వోలేటి దివాకర్
మార్గదర్శి చిట్ ఫండ్స్, డిపాజిట్ల సేకరణ ద్వారా రామోజీరావు ఆదాయం రోజుకు సుమారు రూ. 10 కోట్లు ఉంటుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇందులో నల్ల ధనం కూడా ఉండవచ్చని అనుమానం ఉందనీ, అందుకే డిపాజిటర్ల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నామనీ అన్నారు. నల్ల ధనం తెల్లధనం సమస్యలు ఉండవన్న ఉద్దేశంతోనే ఎంతో మంది ధనికులు ఆయన వద్ద డిపాజిట్లు చేస్తుండవచ్చన్నారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మార్గదర్శి నిధులతోనే ఈనాడు పత్రిక, రామోజీ ఫిలింసిటీ వంటి ఇతర 30వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని, అందులో రామోజీరావు సొంత సొమ్ము కేవలం రూ. 2కోట్లు మాత్రమేనని, మిగిలిన సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి సేకరించినదేనన్నారు. చిట్ ఫండ్ వ్యాపారాలు చేసే వారు ఇతర వ్యాపారాలు చేయకూడదని 1993లోనే జస్టిస్ దయాళ్, జస్టిస్ వెంకటాచలయ్య ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. జూలై 18న మార్గదర్శిపై విచారణ సందర్భంగా అవిభాజ్య హిందూ కుటుంబం నిబంధన మార్గదర్శికి వర్తిస్తుందా లేదా అన్నది తేల్చాలని కోరతానని చెప్పారు.
Also read: జెఎస్పీ జెడిఎస్ అవుతుందా?….కాపులు లింగాయత్ లుగా మారతారా?
రామోజీకి… ఆదిరెడ్డికి తేడా ఏమిటి?
జగజ్జననీ చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను అరెస్టు చేశారని, అదే తరహా కేసులో రామోజీరావుపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. ఆయన చట్టాలకు అతీతులా అని నిలదీశారు. అలాగైతే వాటిని రద్దు చేయాలని రామోజీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. అయితే అరెస్టుల వల్ల ప్రయోజనం ఉండదని,ఆర్థిక నేరగాళ్ల ఆర్థిక మూలాలను నిర్మూలిస్తేనే ప్రజల సొమ్ములకు భద్రత ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క చిట్ ఫండ్ కంపెనీని కూడా నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదన్నారు.
అలాంటి వారిని అరెస్టు చేసి జైలుకు పంపినా జైలులో రాజభోగాలు అనుభవిస్తారని ఉండవల్లి ఆరోపించారు. మార్గదర్శి చిట్ ఫండ్ పైన సిఐడి సోదాలను ప్రభుత్వ కక్షగా ఆరోపిస్తున్నారని, అయితే ఈ సోదాలు, విచారణల్లో పాల్గొన్న ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేకపోయారని, అంటే మార్గదర్శిలో తప్పులు జరుగుతున్నట్టేనని అనుకోవలసి వస్తుందని విశ్లేషించారు. చిట్ ఫండ్ కంపెనీల్లో అవకతవకలను గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సిఫార్సుల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also read: ఏపీలో రూ.3500 కోట్ల స్కామ్ : సోమ్ వీర్రాజు
మార్గదర్శి వ్యవహారంపై టీడీపీ తరపున అపార్టీ జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డితో చర్చ జరిగివుంటే బాగుండేదని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఈ అంశంపై జివి రెడ్డి చర్చకు వస్తాననడం, తాను సిద్ధం కావడం, తర్వాత ఎందుకో చర్చకు రావడం లేదని జీవిరెడ్డి సమాచారం అందించారన్నారు.
ఆదాయపుపన్ను వంటి మొత్తం 56 రకాల పన్నులను రద్దు చేసి, అర్థక్రాంతి పథకం కింద లావాదేవీల పన్ను ఒక్కటీ పకడ్బందీగా అమలు చేస్తే చాలని, దీని ద్వారా ప్రస్తుత ఆదాయం రెట్టింపు ఆదాయం లభిస్తుందన్నారు. ప్రస్తుత పన్నుల విధానం ప్రభుత్వాలు ప్రత్యర్థులను బెదిరింపులు, వేధించేందుకు ఉపయోగపడుతున్నాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
రాహుల్ లో ఎంత మార్పు… భావి భారత నేత ఆయనే!
ఇటీవల సుప్రీంకోర్టు విచారణకు డిల్లీ వెళ్లిన సందర్భంలో విమానంలో యువనేత రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించే అవకాశం లభించిందని ఉండవల్లి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియాగాంధీలకు అనువాదకుడిగా పనిచేశానని, తనను గుర్తు పట్టారా అని ప్రశ్నించగా ఎలా మర్చిపోతానని చెబుతూ… తన పక్కన వచ్చి కూర్చుని, సెల్ఫీ దిగారని ఉండవల్లి వెల్లడించారు. ‘భారత్ జోడో యాత్ర’ తరువాత రాహుల్ గాంధీలో ఎంతో మార్పు, పరిణతి వచ్చిందన్నారు. ఎక్కడికక్కడ ప్రజలతో కలిసిపోతున్నారన్నారు. విమానంలో తోటి ప్రయాణీకుల లగేజీని కూడా స్వయంగా తీసి అందించారని చెప్పారు. తండ్రి రాజీవ్ గాంధీ తరహా కరిష్మా ఆయనలో ఉందని, దేశానికి భావి నాయకుడు రాహుల్ గాంధీయేనని ఉండవల్లి కితాబునిచ్చారు. కర్నాటక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ బలోపేతం కావడం భారతదేశ ప్రజాస్వామ్యానికి శుభ పరిణామమన్నారు. గాంధీల కుటుంబానికి అక్రమాస్తులను కూడబెట్టాల్సిన అవసరం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆ కుటుంబం అక్రమాస్తులను సంపాదించిందన్న ఆరోపణలను ఎవరూ నిరూపించలేరన్నారు.
Also read: ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం!