Sunday, December 22, 2024

రాహుల్ సావర్కర్ ప్రస్తావన అనవసరం, అనర్థం

రాహుల్ గాంధీ బీజేపీకి లభించిన వరమనీ, ఆయన బీజేపీకి బహుమతులు ఇస్తూ పోతూ ఉంటారనీ, ఫలితంగా బీజేపీ గెలుస్తూ పోతూ ఉంటుందనీ, కాంగ్రెస్ ఓడిపోతూ ఉంటుందని ప్రముఖ జర్నలిస్టు స్వాతీచతుర్వేది వ్యాఖ్యానించారు. ఇది వీర్ సావర్కర్ భీరువని నిరూపిస్తూ రాహుల్ గాంధీ మహారాష్ట్ర పర్యటన చివరి అంకంలో చేసిన వ్యాఖ్యాలపైన ఆమె స్పందన. ఆ వ్యాఖ్య మహా వికాస్ ఆఘాడీలో కాంగ్రెస్ భాగస్వామి అయిన శివసేనకు ఇబ్బంది కలిగించింది. సహజంగానే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంవారు సావర్కర్ ని సమర్థించారు. ఆయనను ఎండగట్టడాన్ని విమర్శించారు. ‘నాకు రాహుల్ గాంధీ అనే వ్యక్తితో రాజకీయ అనుబంధం ఏ మాత్రం లేదు’ అంటూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుండబద్దలు కొట్టారు. శివసేన, ఎన్ సీపీ, కాంగ్రెస్ ల  కూటమిని నిర్మించిన నేత ఆయన. ఈ వ్యాఖ్యా చేసినప్పుడు ప్రధాని విదేశాలలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని గుజరాత్ ప్రచారంలో సైతం ఉపయోగించుకుంటారన్ని ఊహాగానాలు సాగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ మోదీకి మరో బహుమతి అందించారు. అదే మంటి ఉద్యమకారిణి, నర్మదాబచావ్ ఆందోళన నిర్మాత మేథాపాట్కర్ భుజంపైన చేయివేసి నడిచారు. సావర్కర్ కంటే మేథాపాట్కర్ వివాదం గుజరాత్ లో బాగా పేలుతుందని మోదీకి తెలుసు. అందుకే ఆయన ఆదివారం రాజకోట్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ నర్మదా డ్యాంకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మేథాపాట్కర్ తో రాహుల్ చెట్టపట్టాలేసుకొని నడవడాన్ని విమర్శించారు. ‘ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ వారు వచ్చినప్పుడు నర్మదా డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకించిన మేథాపాట్కర్ భుజంపైన చేయివేసి మీ పార్టీ నాయకుడు నడిచినప్పుడు మీకు ఓట్లు ఎట్లా వేయాలని ప్రశ్నించండి,’’అంటూ ఎన్నికల సభలో మోదీ అన్నారు. ఏ అవకాశాన్నీ జారవిడుచుకునే రాజకీయ నాయకుడు కాదు మోదీ.

సావర్కర్ ప్రస్తావన అవసరమా?

