధాలు ఉన్నప్పుడు కమల్ తో ఏమి పని?
కాంగ్రెస్ ముఖ్యనేత, నెహ్రూ వారసుడు రాహుల్ గాంధీ -సుప్రసిద్ధ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ భేటీ అయ్యారు. ఇంతకు ముందుగా రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొని కలిసి నడిచారు. రాజకీయాల్లో, రేపటి ఎన్నికల్లో కలిసి నడుస్తారో లేదో ఇప్పుడే చెప్పలేం. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఇద్దరూ ఇంతవరకూ పెద్దగా రాణించలేదు. కమల్ తో పోల్చుకుంటే రాహుల్ గాంధీ చాలా మెరుగు. కేరళలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి లోక్ సభకు గెలిచిన చరిత్ర ఉంది. అంతకంటే బలమైన రాజకీయ వారసత్వం వుంది. వయస్సు ఉంది. కాకపోతే ఇంకా బాగా రాణించాల్సి వుంది. రాజకీయాల్లో రాటు తేలాల్సివుంది. రాహుల్ గాంధీతో వ్యక్తిగతంగా పరిచయం వున్నవారు మాత్రం చాలా మంచివ్యక్తని చెబుతారు. గతంలో ఎలా ఉన్నా భారత్ జోడో యాత్రతో కాస్త ఆకర్షణ పెరిగింది. అనుభవం కూడా వస్తోందిఈ రెండుమూడు సంవత్సరాల్లో కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు తనలోని పరిణితిని చూపిస్తున్నాయంటూ కొందరు మేధావులు, సీనియర్ జర్నలిస్టులు రాహుల్ పై ప్రశంసలు కూడా కురిపించారు. నరేంద్రమోదీ – అమిత్ షా ద్వయంలోని ఏలుబడి, వ్యవహారశైలి, బిజెపి సిద్ధాంతాల తీరు వల్ల రాహుల్ తన తీరును కూడా మార్చుకొనే ప్రయత్నం కొంత చేస్తున్నారు. భారతదేశం ప్రధానంగా హిందువులు మెజారిటీగా కలిగిన దేశం. సోనియా క్రిస్టియన్ మతస్తురాలన్న విషయం తెలిసిందే.
Also read: కొత్త సంవత్సరంలో వాడిగా, వేడిగా రాజకీయం
హిందువునని అనిపించుకోవాలని రాహుల్ తాపత్రయం
జవహర్ లాల్ నెహ్రు కుటుంబం కశ్మీర్ పండితుల కుటుంబంగా లోకవిదితం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ఇటీవల దేవాలయాలను తరచూ దర్శనం చేసుకోవడం, జంద్యం వేసుకొని, విభూతి రేఖలు, బొట్టుపెట్టుకొని కనిపించడం మొదలైన విన్యాసాలు చేస్తున్నారు. ఇది ఫక్తు రాజకీయ అవసరంతో కూడిన వేషంగానే ఎక్కువమంది భావిస్తున్నారు. తాను కూడా హిందువేనని చెప్పడానికి బలంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 100% సెక్యూలర్ అని వివరించే యత్నం కూడా చేస్తున్నారు. రాజకీయ క్రీడలో ఇది చాలా సాధారణమైన అంశం. కాకపోతే మెజారిటీ ప్రజల మనసులను గెలుచుకోవడంలో రాహుల్ ఇంకా ఫలవంతమవ్వలేదు. హిందువుల విశ్వాసాన్ని పొందడంలో ఆమడదూరంలోనే ఉన్నారు. కాంగ్రెస్ మార్క్ సెక్యూలర్ విధానాన్ని బలంగా తీసుకెళ్లడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. భారత్ జోడో యాత్ర నడుస్తున్న క్రమంలో కొందరు సినిమావాళ్ళు కలిసి వెళ్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ఆ జాబితాలో చేరారు. వీరిద్దరికీ వ్యక్తిగతంగా పూర్వ పరిచయం వున్న సందర్భం లేదు. వీరిద్దరి తాజా కలయిక కాస్త ఆసక్తికరంగా ఉంది. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు బిజెపి, నరేంద్రమోదీ. తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ ఘోరంగా విఫలమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఒక్కసీటు కూడా దక్కించుకోలేక పోయారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇటీవల విడుదలైన ఒక సినిమా కమర్షియల్ గా బాగా హిట్ అయ్యింది. కమల్ ఇంకా ఆ కిక్కులోనే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ దగ్గరకు వచ్చారు.
Also read: కొత్త సంవత్సరం – కొత్త వెలుగులు
కమల్ రాజకీయాలలో రాణించాలంటే పరిణతి అవసరం
కమల్ హాసన్ పూర్తి నాస్తికుడు, హిందుత్వంపై, దేవతలపై, ఆచారవ్యవహారాలపై పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తూ సంచలన వార్తలకు బిందువుగా మారారు. ముఖ్యంగా బిజెపి విధానాలపై ప్రకాష్ రాజ్ వలె ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.”శత్రువు శత్రువు మిత్రుడు” అన్న సిద్ధాంతం ప్రకారం వీళ్లిద్దరూ ఒక చెట్టునీడ కిందకు చేరుకున్నారు. మహాత్మాగాంధీపై అభిమానం, చైనా, రష్యాతో భారత్ బంధాలు, అంతర్జాతీయ విధానాలు, సరిహద్దుల ఆక్రమణ, మన రణతంత్రం, దేశ భద్రతా విధానాలు మొదలైన వాటిల్లో రాహుల్ గాంధీ, కమల్ హాసన్ ఒకే పల్లవి పాడుతున్నారు. తమిళనాట ప్రస్తుతం అధికారంలో వున్న స్టాలిన్ ప్రభుత్వంతో, ఆ పార్టీతో కాంగ్రెస్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. స్టాలిన్ కూడా బిజెపి వ్యతిరేక శిబిరంలోనే ఉన్నారు. తమిళనాడులో కాంగ్రెస్ ను విస్తరించడానికి కమల్ హాసన్ తో కాంగ్రెస్ కు పెద్ద పనిలేదు. వీళ్లిద్దరూ కలిసి తిరగడం వల్ల దేశంలో అద్భుతాలు జరిగే అవకాశాలు లేవు. ఏదో టైమ్ పాస్ కబుర్లు, కాలక్షేపం తప్ప వీరిద్దరి కలయిక రాజకీయాల్లో చూపించబోయే ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. రాజకీయాలు ఎట్లా వున్నా కమల్ హాసన్ అద్భుతమైన నటుడు. నిజంగా రాణించాలనుకుంటే ఆయన చాలా పరిణితి చెందాల్సి వుంది. వ్యాఖ్యలు చేసేప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. రాహుల్ గాంధీ కూడా తన నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం వుంది.
Also read: దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డడే!