చినజీయర్ స్వామి గురువు, గోదాదేవిని ప్రస్తుతిస్తూ సంస్కృత శ్లోకం రచించిన ప్రవక్త
నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు వరంగల్లు శివనగర్ లో ఇటీవలి కాలం వరకు చేసిన ఉభయవేదాంత ప్రవక్త.
నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి సంస్కృత భాషా పండితుడు, సాహితీకారుడు. అతను వేద వేదాంగాలను అధ్యయనం చేసిన వ్యక్తి. అతను గ్రంథరచన, పాఠప్రవచన, ధార్మిక వేదాంత శాస్త్ర విషయ ప్రబోధములతో జీవనయానాన్ని కొనసాగించారు. అతను త్రిదండి చినజీయర్ స్వామికి గురువు. చినజీయర్‌కు తర్కశాస్త్రం, సంస్కృతం బోధించారు. శ్రీవైష్ణవ పీఠాధిపతుల్లో చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు.
ఆయన 1 మే 1926 న శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వారి స్వస్థలం కృష్ణా జిల్లా, గుడివాడలోని మోటూరు. తల్లి శేషమ్మ, తండ్రి శ్రీనివాసతాతాచార్యులు. విద్యాభ్యాసం మొదట తాతాతండ్రుల వద్దనే జరిగింది. తండ్రి వద్ద సంస్కృతం, దివ్యప్రబంధాలు, సాంప్రదాయిక తదితర విషయాలను 1942 వరకు అభ్యసించాడు. 1946లో వరంగల్ వచ్చి శివనగర్‌లో స్థిరపడ్డారు. అతను హైదారాబాద్‌లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శ్రీభాష్యాది శాస్త్ర విషయాలను అధ్యయనం చేశాడు. అనంతరం వరంగల్‌లో సింహాద్రిబాగ్‌లోని వైదిక కళాశాలలో ప్రధానాచార్యులుగాను, ఆ తర్వాత విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ఉపన్యాసకులుగా సుమారు 40 సంవత్సరాలు పనిచేసి ఎందరినో సంస్కృతాంధ్ర భాషా పండితులుగా తీర్చిదిద్ది పదవీ విరమణ చేసాడు. బాల్యంలోనే కాంచీపుర పీఠాధిపతి ప్రతివాది భయంకర అణ్ణంగాచార్య స్వామివారితో మధిరేక్షణ శబ్దార్థ విషయంలో వివాదపడి ప్రసిద్ధులయ్యాడు. రాష్ట్రంలోని జీర్ణ దేవాలయోద్ధరణ కార్యక్రమాలను చేపట్టి కొన్ని దేవాలయాలను పునఃప్రతిష్ఠగావించాడు. సత్సంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్, శ్రీ పాంచరాత్ర ఆగమ పాఠశాలను నెలకొల్పి బ్రాహ్మణ విద్యార్థులకు వేదపాఠాలు, ఆగమం, స్మార్తం, దివ్యప్రబందం నేర్పించి ఎంతో మంది విద్యార్థులను అందించాడు. భగవత్ కైంకర్యనిధి పేరుతో ధార్మిక సంస్థను నెలకొల్పి 28 శ్రీమద్రామాయణ క్రతువులను నిర్వహించాడు.