నిజానికి రాహుల్ చేసింది తప్పుకాదు. వీర్ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటూ లేఖ రాసింది నిజమే. కానీ ఆయన జీవితంలో పోరాటం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. నౌకలోనుంచి తప్పించుకోవడానికి సాహసం చేసిన చరిత్ర సావర్కర్ ఉంది. సావర్కర్ లో హేతువాది ఉన్నాడు. సంస్కర్త ఉన్నాడు. అసలు ఇప్పుడ సావర్కర్ గురించి మాట్లాడటం అవసరమా? ఇది రాహుల్ గాంధీ ఆలోచించుకోవలసిన ప్రశ్న. అదే విధంగా మేథా పాట్కర్ నర్మదాడ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. నర్మదా నిర్వాసులకు పరిహారంకోసం, వారి పునరావాసం కోసం పోరాటం చేశారు. ఆమె ఉద్యమకారిణి. దేశంలోని ఉద్యమకారులలో చాలామంది రాహుల్ తో కలసి పాదయాత్ర చేస్తున్నారు. మేథాపాట్కర్ తో కలసి పాదయాత్ర చేయడంలో తప్పులేదు. కానీ గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్నాయనీ, ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టంలో ప్రవేశించదనీ, ఆమెతో కలసి నడిస్తే దాన్ని చూపించి తాను గుజరాత్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నానంటూ బీజేపీ నకారాత్మక ప్రచారం చేసే అవకాశం ఉన్నదనీ రాహుల్ తెలుసుకోవాలి. ఇటువంటి సున్నితమైన విషయాలు తెలుసుకోకపోతే నష్టం జరుగుతుంది. రాజకీయాలలో ఉన్నవారు, నాయకత్వ స్థానంలో ఉన్నవారు తమకు తోచినట్టు మాట్లాడతామంటే కుదరదు. నిజాన్ని నిర్భయంగా అన్నివేళలా చెబుతానంటే కుదరదు. కొన్ని నిజాలను చెప్పకపోతే నష్టం లేదు. చెబితేనే నష్టం, కష్టం. అటువంటి వాటిలో వీర్ సావర్కర్ సంగతి ఒకటి. సావర్కర్ ప్రస్తావన చేయడం ద్వారా మహారాష్ట్ర ప్రజలకు ఖేదం కలిగించడం వల్ల రాహుల్ గాంధీ బావుకునేది ఏమైనా ఉన్నదా? ఛత్రపతి శివాజీనీ, వీరసార్కర్ నూ స్మరించుకుంటూ వారి పేరుతో రాజకీయాలు చేసే సంస్కృతి ప్రబలిన మహారాష్ట్రంలో సావర్కర్ ని భీరుడని నిరూపించడం వల్ల రాహుల్ కి కానీ, కాంగ్రెస్ కి కానీ కలిగే అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? పైగా తాను పాదయాత్రలో రాజకీయాలు మాట్లాడననీ, కేవలం నఫ్రత్- ప్యార్, తోడో-జోడో గురించే మాట్లాడతాననీ చెప్పుకుంటూ వచ్చిన రాహుల్ గాంధీ సావర్కర్ విషయంలో నిగ్రహం కోల్పోవడం ఎందుకు?

శివసేన నాయకులు రాహుల్ ని విమర్శించక తప్పలేదు. బాల్ ఠాక్రే జీవిత పర్యంతం వీర్ సావర్కర్ సమర్థిస్తూ వచ్చారు. ఆయనకు సర్వోన్నత స్థానం కట్టబెట్టారు. అందువల్ల ఉద్దవ్ ఠాక్రే వర్గానికి రాహుల్ గాంధీని విమర్శించడం తప్పని సరి.  బాల్ ఠాక్రే జయంతి రాహుల్ మహారాష్ట్రలో  పాదయాత్ర చేస్తున్నప్పుడే వచ్చింది. భాగస్వామ్య పక్షానికి ఆరాధ్యుడైన ఠాక్రేకి శ్రద్ధాంజలి ఘటించడం రాహుల్ గాంధీ విధి. ఆ పని చేయలేదు.

పీవీకి మరోసారి అవమానం

తెలంగాణలో రాహుల్ పర్యటించిన సందర్భంగా కూడా ఇటువంటి ఘటనే సంభవించింది. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో మొదటి రోజున నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి వందనం చేశారు. ఆమె వర్థంతి సందర్భంగా నాయనమ్మకు నమస్కారం చేయడం విధాయకమే. ఇందిర విగ్రహానికి నాలుగు మీటర్ల దూరంలోనే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహం ఉన్నది. పీవీకి కూడా  రాహుల్ వందనం చేస్తారనీ, ఆ సమయంలో ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ విగ్రహం దగ్గర ఉంటే బాగుంటుందనీ పీసీసీ బాధ్యులు పీవీ కుమారుడిని అభ్యర్థించారు. సంకోచిస్తూనే ప్రభాకరరావు వెళ్ళారు. పీవీ విగ్రహం దగ్గర నిలబడి ఉన్నారు. రాహుల్ గాంధీ ఇందిర విగ్రహానికి మాల వేసి, నాలుగు మాటలు చెప్పి పీవీ విగ్రహంవైపు చూడకుండానే, మాజీ ప్రధాని గురించి ప్రస్తావించకుండానే వెళ్ళిపోయారు. నిరుడే శతసంవత్సర ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ సందర్భంగానే ఇందిరాగాంధీ విగ్రహం పక్కనే పీవీ విగ్రహం పెట్టారు. నిర్వాహకులు రాహుల్ గాంధీకి చెప్పలేదా, చెప్పినా రాహుల్ తనదైన ధోరణిలో ఖాతరు చేయలేదా అన్నది మనకు తెలియదు. ఇందిరాగాంధీ విగ్రహానికి పక్కనే పీవీ విగ్రహం ఉంటుందనీ, మాల వేయించి, దణ్ణం పెట్టించాలనీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలుకు ఒకటికి, రెండు సార్లు ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. ఆ విషయం రాహుల్ తో చెప్పడానికి సునీల్ కి అవకాశం వచ్చిందో, లేదో తెలియదు. మొత్తంమీద అవమాన భారంతో ఇంటికి వచ్చిన ప్రభాకరరావుకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఫోన్ చేశారు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతానంటున్నారని చెప్పారు. ప్రభాకరరావు అంత ఆసక్తి చూపించలేదు. మర్నాడు మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్ ప్రభాకరరావు కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. జరిగినదానికి క్షమాపణలు చెప్పారు. ఏలాగైనా సరే రాహుల్ ని ఒప్పించి పీవీ విగ్రహం దగ్గరికి తీసుకొని వస్తానని  హామీ ఇచ్చారు.  అది జరగలేదు. కృద్ధుడైన పీవీ తనయుడికి కొందరు మిత్రులు మీడియాగోష్ఠి నిర్వహించి కాంగ్రెస్ నాయకులను కడిగిపారేయమని సలహా ఇచ్చారు. మరికొందరు మౌనం వహించడమే మేలని చెప్పారు. రెండో సలహా పాటించి ప్రభాకర్ మౌనం పాటించారు. రాహుల్ గాంధీతో పాటు కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖడ్గే కూడా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో చదువుకున్నారు. పీవీ నుంచి ఉపకారం పొందినవాడు. ఆయన కూడా పక్కనే  ఉన్న పీవీ విగ్రహానికి ఒక నమస్కారం చేయాలని ఆలోచించలేదు. ఎవరు మాత్రం ఎటువంటి సాయం చేయగలరు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టాలనీ, బీజేపీకి అదే సరైన ప్రత్యామ్నాయమనీ భావించే మేధావులు సైతం ఇటువంటి పొరబాట్లు, గ్రహపాట్ల కారణంగా విసుగు చెందుతున్నారు.

సావర్కర్ వ్యక్తిత్వం ఏమిటి?

ఇంతకీ వీరసావర్కర్ ఎవరు? ఆయన రాజకీయ వైఖరి ఏమిటి? ఆయన జీవితం ఎటువంటిది? వర్తమాన రాజకీయాలలో లబ్ధికోసం గతించిన మహానాయకులకు లేనిపోని అపవాదాలు ఆపాదించి వారిని వాడుకోవడం సమంజసమా? గాంధీ, వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లను కాంగ్రెస్ నాయకులు 2014 వరకూ వాడుకున్నారు. ఈ ముగ్గురినీ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ క్రమంగా కాజేసింది. ఇప్పుడు వీర్ సావర్కర్ గురించి గొడవ జరుగుతోంది. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్ననాయకులందరినీ కాంగ్రెస్ ఒక విధంగానూ, బీజేపీ మరో విధంగానూ అభివర్ణిస్తూ, అపార్థం చేసుకుంటూ తమతమ వాదాలలో గెలుపొందడానికి పాత నాయకులను వాడుకుంటున్నారు. వాస్తవంగా ఆయా నాయకుల వ్యక్తిత్వాలనూ, వారు విశ్వసించిన భావజాలాన్ని మదింపు చేసే ప్రయత్నం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేయకపోవడం దేశ ప్రజల దురదృష్టం. ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్ర ఘట్టం ముగించనున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పైన ఘాటైన విమర్శ చేశారు. ఆ విమర్శ కొత్తదేమీ కాదు. ఇప్పుడు కొత్తగా చేయవలసిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర మహాకూటమిలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలసి సహజీవనం చేస్తున్న కారణంగా శివసేన పరమ పవిత్ర మూర్తి అనీ, నూటికి నూరు పాళ్ళు దేశభక్తుడనీ పూజించే సావర్కర్ గురించి రాహుల్ వ్యాఖ్యానించడం ప్రాప్తకాలజ్ఞత అనిపించుకోదు. మొన్ననే జైలు నుంచి విడుదలై వచ్చిన శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నట్టు రాహుల్ అనవసరంగానే సావర్కర్ ప్రస్తావన తెచ్చి మహాకూటమి ఉనికి అపకారం చేశారు. దానిని వినియోగించుకొని మహారాష్ట్ర బ్రాహ్మణులను బుట్టలో వేసుకోవాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. సావర్కర్ కీ, బ్రాహ్మణులకూ సంబంధం ఏమిటి?

