తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 10 వ భాగం
ప్రజా శ్రేయస్సు – సమాజ హితం కోరుతూ, సంఘం పట్ల బాధ్యతను తెలియచేస్తూ, బడుగు, బలహీన వర్గాల వారి వేదన తెలియచేస్తూ అణగారినవారి జీవన కథాంశాలతో ఆ సామాజిక స్పృహతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి!
Also read: మాదాల రంగారావు ప్రగతిశీల చిత్రాల ప్రస్థానం
సామాజిక చైతన్యం – ప్రగతి భావజాలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి చాలా నిబద్ధత కావాలి. తను నమ్మిన ఆశయాలను ఆచరణలో చూపడానికి, అదీ ఎంతో వ్యయంతో కూడిన చిత్ర మాధ్యమంలో చూపడానికి బలమైన మానసిక సంసిద్ధత కావాలి! అంతకు మించి శ్రేయోభిలాషుల ఆసరా, ఆర్ధిక అండదండలందించే వారుండాలి. ఇవన్నీ ఉన్న – సమకూర్చుకున్న దర్శక – నిర్మాత – నటుడు ఆర్. నారాయణమూర్తి!
చిత్రరంగంలోకి ఆయన గురువు డా. దాసరి నారాయణరావుగారి ఆశీస్సులతో అడుగుపెట్టి కొన్ని వాణిజ్య చిత్రాలలో ఒకటి రెండు కథానాయక పాత్రల్లో నటించినా ఆ తరువాత తనది అంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకుని, అలుపు, అలసట, లాభనష్టాల విషయాన్ని పట్టించుకోకుండా చిత్రాలు నిర్మిస్తున్న ఆర్. నారాయణమూర్తి చిత్రాలను పరిశీలించినప్పుడు ప్రతి చిత్రంలోనూ సామాజిక సమస్య, చిత్ర కథాంశంగా ఉండటం గమనించదగిన ముఖ్య విషయం!
Also read: అభ్యుదయ భావాలకు ప్రతిరూపం మాభూమి
ఆయన నిర్మించి నటించిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రంలో వర్తమాన కాల, దేశ పరిస్థితులు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఎలా ఉన్నాయో అందువల్ల కొన్నివర్గాల ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, సహజత్వంతో కూడిన సంభాషణలు, దృశ్యాలతో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రం చూస్తున్నప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, ఇంకా ఇటువంటి పరిస్థితులున్నాయా దేశంలో అన్న ఆశ్చర్యంతో పాటు ఆవేదన, మార్చాలన్న ఆలోచనా కలుగుతాయి! మరి ఈ పరిస్థితులు మారాలంటే వచ్చిన స్వరాజ్యం “సురాజ్యం“ కావాలంటే ఏం చేయాలో కూడా పరిష్కారం చూపడం ఆర్. నారాయణమూర్తి లోని ఆశాభావం, సంఘ శ్రేయస్సు కోసం పడే తపన కనిపిస్తాయి!
వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు తప్పవు అన్న సంగతి అందరికీ తెలిసిందే! ఇక చిత్ర నిర్మాణం ప్రస్తుత పరిస్థితుల్లో మరింతగా వ్యాపారాత్మకమైనప్పుడు, లాభనష్టాల మాటను ప్రస్తావించుకోవడం అప్రస్తుతం కాదు!
Also read: వ్యవసాయం ఇతివృత్తంగా అనేక సినిమాలు
అయితే తన ఆశయాలను ఒక్కో సామాజిక సమస్యలో ప్రతిబింబించే చిత్ర ఇతివృత్తాలతో, వరసగా చిత్రాలు నిర్మించడం, ఆర్. నారాయణమూర్తి లోని సాహసోపేతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం!
ఒక భూపోరాటం చిత్రం గురించి ప్రస్తావించుకుంటే చిత్రం పేరులోనే కథ అర్థమవుతుంది! కానీ అది ఓ సమస్యగా, ఆర్. నారాయణమూర్తి చిత్రంగా ఆవిష్కరించిన తీరు, భూపోరాటం అంటే ఏమిటో తెలియని సామాన్య ప్రేక్షకుడిని కూడా ఆలోచింప చేస్తుంది. అదే ఆ చిత్రం లక్ష్యం! నారాయణమూర్తి ధ్యేయం!