సత్సంప్రదాయ పరిరక్షణ సభ కార్యక్రమాన్ని నిర్వహించే వారు. సత్సంప్రదాయ పరిరక్షణ సభ తోపాటు, సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్ అను సంస్థలను స్థాపించి తొంభైకి పైగా గ్రంథాలను రచించి ముద్రింపచేశారు.అనేకనూతన దేవాలయాలను,శిథిలావస్థలో ఉన్నదేవాలయాలను ప్రతిష్ఠించారు. సంస్కృత విజ్ఞానవర్ధిని పరిషత్‌ను స్థాపించి దీని ద్వారా ఆరు గ్రంథాలను ప్రచురించాడు. సత్సంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మరో 54 గ్రంథాలను ముద్రించాడు. (2018 అక్టోబరు 13న వరంగల్ శివనగరలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. భార్య సీతమ్మ. వారికి నలుగురు కుమార్తెలు శేషమ్మ, శ్రీదేవి, నీలాదేవి, గోదాదేవి)
శ్రీవిష్ణుసహస్రనామభాష్యమ్,ముండకోపనిషత్, కఠోపనిషత్, ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, శ్రీభాష్యము (బ్రహ్మసూత్ర రామానుజ భాష్యమ్) నకు తెలుగు వ్యాఖ్యానము, వేదప్రామాణ్యము, ఆధ్యాత్మచింత వేద సామ్రాజ్యం, సత్సంప్రదాయ సుధ, తత్వోపహారం, శ్రీరంగపతి స్తుతి, క్షమాషోడషి (తెలుగు వివరణ), విశిష్టాద్వైతము (తెలుగు-సంస్కృతం), శ్రీమాలికాస్తుతి, సంప్రదాయసుధాసారం, గోదాపురేశ మహత్యం (తెలుగు అనువాదం), శ్రీవైష్ణవ సౌభాగ్యము, అమృతవర్షిణి, భక్త రసాయనము, బుధరంజని (రెండు భాగాలు), గౌతమధర్మ సూత్రము, శ్రీవైౖష్ణవ సంప్రదాయ సౌరభము, లక్ష్మీస్తుతి మంజరి (సంస్కృత వ్యాఖ్య), శ్రీ వరవరముని వైభవస్తుతి, కేనోపనిషత్ (తెలుగు వ్యాఖ్యానం), ఉత్తర రామచరిత్ర, శ్రీకుమార తాతాచార్య వ్యాఖ్య వంటి అనేక గ్రంధాలు రచించినారు.త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి 1970లో ఉభయ వేదాంతచార్య బిరుదు ప్రదానం చేశాడు.1972లో రాష్ట్రపతి వి.వి. గిరి చేతులమీదుగా రాష్ట్రపతి పురస్కారం.1999లో తిరుమల తిరుపతి విశ్వవిద్యాలయం మహామహోపాధ్యాయ పురస్కారం,1996లో కవిశాస్త్రకేసరవి అవార్డు,కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, విజయవాడలో 2006లో గజారోహణము, కనకాభిషేకం జరిగాయి. తులాభార, స్వర్ణకంకణం, అశ్వారోహణము గౌరవాలూ అందుకున్నారు.2015 లో సంస్కృత పండితుల విభాగంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు – 2015 అవార్డు – హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2అమెరికాలోని అజో-విభో ఫౌండేషన్ కందాళం విశిష్ట పురస్కారంతో సన్మానించింది.
గోదాదేవిని ప్రస్తుతిస్తూ రచించిన సంస్కృత శ్లోకం ఇది:
శ్రీభూమి ప్రముఖాః భవన్తి మహిళాః శ్రీరంగభర్తుః ప్రియాః
తాస్వర్వా అపి విష్ణుచిత్తతనయా సామ్యంకథం ప్రాప్నుయుః
సూక్తైరద్భుత భావబన్ధమధురైః శ్రవ్యైస్సుశ్శబ్దోజ్జ్వలైః
దేవం ప్రీణయతిస్మయా స్వకవితాశిల్పశ్రియా గుంభితైః
ఈ శ్లోకానికి అర్థం: శ్రీమన్నారాయణునికి దేవేరులుగా శ్రీదేవి భూదేవి నీళాదేవి మొదలగువారెందరో ఉన్నారు కాని వారెవరున్నూ శ్రీ గోదాదేవికి సాటి రాజాలరు ఎందులకనగా… భక్తాగ్రణి అగు ఈ మహిళామతల్లి అద్భుత భావ బన్ధురములై మృదు మధురములైన సుశబ్దములతో గుంభితములై కర్ణ పేయామృతప్రాయములైన రెండు దివ్య ప్రబన్ధాలను తన కవితా చాతురితో ప్రసాదించి, శ్రీరంగనాథునికి సమర్పించి ఆస్వామి హృదయాన్ని ఆకర్షించి విదుషీమణి, ఆయనచే అంతరంగ పరిగ్రహంగా స్వీకరింపబడి సకల జగన్మాతయైనది.