భారత దేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత జరుగుతున్న రాజకీయ చర్చోపచర్చలలో కీలకమైన అంశాలుగా తెరపైకి వస్తున్న హిందూత్వవాదం, మైనారిటీల వ్యతిరేక ధోరణి వంటి అంశాలకు ఇద్దరు మహారాష్ట్ర బ్రాహ్మణులు, రెండు హిందూ సంస్థలు ప్రధానంగా కారణం. అఖిల భారత హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ రెండు హిందూ సంస్థలు. ఈ రెండు సంస్థల వెనక ఉన్న బ్రాహ్మణ మేధావులు దామోదర్ వీర్ సావర్కర్, కేశవ్ రావ్ బలీరాం హేడ్గేవార్. ఇద్దరూ హిందూ మత సమర్థకులే అయినప్పటికీ ఇద్దరి మధ్య చాలా విషయాలలో విభేదాలు ఉన్నాయి.

ముస్లింలీగ్ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా హిందూ మహాసభ పుట్టింది. ముందు బెంగాల్ ను మతప్రాతిపదికపైన విభజించారు. తర్వాత మోర్లీ- మింటో సంస్కరణలు క్రమంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు సృష్టిస్తాయేమోనని హిందువులు భయపడిపోయారు. ఈ పరిణామాలతో హిందూ జనసభ  పుట్టుక వేగిరమైంది. హిందూ సభను పంజాబ్ లో లాలా లజపతిరాయ్ ప్రారంభించారు. అనంతరం బాంబే ప్రెసిడెన్సీలోనూ, బిహార్ లోనూ, బెంగాల్ లోనూ నెలకొల్పారు. విడివిడిగా ఏర్పడిన సంస్థలన్నీకలిసి 1915 కుంభమేళా సందర్భంగా హరిద్వార్ లో ఒక సర్వోన్నత సంస్థ ఆవిర్భవించింది. ఆరేళ్ళ తర్వాత దానికి ‘హిందూ మహాసభ’ అని నామకరణం చేశారు. 1930ల ప్రారంభంలో బాలకృష్ణ శివరాం ముంఝే,సావర్కర్ లు రంగప్రవేశం చేసిన అనంతరమే హిందూ మహాసభ ఊపందుకున్నది.

సావర్కర్ చిన్నతనం నుంచీ విప్లవాత్మకమైన రాజకీయాలలో విశ్వాసం ఉన్నవారు. కాంగ్రెస్  వాసనలు లేనివారు. విద్యార్థి దశలో అభినవ్ భారత్ అనే సంస్థను నెలకొల్పి విప్లవం ద్వారా స్వాతంత్ర్యం సంపాదించాలని తలపోసినవారు. ఆ విషయం స్పష్టంగా, విస్తారంగా రాశారు. బ్రిటిష్ ప్రభుత్వంపైన గెరిల్లాయుద్ధం చేస్తున్నట్టు కలలు కనేవారు. అప్పటి దాకా సిపాయీల తిరుగుబాటు అని పిలిచే 1857నాటి ఘట్టాన్ని ‘ప్రథమ స్వాతంత్ర్య సమరం’ అని సగౌరవంగా అభివర్ణించిన  మేధావి సావర్కరే. ఆ పేరుతో ఒక పుస్తకమే రాశారాయన. ముంఝే కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఇద్దరికీ గాంధీ, నెహ్రూల పొడ గిట్టదు.

