యాభైమూడేళ్ల క్రితం
నేను విశాఖ సముద్రాన్నీ
రావిశాస్త్రినీ ఒకే సారి చూశాను.
ముట్టుకున్నాను కూడ.
ఆయన కథలన్నీ
నాకు నోటికొచ్చేవి.
నిజానికి ఆయన కవి
కవిత్వాన్ని గురువు శ్రీశ్రీకి వదిలేసి
కథల వెంటపడ్డాడు.
కథలంటే కథలా!
మానవ జీవన వ్యథలు
ఉత్తరాంధ్ర భాషలో
ముంచి తీసిన తడి తడి రొదలు.
ఏ కోర్టుకు వెళ్లినా
అక్కడి వారు
యముడు పంపిన
స్పెషల్ టైపు పిశాచాల్లా ఉండటాన్ని
దర్శించిన ప్రజా న్యాయవాది.
నేరస్థుడిలోని న్యాయ బుద్ధి
వేశ్యాకూపంలోని శీలవతి
కూలివాడిలోని నిజాయితీని చూసిన
మానవీయ దార్శనికుడు రావిశాస్త్రి.
ఆనాటి సజీవ పాత్రలు
గేదెల రాజమ్మ, బంగారమ్మలు
మీకెక్కడైనా కనపడితే
దయచేసి చెప్పండి సార్!
వారిని మరోసారి వినాలనుంది.
మరో వందేళ్ల తర్వాత కూడా
నిలిచి ఉంటాడు రాచకొండ
ఎప్పటికీ చెదరని
కళాఖండాల బంగారు కొండ.
అన్నట్టు
ఆయన పునాదులు
మా నల్లగొండ జిల్లాలోని
రాచకొండలోనే ఉన్నాయి మరి!
క్యా సమజ్ రై సాహెబ్!
(మహా రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి శతజయంతి సందర్భంగా)
Also read: పురుషులందు…
Also read: పునర్ఘోష
Also read: గ్రౌండ్
Also read: బ్రెడ్
Also read: సముద్రం ముద్ర