కనుకనే తక్కిన దేవేరుల కంటె పరమ విలక్షణయైనది. తన శ్లోకానికి ఈ అర్థాన్ని రఘునాథాచార్యులవారే సమన్వియించి తిరుప్పావైకి ఒక పీఠికలో వివరించారు. వీరి శిష్యరికం చేయడానికి మా మేనవదిన గారి భర్త శ్రీమాన్ మరింగంటి శేషాచార్యస్వామి వారు రిటైరయిన తరువాత వరంగల్లుకు వచ్చి శివనగర్లో ఇల్లు కట్టుకుని అనేకానేక ఆధ్యాత్మిక అంశాలను వారి దగ్గరశ్రద్ధాభక్తులతో నేర్చుకున్నారు. వారిచ్చిన సూచనలు వివరాలు, నామీద ప్రేమతో ఇచ్చిన ఆశీస్సులు చాలా గొప్పవి. రఘునాథాచార్యులవారు స్వహస్తాలతో వారు రచించిన శ్లోకాన్ని వారే ఇచ్చిన వివరణ ఉత్తరం చిత్రాన్నిమనకు అందించారు. అదే పైన ఉంది.
ఈ రచయిత అమ్మ పేరు రంగనాయకమ్మ (10 నెలలకిందట వారు 93 సంత్సరాల వయసులో పరమపదించారు), పాత్రికేయుడు, వరంగల్ వాణి దినపత్రిక, జనధర్మ వారపత్రికల సంపాదకుడు, స్వతంత్ర సమరయోధుడు నాన్నగారు శ్రీనివాసాచార్య (ఎం ఎస్ ఆచార్య) 70 సంవత్సరాలవయసులో 1994లో పరమపదించారు. ఇప్పుడు 2024లో ఎం ఎస్ ఆచార్యగారి 100 శతాబ్ది మొదలవుతుంది. వారు అమ్మ అక్కగారి పేరు ఆండాళమ్మ. ఆ పెద్దమ్మ రామానుజుడి గురించి తిరుప్పావై గురించి కథలు కథలుగా వివరించే వారు. ఈ రచయిత టైఫాయిడ్ తో చిన్నపుడు పడకకే రెండు నెలలు పరిమితమైనపుడు రోజూ సాయంత్రం ఆమ్మ చెప్పిన రామాయణ గాధ వివరించేవారు. అదీ మన సంస్కృతి ఏ పరిస్థితిలోనైనా ఇటువంటి ధర్మప్రసంగాలు చెప్పేవారు. పెద్దమామ ప్రముఖ లాయర్ శ్రీమాన్ ఆసూరి మరింగంటి శ్రీనివాస రంగాచార్య రామనుజుడు గురించి చాలా విశేషాలు మార్గశిర మాసంలో నెల రోజు గోదాదేవి తిరుప్పావై వివరించే వారు, ఆండాళ్ తదితర ఆళ్వారుల విశేషాలు చాలా వివరంగా చెప్పేవారు. ప్రతిసారి ధనుర్మాసంలో తన వెంట ప్రతిసంవత్సరం కీస్ హైస్కూల్ ఆవరణలో జరిగే తిరుప్పావై ప్రసంగాలకు తీసుకువెళ్లి వినిపించి తీసుకువెళ్లేవాడు. వెళ్లి వచ్చే దారిలో దొరికే గంటా గంటన్నర సమయాల్లో కూడా ఆ వైష్ణవాచార్యుల విశేషాలను కళ్లకుకట్టినట్టు చెప్పే వారు. ఇదీ సంస్కృతి.