సావర్కర్ రాసిన పుస్తకం బ్రిటిష్ వారికి ఆగ్రహం తెప్పించింది. వారు ఆ పుస్తకాన్ని నిషేధించారు. అదే సమయంలో మోర్లే-మింటో సంస్కరణల సంఘంపైన సాయుధ తిరుగుబాటును సావర్కర్ సోదరుడు గణేష్ నిర్వహించారు. గణేశ్ ను దోషిగా నిర్ణయించారు. దానితో లండన్ లో ఉన్న సావర్కర్ జాగ్రత్త పడ్డారు. పారిస్ వెళ్ళి తెలిసిన వారింట్లో తలదాచుకున్నారు. అయినా బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఓడలో ఇండియాకు పంపించారు. ఎస్ఎం మారియో అనే ఓడ రాత్రి పూట మార్సెల్లీలో 8 జులై 1910నాడు ఆగినప్పుడు సావర్కర్ ఓడ గది నుంచి తప్పించుకున్నారు. కానీ పోలీసులు తిరిగి అరెస్టు చేశారు. ఇండియాకు తీసుకొని వచ్చి విచారించారు. 50 ఏళ్ళ కారాగార శిక్ష విధించారు. అప్పుడాయన వయస్సు 28ఏళ్ళు. అండమాన్ కి పంపించారు. బ్రిటిష్ అధికారులకు పూర్తిగా లొంగితే కానీ విడుదల చేయరని తెలుసుకున్నారు. విడుదల కావడంకోసం వారు చెప్పిన పనులు చేశారు. వద్దన్న పనులు మానివేశారు. అప్పటి నుంచి సావర్కర్ పైన విమర్శలు ప్రారంభమైనాయి. గాంధీ, నెహ్రూ వంటి కాంగ్రెస్ నేతలు జైలు జీవితం గడిపారే కానీ విడుదల కోసం రాజీ పడలేదనీ, సావర్కర్ రాజీపడ్డారనీ కాంగ్రెస్ వాదన. జైలు జీవితానికి జడిసి క్షమాభిక్ష కోరారన్నది ఆరోపణ. క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ రాసిన లేఖనే రాహుల్ గాంధీ మహారాష్ట్రలో విలేఖరులకు చూపించారు. అది ఒక పార్శ్వం మాత్రమే. సావర్కర్ ను గాంధీ స్వాతంత్ర్య సమర యోధుడుగానే పరిగణించారు.

విడుదలైన తర్వాత సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. హిందు మతంలో సంస్కరణలు తేవడంపైన ఆయన దృష్టి పెట్టారు. సావర్కర్ ఛాందసుడు కాదు. ఆధునికుడు. హేతుబద్ధంగా ఆలోచించేవారు. అదే పద్దతిలో మాట్లాడేవారు. ఆవును ఒక పశువుగానే పరిగణించారు కానీ గోమాత అంటూ దాన్ని ప్రార్థించడాన్ని తప్పుపట్టారు. ఈ విషయంలో సావర్కర్ పేరును బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నాయకులు ప్రస్తావించరు. కాంగ్రెస్ ను ఎదిరించిన నాయకుడుగా, ముస్లింలంటే గిట్టని వ్యక్తిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, హిందూ సంస్థ అభివృద్ధికి పాటుబడిన మేధావిగా మాత్రమే వాదనలలోకి సావర్కర్ పేరును తీసుకొని వస్తారు. సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రదర్శించడం మానుకున్న తర్వాత గాంధీ, తదితరులు విజృంభించారు. గాంధీ దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. సావర్కర్ హిందూ మహాసభలో ఒక వర్గానికి నాయకుడిగా మిగిలిపోయారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మహారాష్ట్రలోని రత్నగిరిలో గృహనిర్బంధంలో ఉన్నారు. సావర్కర్, ముంఝే ఇద్దరూ హిందువుల ఆధిపత్యాన్ని కోరుకున్నారు. వారిని, వారి విశ్వహిందూమహాసభనూ పూర్వపక్షం చేస్తూ కాంగ్రెస్ బాగా ఎదిగింది. అప్పుడే సావర్కర్ అనుయాయి హడ్గేవార్ హిందువుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఒక సంస్థను నెలకొల్పాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ను నెలకొల్పారు. అది ఎంతగా విస్తరించిందో, ఎంత నిర్ణయాత్మకంగా ఎదిగిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

కులవ్యవస్థకు వ్యతిరేకం

వీర్ సావర్కర్ మాంసాహారాన్నివ్యతిరేకించలేదు. కులవ్యవస్థను గర్హించారు. కులాలు నిర్మూలం కావాలని కోరుకున్నారు. 1934లో బీహార్ లో భూకంపం వచ్చింది. దాన్ని భగవంతుడి శాపంగా గాంధీ అభివర్ణిస్తే దాన్ని సావర్కర్ ఖండించారు. ఇందులో భగవంతుడి ప్రస్తావన అనవసరం అన్నారు. సావర్కర్ హేతువాదాన్నీ, అభ్యుదయ భావజాలాన్నీ హిందూత్వ వాదులు ఎక్కడా మాటవరుసకైనా చర్చలోకి తీసుకొని రారు. 1980లలో అయోధ్య ఉద్యమ సమయంలో సావర్కర్ ను బీజేపీ ప్రస్తావించడం, ప్రస్తుతించడం ప్రారంభించింది. అండమాన్ సెల్యులార్ జైలులో సావర్కర్ పేరుతో ఉన్న ఫలకాన్ని మణిశంకర్ అయ్యర్ పెడసరంగా పెరికించివేయడంతో హిందూత్వవాదుల ఆగ్రహం పెల్లుబికింది. అప్పటి నుంచి హిందూత్వవాదులు గాంధీనీ, పటేల్ నూ, సుభాష్ చంద్ర బోస్ నూ సొంతం చేసుకున్నారు. ముస్లిం వ్యతిరేకత, మైనారిటీలకు వ్యతిరేకత ప్రస్తావన వచ్చినప్పుడు సావర్కర్ ని తెలకెత్తుకుంటారు. ఆయన కూడదని చెప్పిన గోపూజ చేస్తారు. అహేతుకంగా వ్యవహరిస్తారు.