అలా ఆర్.నారాయణమూర్తి చిత్రాలను పరిశీలించినట్లయితే ఎన్నో సమస్యలు, మన చుట్టూ ఉండడమే కాదు – మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మంది ఆ సమస్యల బాధితులయి ఉన్నారని తెలుస్తుంది.
అడవిలోకి చేరిన కొందరు వారి ఆలోచనలు, వారి దృక్పథం మీద వారికి అమిత విశ్వాసం ఉన్న వారి గురించి నిర్మించిన అడవి దివిటీలు చిత్రం ఒక వర్గం వారి ఆశయాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది.
ఇంచుమించు ఇలాంటి ఇతివృత్తానికి దగ్గరగా ఉండే చిత్రాలుగా చీకటి సూర్యులు, అరణ్యం, వేగుచుక్కలు మొదలైన వాటిని చెప్పుకోవచ్చు!
Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం
ఇవికాక నాగరిక సమాజానికి దూరంగా కనీస జీవన పరిస్ధితులకుండే సౌకర్యాలను పొందలేని గిరిజనులు, అణగారిన, బలహీన వర్గాల వారి గురించి ఆర్.నారాయణమూర్తి నిర్మించి నటించిన అడవిబిడ్డలు, దండకారణ్యం వంటి చిత్రాలు ప్రముఖంగా నిలుస్తాయి.
ఇక దండోరా, లాల్‌సలామ్, దళం వంటి చిత్రాలు ఆర్.నారాయణమూర్తి కున్న వామపక్ష భావాలను ప్రతిబింబిస్తాయి అంటే ఆక్షేపణ ఉండకూడదు. అయితే వీటన్నిటికన్నా విస్మరించకుండా చెప్పుకోవలసిన రైతురాజ్యం, అన్నదాతా సుఖీభవ చిత్రాలు దేశానికి రైతు ప్రాధాన్యతను తెలియచేస్తాయి! గరీబు అయినా, నవాబు అయినా తిండి కోసం రైతు రెక్కల కష్టం మీదే ఆధారపడాలి! మరి అటువంటి రైతు పరిస్ధితి, జీవన స్ధితి, ఎటువంటి దుస్థితిలో ఉందో తెలియచెప్పే చిత్రాల సారథి ఆర్. నారాయణమూర్తి.
పట్టెడు విత్తనాలు జల్లి, పుట్టెడు ధాన్యం పండించే రైతు దైన్య జీవితం సమగ్రంగా, సహజంగా, చిత్ర మాధ్యమంలో ప్రదర్శింపచేసిన దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి! ఎన్ని చట్టాలు, మరెన్ని వసతులు, రుణ సౌకర్యాలు కల్పిస్తున్నా రైతు జీవనం, ఏటికేడాది గండంలాగా ఉండటానికి కారణాలు ఆ చిత్రాల్లో చూపడం జరిగింది. రైతుల ఆత్మహత్యలకు బలమైన హేతుబద్ధమైన కారణాలను విశ్లేషిస్తూ, దళారులు, అధిక వడ్డీలతో దోపిడీ చేసే వారి వల్లనే, పంట పండించే రైతు జీవితం మంటల్లో కాలిపోతోందని తన చిత్రాలతో చెప్పిన ఆర్. నారాయణమూర్తి రైతు జీవితాన్ని సంపూర్ణంగా వెండితెర మీద ఆవిష్కరించిన దర్శక నిర్మాత, నటుడు!
ప్రగతి భావజాలం ఉన్న వ్యక్తి తను ఉండే వ్యవస్ధలోని లోపాలను బహిర్గతం చేస్తూ వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే ప్రయత్నం చేయడం, దార్శనికతను తెలియచేస్తుంది. అటువంటి దార్శనికత ఉన్న సృజనశీలి, ప్రజ్ఞాశాలి ఆర్. నారాయణమూర్తి.
Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’
ఈ సందర్భంలో రైతు సమస్యల మీద సంపూర్ణ అవగాహన, వారి జీవన భద్రత, శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తూ అనేక వ్యాసాల ద్వారా తన మనోభావాలలో రైతుల దుస్థితిని, ప్రజలకు, ప్రభుత్వానికి తెలియచేస్తున్న శ్రీ చలసాని నరేంద్ర మాటలు ఉదహరించడం అప్రస్తుతం కాదు. రైతులను బిచ్చగాళ్ళను చేయకండి అని ఆయన అన్నదాంట్లో ఉన్న ఆక్రోశాన్ని – రైతు పరిస్ధితి గురించి ఆయన ఆవేదన అర్ధం చేసుకుంటే అక్షరబద్దంగా ఆయన ప్రకటించిన భావాలు ఎంత అర్ధవంతమైనవో అర్ధం అవుతుంది!
విద్యాధికులు, సమాజ సంస్కర్తలు, మేధావులు, విభిన్న రంగాలలోని పరిశోధకులు ఒకరేమిటి, అందరూ అన్ని రంగాల వారికి ఇంత మెతుకు పెట్టేది ఒక్క రైతు మాత్రమే అన్న నిజాన్ని గుర్తించి ఆ రైతు సుఖమైన భవిత కోసం ఆరాటపడాలి! ఆలోచించాలి! అవసరమైన పోరాటమూ చేయాలి! అదే వారంతా రైతుకిచ్చే నిజమైన కానుక!
ఇదుగో ఇలా రైతు మన జీవితాల్లో ఎంతటి ప్రాధాన్యత వహిస్తున్నాడో తెలిపే చిత్రాలు ఆర్.నారాయణమూర్తి నిర్మించి, నటించి, దర్శకత్వం చేసి రైతు పట్ల తన నిబద్ధతను, వారి సంక్షేమాన్ని కోరుకోవడం జరిగింది.
నటుడు – నిర్మాత – దర్శకుడు ఆర్. నారాయణమూర్తి సారథ్యంలో మరిన్ని ప్రగతి భావజాల చిత్రాలు రావాలని ఆశించడం, అత్యాశ కాదు. దక్షిణాది చిత్ర రంగంలో ఆయనే సమర్ధుడు అన్నది అతిశయోక్తి కాదు. ఆయన చిత్రాల గురించి ఈ విశ్లేషణ పరిమితమైనది. నిజానికి ఓ సమగ్ర రచనకు, సంపూర్ణ పరిశీలనకు ఆయన చిత్రాలు అర్హమైనవి. అందుకే ఆర్. నారాయణ మూర్తికి లాల్‌సలామ్!
Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం
విలక్షణ దర్శకుడు టి.కృష్ణ
ప్రతి వ్యక్తి జీవితం మీద వాళ్ళు పెరిగి, తిరిగిన సమాజ ప్రభావం ఉంటుంది. కొందరు మారుతున్న పరిస్ధితుల వలన, తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఊహలను, ఉద్దేశ్యాలను మార్చుకుంటారు. ఆ రకంగా మార్పు కోరుకుంటారు. మరి కొందరు సమాజహితమైన భావాల ప్రభావంతో వారి జీవన గమ్యాన్ని నిర్దేశించుకుంటారు. అందుకు ఆఖరి క్షణం దాకా కట్టుబడి ఉంటారు. అలా, కళాశాల చదువుల ముందు నుంచీ కూడా, ప్రజా సంక్షేమం కోరే ఆలోచనలతో భావాలతో రూపుదిద్దుకున్న ప్రజా నాట్యమండలితో సన్నిహితంగా మెలగి, ఆ సంస్ధ ఉద్దేశ్యాలను చిత్ర మాధ్యమం ద్వారా ప్రజానీకానికి అందించిన సమర్ధ దర్శకుడు శ్రీ టి. కృష్ణ!
రాశికన్నా వాసి మిన్న అన్నట్టు, ఇంచుమించు పది చిత్రాలు మాత్రమే ఆయన దర్శకత్వంలో వచ్చినా ఆ చిత్రాలన్నీ ప్రభోదాత్మక చిత్రాలు కావడం విశేషమైతే, ఆర్ధికంగా కూడా విజయం సాధించడం మరో ముఖ్య విశేషం!
ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఆంధ్ర దేశంలో సామాజిక హితం కోరి విభిన్న కళారూపాల ద్వారా, ప్రగతి భావాలను, అభ్యుదయ ఆలోచనాశీలిని వ్యాప్తి చెందడానికి, అవిరామంగా కృషి చేస్తున్న “ప్రజా నాట్యమండలి“ గురించి ప్రస్తావించుకోవడం అప్రస్తుతం కాదు!
ప్రజా నాట్యమండలితో సన్నిహిత సంబంధం కలిగి, ఆ సంస్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న ఎందరో కళాకారులు, పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆరకంగా ప్రముఖులైన వారిలో ఇంతకు ముందు చర్చించుకున్న నిర్మాత – నటుడు డా. మాదాల రంగారావుతో పాటు సామాజిక ప్రయోజనంతోనే చిత్రాలను రూపుదిద్దిన ప్రముఖ దర్శకుడు శ్రీ తొట్టెంపూడి కృష్ణ అని చెప్పాలి.
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
దర్శకుడు టి. కృష్ణ చిత్రరంగానికి రాక పూర్వం ఒంగోలులో ప్రజా నాట్యమండలి కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా పాల్గొనేవాడు. అప్పటికే సమాజంలో రాజ్యమేలుతున్న అవినీతి అన్ని రంగాలలో వైరస్‌లా వ్యాప్తి చెందడం, టి.కృష్ణ దృష్టిని ఆకర్షించింది. సామాజికంగా, రాజకీయంగా ఇంకా ఇతర రంగాలలోనూ వేళ్ళూనుకున్న అవినీతిని వేరుమూలంగా నిర్మూలిస్తేనే సమాజంలో సమానత్వం, సుస్ధిరత్వం ఏర్పడతాయని గ్రహించిన వాడు దర్శకుడు టి. కృష్ణ. అందుకు “ప్రజా నాట్యమండలి“ వల్ల సముపార్జించుకున్న ప్రగతి భావ ధోరణి, ఆయనకు ఆలంబనగా నిలిచింది. నిజానికి ఆయన చిత్ర దర్శకత్వ మార్గానికి మార్గసూచి అయిందని చెప్పవచ్చు! అది ఆయన చిత్రాలను పరిశీలిస్తే అర్ధమవుతుంది.
“నా ప్రతి చిత్రం సమాజ ప్రయోజనం కోసం రూపుదిద్దుకున్నదే“ అని దర్శకుడు టి. కృష్ణ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది.
అది చిత్రబద్ధం చేస్తూ ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు నిజమని రుజువు చేశాయి. ఆయన చిత్ర కధాంశాలు సమకాలీన వాణిజ్య చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాదు సమాజంలో విభిన్న వర్గాల జీవితాలను స్పృశిస్తూ వారి చుట్టుపక్కల ఉన్న అవినీతి, ఏవిధంగా వారి బ్రతుకులను ఎన్ని రూపాలలో కబళిస్తోందో ఆసక్తికరమైన కధా కధనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకే ఆ చిత్రాలు ప్రేక్షకులతో కనెక్ట్ అవడంతో అవి విజయవంతం అయ్యాయి!
దర్శకుడు టి. కృష్ణ రూపొందించిన నేటి భారతం చిత్రాన్ని పరిశీలించినప్పుడు దశాబ్దాలపాటు పోరాటం సాగించి, సాధించిన స్వతంత్ర భారతదేశ పరిస్ధితి ఎలాంటి దుస్ధితిలో ఉందో, అందుకు కొందరు స్వార్ధ రాజకీయ నాయకుల పాత్ర ఏమిటో, సహజ సంభాషణలు, దృశ్యాలతో ప్రేక్షకులను ఆకర్షించడం, ఆలోచింప చేయడం విశేషం! దర్శకుడు టి.కృష్ణ చిత్రాలలో స్త్రీ పాత్రలు, అవి కధానాయిక పాత్రలైనా, సహాయ పాత్రలైనా బలంగా ఉంటాయి. సాటి మహిళలకు ఆత్మ స్ధైర్యం నింపేవిగా ఉంటూ చైతన్యవంతమైన భావాలను ప్రభోదిస్తూ ఉండటం, ఆ పాత్రల నిండుదనానికి నిదర్శనంగా ఉంటాయి.
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు
(సశేషం)