- కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- ప్రజాస్వామ్యాన్ని మోడీ అపహాస్యం చేస్తున్నారని ఆరోపణ
- రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని రాహుల్ హామీ
ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేపట్టారు. అయితే వీరందరినీ ఏఐసీసీ కార్యాలయం ఎదుటే పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే రాష్ట్రపతి భవన్ కు వెళ్లనిస్తామని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ నేతలు ఎంత చెప్పినా ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో ప్రియాంక గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. మోడీ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలకు, రైతులకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదని ప్రియాంక గాంధీ విమర్శలు కురిపించారు.
రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన రాహుల్
అదే సమయంలో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రెండు కోట్ల సంతకాల డాక్యుమెంట్లతో పాటు వినతి పత్రాన్ని రాహుల్ గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ అజాద్ లు రాష్టపతికి అందజేశారు.
మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాహుల్
ఈ సందర్భంగా రాహుల్ మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు కురిపించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మోడీని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న రాహుల్ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినవారిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండి పడ్డారు. మోడీ అనుయాయులైన కొంతమంది బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని మోడీ ఆరోపించారు.
ఇదీ చదవండి: ఉధృతంగా రైతుల నిరశన దీక్ష