సావర్కర్ ని పూర్తిగా శత్రువుల జాబితాలో చేర్చడం కాంగ్రెస్ తొందరపాటు చర్య. ఆయన చెప్పిన అభ్యుదయ భావాలను ప్రస్తావిస్తూ ఆయనను కూడా స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తిస్తే కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీలేదు. ముఖ్యంగా కులం, ఆవు విషయంలో సావర్కర్ అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించవచ్చు. సావర్కర్ అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ కు కానీ చెందిన నాయకుడు కారు. ఆయన బాటే వేరు.

ఇంతవరకూ సావర్కర్ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. మహాకూటమి పటిష్ఠంగానే ఉంది. మరోసారి రాహుల్ ఇటువంటి సున్నితమైన అంశాలపైన లౌక్యం లేకుండా దురుసుగా వ్యాఖ్యానించి శివసేనను ఇబ్బంది పెడితే మహారాష్ట్ర మహాకూటమికి నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ముంబయ్ నగరపాలిక (బృహన్ ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్-బీఎంసి) ఎన్నికలు సమీపిస్తుండటంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు రాహుల్ వ్యాఖ్యను పూర్తిగా వినియోగించుకుంటారు. ‘మరాఠీ మనూస్’ ను అగౌరవించారంటూ సెంటిమెంటు కార్డు ఉపయోగించి కాంగ్రెస్ ని దుయ్యపడతారు. అటువంటి కాంగ్రెస్ తో సిగ్గూఎగ్గూ లేకుండా శివసేన సంసారం కొనసాగిస్తున్నదంటూ ఎద్దేవా చేస్తారు. ఇటువంటి పరిణామాలను ఊహించకుండా ప్రమాదకరమైన, అనవసరమైన వ్యాఖ్యలు చేయడంతో పాదయాత్ర వల్ల కలిగిన లాభం  కొంతమేరకైనా హరించుకుపోతుంది. వీర్ సావర్కర్ గురించి కాకుండా శివసేనను నిలువునా చీల్చిన బీజేపీ దుష్ట రాజకీయాన్ని రాహుల్ ప్రశ్నించవలసింది. వేదాంత-ఫాక్స్ కాన్ ప్రాజెక్టు, మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి ఎన్నికలు జరగనున్న, ప్రదాని సొంతరాష్ట్రమైన గుజరాత్ కు తరలిపోతున్నాయి. గుజరాత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని ప్రస్తావించకపోయినా మహారాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో షిండే ప్రభుత్వం విఫలమైనదని విమర్శించవచ్చు. ఎక్కడ ఏ విషయం ఎంతవరకు మాట్లాడాలో తెలుసుకోవడం రాహుల్ గాంధీ కనీస బాధ్యత. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే రాహుల్ తో కలసి పాదయాత్ర చేసి సంఘీభావం ప్రకటిస్తే శివసేనకు నష్టం కలిగించే ప్రకటన చేయడం రాహుల్ కి తగని పని. శివసేనతో పొత్తు అక్కరలేదనీ, మహా వికాస్ ఆఘాడీ నుంచి నిష్క్రమించాలనీ నిర్ణయించుకుంటే అది వేరే విషయం. కానీ ప్రతిపక్షాలన్నిటినీ కలుపుకొని పోతేనే బీజేపీని నిలువరించడం కష్టమైన అని అనుకుంటున్నప్పుడు మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడం తెలివిమాలిన పని. దిగ్విజయ్ సింగ్, జైరాంరమేష్ లు రాహుల్ వెంటనే పర్యటిస్తున్నారు. ఏయే విషయాలపైన ఎట్లా స్పందించాలో రాహుల్ కి చెప్పే బాధ్యత వారైనా తీసుకోకపోతే ఎట్లా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles